తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన అక్రమాలను మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి గుర్తుచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వాటిని ‘‘ది రిపోర్టెర్స్ కలెక్టివ్’’ కూడా బయట పెట్టిందని తెలిపారు.
తాడేపల్లిలో సోమవారం అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘దేశ వ్యాప్తంగా 51 లోక్ సభ స్థానాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు పొంతన కుదరలేదు. ఓట్ల నమోదులో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు పడిన ఓట్లలో భారీ వ్యత్యాసం బయట పడింది. పరకాల ప్రభాకర్ చెప్పినట్టుగానే రిపోర్టర్స్ కలెక్టివ్ కూడా చెప్పింది. దీనికి ఎన్నికల సంఘం ఎందుకు సమాధానం చెప్పటం లేదు. ప్రజల ఓట్లకు విలువలేదా? ఇదేనా ప్రజాస్వామ్యం? చంద్రబాబు నాయకత్వంలో ప్రజాస్వామ్యానికి భారీ ప్రమాదం ఏర్పడింది.
స్థానిక ఎన్నికలలో కూడా అధికారులు, పోలీసులు కుమ్మక్కయి వ్యవహరించారు. ఓడిన వారిని గెలిచినట్లు, గెలిచిన వారిని ఓడినట్లు చూపారు. ఇంతటి దారుణంగా ఎన్నికలు జరుగుతుంటే ఇక రాజ్యాంగం అమలయ్యేది ఎలా?’’ అని ప్రశ్నించారు.
కాగా, 2024 ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటల సమయానికి 56,067 మంది ఓటు వేసినట్లు ఈసీఐ అంతర్గత రికార్డుల్లో నమోదైంది. అయితే, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కలిపి కేవలం 24,596 మంది మాత్రమే ఓటు వేసినట్లు లెక్కల్లో చూపించారని ‘‘ది రిపోర్టెర్స్ కలెక్టివ్’’ బయటపెట్టింది.


