సాక్షి,వైఎస్సార్: పులివెందుల నియోజకవర్గ పరిధిలోని చక్రాయపేట పోలీసులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 12 మంది (మొత్తం 13 మంది) పార్టీ నాయకులపై పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి విచారణను నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ కేసులో వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టు చేయవద్దని పోలీసులను స్పష్టంగా ఆదేశించింది.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చక్రాయపేట మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. అయితే, దాడికి గురైన బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు, అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. దాడి చేసిన వారిని వదిలేసి, తిరిగి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి సహా 13 మంది నాయకులపై హత్యాయత్నం తదితర తీవ్రమైన సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయించారు.
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టారని, ఈ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జరిగిన ఘటనకు రాజకీయ రంగు పులిమి, ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నం సెక్షన్లు జోడించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు,ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన అనంతరం పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వైఎస్సార్‌సీపీ నాయకులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, వారిని అరెస్టు చేయవద్దని చక్రాయపేట పోలీసులకు స్పష్టం చేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో పులివెందుల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.


