అలిగి వెళ్తున్న రామనారాయణరెడ్డిని కూర్చోవాలని కోరుతున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా టీడీపీలో నేతల మధ్య ఉన్న అంతర్గత పోరు మరోసారి బట్టబయలైంది. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో తనను సంప్రదించకుండా, అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బాహాటంగానే ఫైర్ అయ్యారు. ఆత్మకూరు నియోజకవర్గం జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను బహిష్కరించారు. జెడ్పీటీసీ సభ్యులు కూడా ఆయన వెంట నిష్క్రమించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
వేమిరెడ్డి పెత్తనంపై తీవ్ర అసంతృప్తి
జిల్లాలో సీనియర్ మంత్రి అయిన ఆనం రామనారాయణరెడ్డి కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటు నెల్లూరు కార్పొరేషన్ మేయర్‌తోపాటు జెడ్పీ చైర్మన్ ఎంపిక విషయంలో అధిష్టానం ఏకపక్షంగా తీసుకుంటూ తనను విస్మరిస్తోందని ఆయన లోలోన రగలిపోతున్నారు. గతంలో చక్రం తిప్పిన ఆనంకు ప్రత్యామ్నాయంగా జిల్లా పెత్తనం మరో మంత్రి నారాయణతోపాటు ఎంపీ వేమిరెడ్డి కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లింది. ఆది నుంచి జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి పెత్తనాన్ని ఆనం అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో డిస్ట్రిక్ట్ డెవలెప్‌మెంట్ రివ్యూ కమిటీ (డీడీఆర్) సమావేశంలో కూడా వేమిరెడ్డిని అవమానించారు.
తాజాగా మరోసారి జెడ్పీ చైర్మన్ ఎంపికలో వేమిరెడ్డి దంపతులు ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక తీవ్ర విమర్శలు చేస్తూ కార్యక్రమాన్ని బహిష్కరించారు. జిల్లా మంత్రి అయినప్పటకీ పార్టీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఆయనకు తెలియకుండా జరిగిపోతుండడంతో తనకు జరిగిన అవమానంగా భావిస్తున్నారు. నెల్లూరు మేయర్ అభ్యర్థి ఎంపికను కూడా మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి సిఫారసులతోనే ఖరారు చేశారు. జెడ్పీ చైర్మన్‌గా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి అభ్యర్థిని ప్రతిపాదించారు. దాదాపు రూ.25 కోట్లు వరకు ఖర్చు కూడా చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకునేలా వ్యూహ రచన చేశారు. కానీ రాత్రికి రాత్రే ఆనం ప్రతిపాదించిన అభ్యర్థి కాకుండా ఎంపీ వేమిరెడ్డి దంపతులు ప్రతిపాదించిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అభ్యర్థత్వాన్ని ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం ప్రకటన చేయడంతో ఒక్కసారిగా మంత్రి ఆనం హతాశుడయ్యారు. జిల్లా మంత్రిగా తన ప్రమేయం లేకుండానే ఎలా ప్రకటన చేస్తారంటూ ఆయన రగిలిపోయాడు. ఎన్నికల అనంతరం జెడ్పీ వైస్ చైర్మన్ పదవిని కూడా మంత్రి ఆనంకు తెలియకుండానే సర్వేపల్లి నియోజకవర్గాన్ని కేటాయించడం ఆయన మరింత అసహనానికి లోనయ్యాడు. పార్టీ తీసుకున్న కీలక నిర్ణయాల్లో తన మాట తీసుకోకపోవడంపై అధిష్టానంపై కినుక వహిస్తున్నాడు.
డిప్యూటీ మేయర్ కోసం పట్టు
నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆనం పట్టుపడుతున్నాడు. తన సోదరుడి కుమారుడైన రంగమయూర్‌రెడ్డికి డిప్యూటీ మేయర్ పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పటికే తనకు తెలియకుండా.. మేయర్, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, కనీసం డిప్యూటీ మేయర్ విషయంలోనైనా తన మాట తీసుకోవాలంటూ పార్టీ అధిష్టానానికి సంకేతం పంపారు. మంత్రి ఆనం స్వయంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి నివాసానికి వచ్చి డిప్యూటీ మేయర్ పదవి ఆనం రంగమయూర్‌రెడ్డికి ఇవ్వాలని అభ్యర్థించాడు.
మేయర్ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో డిప్యూటీ మేయర్ రూరల్‌కు కేటాయించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చెప్పిన వారికే డిప్యూటీ మేయర్ పదవి రానుండడంతో మంత్రి ఆనం స్వయంగా వెళ్లి అభ్యరి్థంచడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన జెడ్పీ చైర్మన్ ఎన్నికకు హాజరైన మంత్రి ఆనం వేమిరెడ్డి దంపతులు ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక.. ప్రమాణ స్వీకార హాల్ నుంచి నుంచి అలకబూని నిష్క్రమించారు.
ఇదీ చదవండి: అనంతలక్ష్మి సంచలన నిర్ణయం.. టీడీపీకి రాజీనామా?


