సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో కొన్ని పంచాయతీల్లో అభ్యర్థుల నామినేషన్లు టీడీపీ గూండాలు చించివేశారు. టీడీపీ నేతలు దౌర్జన్యాలపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కలెక్టరేట్‌లో ఛాంబర్ బయట బైఠాయించిన నిరసన చేపట్టారు. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు అనుసరిస్తున్న అప్రజాస్వామిక చర్యలపై మండిపడ్డారు. రామచంద్రపురం మండలం అనుపల్లి పంచాయితీలో నలుగురు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.
తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లిలో నామినేషన్ కేంద్రం వద్ద తిరుపతి రూరల్ జడ్పీటీసీ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. నామినేషన్లు తిరస్కరించడం ప్రజాస్వామ్య విరుద్ధం అని ఆయన మండిపడ్డారు. చంద్రగిరి మండలం తొండవాడ నామినేషన్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్నాకు దిగారు. చంద్రగిరి మండలం పిచ్చినాయుడు పల్లి పంచాయతీల నామినేషన్లను తిరస్కరించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆర్వో లంచాలు తీసుకొని తమ నామినేషన్లను తిరస్కరించారంటూ సర్పంచ్ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. చిన్న చిన్న కారణాలు చూపి తిరస్కరించడం దారుణమని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: అనంతలక్ష్మి సంచలన నిర్ణయం.. టీడీపీకి రాజీనామా?


