సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠం మీదేనంటూ ఆశ చూపారు. నేనున్నాను.. ఎన్నికల బరిలోకి దిగాలని భరోసా ఇచ్చారు. స్వయంగా అధినేత చంద్రబాబే చెప్పిన ఈ మాటల్ని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పిల్లి అనంతలక్ష్మి నమ్మారు. జెడ్పీటీసీ ఎన్నికల బరిలోకి దిగి గెలిచారు. ఇంకే ముంది జెడ్పీ పీఠం తనదేనని ఫిక్సయ్యారు.
అధికారిక ప్రకటనతే తరువాయి అనుకుంటూ ప్రమాణ స్వీకారానికి సైతం సిద్ధమైపోయారు. సరిగ్గా ఆ సమయంలోనే ఊహించని శరాఘాతం తగిలింది. చంద్రబాబు రాత్రికి రాత్రే ప్లేటు ఫిరాయించేశారు. జెడ్పీ పీఠం జనసేనకు చెందిన కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. చైర్‌పర్సన్‌గా ఆ పారీ్టకి చెందిన బుర్రా దివ్య సునీతరాజ్‌ను ఎంపిక చేశారు. వైస్ చైర్‌పర్సన్ పదవితో సరిపెట్టుకోవాలంటూ అనంతలక్ష్మికి ఓ ఉచిత సలహా పారేశారు. ఈ కపట నాటకంతో పిల్లి అనంతలక్ష్మి వర్గం భగ్గుమంది.
అవమానం.. ఆగ్రహం.. అలక
జెడ్పీ చైర్‌పర్సన్ పదవి దక్కకపోవడం అనంత లక్ష్మికి భరింపరాని అవ మానంగా మారింది. అధిష్టానం తీరుపై ఆగ్రహంతో రగిలిపోయిన ఆమె అలకబూనారు. అధిష్టానం ఆఫర్ చేసిన జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ పదవి స్వీకరించేందుకు ఆసక్తి చూపలే దు. జెడ్పీటీసీ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చే సేందుకు జెడ్పీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా.. తన నివాసంలోనే ఉండిపోయారు. నేతలను, కార్య కర్తలకు కలిసేందుకు సైతం ఇష్టపడలేదు. ఆమెను బుజ్జగించేందుకు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తదితరులు ఆమె ఇంటికి వెళ్లారు. కూటమి ధర్మం పాటించాలని కోరారు. తాను జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ పదవి తీసుకునేదే లేదని ఆమె తెగేసి చెప్పేశారు.
జెడ్పీ కార్యాలయంలోనూ అవమానమే
జెడ్పీ సమావేశానికి రావాలంటూ కూటమి ప్రజాప్రతినిధులు బతిమాలడంతో అనంతలక్ష్మి జెడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సైతం ఆమెకు అవమానమే ఎదురైంది. ప్రొటోకాల్ ప్రకారం ఆమెను వేదిక పైకి పిలవలేదు. తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతో తీరని మనస్తాపానికి గురైన అనంతలక్ష్మి జెడ్పీటీసీ సభ్యురాలిగా సైతం ప్రమాణ స్వీకారం చేయకుండానే అలిగి వెళ్లిపోయారు. అక్కడున్న టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు సర్దిచెప్పినా ససేమిరా అంటూ సమావేశ మందిరం నుంచి ని్రష్కమించారు. కనీసం ప్రమాణ స్వీకారమైనా చేయాలని బతిమాలినా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. వైస్ చైర్‌పర్సనే కాదు.. జెడ్పీటీసీ పదవి కూడా తనకు వద్దంటూ మండిపడ్డారు.
ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యమా?
కాకినాడ నగరంలో కూటమిలోని ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యం కల్పిస్తున్నారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. సిటీ ఎమ్మెల్యే స్థానాన్ని మత్స్యకార సామాజికవర్గ నేతకు కేటాయించారు. ఎమ్మెల్సీ కూడా అదే సామాజికవర్గ నాయకుడికే దక్కింది. తాజాగా కాకినాడ నగర మేయర్ పదవి విషయంలోనూ అదే సామాజికవర్గానికి చెందిన అభ్యరి్థకి అవకాశం కల్పించారు. బీసీల్లో కేవలం ఆ ఒక్క సామాజికవర్గమేనా.. ఇతరులు లేరా.. రాజకీయ ప్రాతినిధ్యంలో కూటమి నాయకత్వం సామాజిక సమతుల్యత పాటించదా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి అనంతలక్ష్మికి జెడ్పీ చైర్‌పర్సన్ పదవి ఇవ్వకపోవడం ఆ సామాజికవర్గంలో అసంతృప్తికి ఆజ్యం పోస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఇస్తామని గతంలోనూ మోసం
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పిల్లి అనంతలక్ష్మి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే స్థానం ఆశించారు. కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా దీనిని జనసేనకు కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సముచిత స్థానం కల్పిస్తామని, ఎమ్మెల్సీ ఇస్తామని ఆశ చూపి అప్పట్లో ఆమెను చంద్రబాబు బుజ్జగించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా లోకేష్ కోటరీలోని నేతలందరికీ ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు కట్టబెడుతున్నారే తప్ప, హామీ ఇచ్చిన అనంతలక్ష్మికి మాత్రం ఏ పదవీ ఇచ్చిన దాఖలాల్లేవు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు జెడ్పీ పీఠం విషయంలో కూడా మరోసారి మోసం చేయడంపై ఆమె వర్గీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. హామీలిచ్చి ప్రజలనే కాదు.. నమ్ముకున్న పార్టీ నాయకుల్ని కూడా నయవంచన చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అనే విషయం మరోసారి నిరూపితమైందని ఆ పార్టీ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శిస్తున్నారు.
కూటమి తీరుపై ఆగ్రహం
కూటమి పెద్దల నిర్ణయంపై అనంతలక్ష్మి వర్గం గుర్రుగా ఉంది. బీసీల పార్టీ చెప్పుకొనే టీడీపీలో సీనియర్ ఆ వర్గం మహిళను నమ్మించి నట్టేట ముంచడమే మేలు చేయడమా అని మండిపడు తున్నారు. అడగకపోయినా జెడ్పీ పీఠం ఇస్తామంటూ చంద్రబాబే లేనిపోని ఆశలుకల్పించారని, ఆయన నేరుగా ఇచ్చిన హామీతోనే జెడ్పీటీసీకి పోటీ చేశారని, తీరా ఆ పీఠంపై కూర్చోబెట్టాల్సిన సమయం వచ్చాక నమ్మద్రోహం చేస్తారని అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం హామీకే దిక్కు లేకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కనీసం ప్రొటోకాల్ ప్రకారం వేదిక పైకి ఆహ్వానించలేదని, ప్రాధాన్యం కల్పించలేదని అంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన, దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతున్న అనంతలక్ష్మికి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీలో సీనియారిటీకి కనీస గుర్తింపు లేకుండా పోవడం దారుణమని ఆమె వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


