సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీ నేతలపై నమోదైన హత్యాయత్నం కేసులో వీరారెడ్డి సహా మరో తొమ్మిది మందికి మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. దీంతో, ఏపీ పోలీసులు తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
వివరాల మేరకు.. ఈ నెల 19వ తేదీన తొండూరు మండలం అగడూరులో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. అయితే, పోలీసులు మాత్రం తిరిగి వైఎస్సార్సీపీ నేతలపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నామినేషన్ వేయకుండా అడ్డుకుని వీరారెడ్డితో పాటు మరో తొమ్మిది మందిని మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోలీసులు అరెస్ట్ చేసి తొండూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, దుష్యంత్ రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో వారిని లింగాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదే రోజు రాత్రి 7.30 గంటలకు వైఎస్ అవినాష్ రెడ్డి, దుష్యంత్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డి లింగాల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వీరారెడ్డి తదితరులపై క్రైమ్ నంబర్ 48/2026 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం, ఈ నెల 20వ తేదీ రాత్రి 10 గంటలకు పోలీసులు నిందితులను పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. అయితే అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచలేదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కన్వీనర్, న్యాయవాది ఓబుల్ రెడ్డి మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ రెడ్డి ముందు వాదనలు వినిపించారు.
19వ తేదీ రాత్రి లింగాల పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు నమోదు చేసిన ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. అరెస్టుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని న్యాయవాది వివరించారు. ఇరుపక్షాల వాదనలు, సమర్పించిన ఆధారాలను పరిశీలించిన మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ రెడ్డి వీరారెడ్డితో పాటు మిగిలిన తొమ్మిది మందికి బెయిల్ మంజూరు చేశారు.
ఇదీ చదవండి: అల్లూరి జెడ్పీ వైఎస్సార్‌సీపీదే


