‘జ్ఞానేశ్‌ బ్రో’కి బిగుస్తున్న ఉచ్చు.. కేంద్రం వైఖరిపై ఉత్కంఠ! | CEC Gyanesh Kumar Under Pressure: What Will the Centre Do Next | Sakshi
Sakshi News home page

‘జ్ఞానేశ్‌ బ్రో’కి బిగుస్తున్న ఉచ్చు.. కేంద్రం వైఖరిపై ఉత్కంఠ!

Oct 6 2026 12:49 PM | Updated on Oct 6 2026 1:52 PM

CEC Gyanesh Kumar Under Pressure: What Will the Centre Do Next

ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఇప్పటివరకు రాజకీయ విమర్శలు, నిరసనలకే పరిమితమైన వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు గడప దాటింది. జ్ఞానేశ్‌ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై కేంద్రం, ఎన్నికల సంఘం నుంచి సమాధానం కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం కీలక పరిణామంగా మారింది. అదే సమయంలో.. సోమవారం సుప్రీంకోర్టులో ఫామ్‌-6పై వచ్చిన వ్యాఖ్యలు, మంగళవారం ఢిల్లీలో రాహుల్‌ గాంధీ సహా విపక్ష ఎంపీల ఆందోళన.. ఈ వ్యవహారాన్ని మరింత వేడెక్కించాయి.

జ్ఞానేశ్‌ కుమార్‌ను సీఈసీ పోస్టు నుంచి తక్షణం సస్పెండ్‌ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. అయితే కేసును విచారణకు స్వీకరించి.. కేంద్రం, ఈసీతో పాటు జ్ఞానేశ్‌ కుమార్‌, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి తదితరులకు నోటీసులు ఇచ్చింది. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన 14 నిర్ణయాలు ఇతర కమిషనర్ల అభ్యంతరాలను పక్కనపెట్టి తీసుకున్నారన్నది పిటిషన్‌లో ప్రధాన ఆరోపణ. అలాగని ఇప్పటికిప్పుడు జ్ఞానేశ్‌ కుమార్‌ పదవికి ముప్పు వచ్చిందని చెప్పలేం. కానీ ఆయన నిర్ణయాలపై న్యాయపరీక్ష మొదలైందన్నది మాత్రం స్పష్టం.

అసలు చిక్కు ఆ ఫామ్‌తోనే!
ఈ వివాదంలో అత్యంత కీలకమైన అంశం ఫామ్‌-6. కొత్తగా ఓటరుగా నమోదు కావడానికి ఉపయోగించే ఈ ఫామ్‌కు ఎస్‌ఐఆర్‌ సమయంలో అదనపు డిక్లరేషన్‌ జతచేశారు. దాని విషయంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేసింది.“మార్చిన ఫామ్‌-6ను మేం ఆమోదించలేదు. రికార్డులు వచ్చిన తర్వాత ఎవరు ఏం మార్చారో చూస్తాం” అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. దీంతో ఈ మార్పులకు అసలు అధికారం ఎవరిది? ఏ ప్రక్రియలో జరిగాయి? అన్నది ఇప్పుడు కోర్టు పరిశీలనలోకి వచ్చింది.

ఇదే అంశంపై ఎన్నికల సంఘం మాత్రం ఇంతకు ముందు తన వివరణ ఇచ్చింది. బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నామని, సుప్రీంకోర్టు కూడా ఆ ఎస్‌ఐఆర్‌ అధికారాన్ని సమర్థించిందని పేర్కొంది. ఫామ్‌-6 విషయంలో రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలు తప్పుదోవ పట్టించేవిగా ఈసీ అభివర్ణించింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం తన ముందు ఉన్న రికార్డులను పరిశీలించి ఎవరు ఏ మార్పు చేశారో తెలుసుకుంటామని చెప్పడం.. ఈ వివాదం కొత్త మలుపు తిరిగినట్లైంది.

జ్ఞానేశ్‌ ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే..
ఇక జ్ఞానేశ్‌ కుమార్‌ ముందున్న అసలు పరీక్ష.. రాజకీయ విమర్శలకు సమాధానం ఇవ్వడం కాదు. సుప్రీంకోర్టుకు రికార్డులు సమర్పించి.. నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారో వివరించడం. ముఖ్యంగా 14 నిర్ణయాలపై మిగిలిన ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న ఆరోపణలపై ఈసీ వద్ద ఉన్న పూర్తి రికార్డులు కీలకం కానున్నాయి. నిర్ణయాలు ఏకగ్రీవంగానే జరిగాయని ఈసీ చెబుతున్న నేపథ్యంలో.. ఆ నిర్ణయ ప్రక్రియకు సంబంధించిన పత్రాలు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరి కేంద్రం ఏం చేయబోతోంది?
ఇక్కడే రాజకీయ ఉత్కంఠ మొదలవుతోంది. విపక్షాలు మాత్రం జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ సీఈసీని కేంద్ర ప్రభుత్వం సాధారణ పరిపాలనా ఉత్తర్వుతో తొలగించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుత దశలో కేంద్రం ముందున్న తక్షణ మార్గం సుప్రీంకోర్టుకు సమగ్ర సమాధానం ఇవ్వడం, ఎన్నికల సంఘం వైఖరిని చట్టపరంగా సమర్థించడం. అదే సమయంలో విపక్షాల తీరును ఎండగట్టడం. కోర్టు రికార్డులను పరిశీలించిన తర్వాత ఏదైనా నిర్ణయం చట్టానికి విరుద్ధంగా ఉందని తేలితే.. దాన్ని రద్దు చేసే అవకాశం ఉందని ఇప్పటికే ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకే ఇప్పుడు కేంద్రం వైఖరి అత్యంత కీలకంగా మారింది.

రోడ్డెక్కిన విపక్షాలు.. ‘జ్ఞానేశ్‌ బ్రో.. ఇట్స్‌ డన్‌’
సుప్రీంకోర్టు పరిణామాల మరుసటి రోజే ఢిల్లీలో విపక్షాలు భారీ ఆందోళనకు దిగాయి. మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్‌ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్‌ చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో పార్లమెంట్‌ స్ట్రీట్‌ వద్దే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. “జ్ఞానేశ్‌.. ఇట్స్‌ డన్‌ బ్రో. టైమ్‌ టు రిజైన్‌” అంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆందోళనకు నినాదంగా మారింది. సీఈసీ రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్‌, ఫామ్‌-6 వ్యవహారంపై సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు.. ఈసీ కార్యాలయం చుట్టూ భారీగా భద్రత ఏర్పాటు చేయడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎంపీలను ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో నిరసన మరింత ఉధృతమైంది.

మరోవైపు సీజేపీ.. దేశవ్యాప్త ఉద్యమానికి రెడీ
ఇదంతా జరుగుతుండగానే సీజేపీ కూడా జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ, విద్యార్థి బృందాలు పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టాయి. ఎన్నికల జాబితా ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తున్నాయి. అంటే ఒకవైపు పార్లమెంటరీ విపక్షాల నిరసనలు.. మరోవైపు యువత ఆధారంగా సాగే సీజేపీ ఉద్యమం.. ఇంకోవైపు సుప్రీంకోర్టు విచారణ. మూడు దారుల్లో ఒత్తిడి పెరుగుతోంది.

అసలు ఉత్కంఠ ఇక్కడే..
ఇప్పటివరకు ఎస్‌ఐఆర్‌ వివాదం ప్రధానంగా “ఎన్నికల సంఘం వర్సెస్‌ విపక్షాలు” అన్నట్టుగా కనిపించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నోటీసులతో వ్యవహారం “ఎన్నికల సంఘం నిర్ణయాలు చట్టబద్ధంగానే జరిగాయా?” అనే ప్రశ్నకు చేరింది. కేంద్రం కూడా ఇప్పుడు రెండు విషయాలను సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఒకటి.. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడటం. రెండోది.. సుప్రీంకోర్టు అడిగిన రికార్డులు, వివరణలను సమర్థంగా సమర్పించడం.

అందుకే ఇప్పుడు అందరి చూపూ ఒక్కచోటే.. సుప్రీంకోర్టు తదుపరి అడుగు ఏంటి? దానికి కేంద్రం ఇచ్చే సమాధానం ఏంటి? జ్ఞానేశ్‌ కుమార్‌ వ్యవహారంలో అసలు ట్విస్ట్‌ అక్కడే ఉండబోతోంది.

ఇదీ చదవండి: జ్ఞానేశ్వర్‌ దిష్టిబొమ్మ కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement