అన్ని శాఖలకు ఆర్థికశాఖ ఉత్తర్వులు
తద్వారా పన్నేతరరాబడి గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకోండి
ఫిబ్రవరిలో అసెంబ్లీకి 2027–28 వార్షిక బడ్జెట్ సమర్పణ
ఆదాయ వనరులను పెంచడానికి చర్యలను సూచించండి
బకాయిల వసూళ్లతో సహా పన్ను రాబడి అంచనాలు సమర్పించండి
కొత్తగా ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ప్రతిపాదించవద్దు
ఉన్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తగ్గించే చర్యలు చేపట్టండి
మంజూరు చేసిన పథకాలు, పనులకే వాస్తవికతతో బడ్జెట్ ప్రతిపాదనలు
మూలధన వ్యయానికి పీపీపీ, ఈఏపీ, నాబార్డు, హడ్కో నిధులు
బడ్జెట్ ప్రతిపాదనలను వచ్చే నెల 23లోగా సమర్పించాలి
సాక్షి, అమరావతి: పన్నేతర రాబడిని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ సంబంధిత శాఖలకు సూచించింది. కొన్ని సంవత్సరాలుగా పన్నేతర ఆదాయంలో పెరుగుదల లేదని, ఇందుకు ప్రధాన కారణం పరిపాలన విభాగాలు క్రమానుగతంగా చార్జీలను సవరించకపోవడమేనని తెలిపింది. అలాగే పన్ను రాబడులు పెంచేందుకు సంబంధిత శాఖలు ప్రతిపాదనలను సమర్పించాలని కోరింది. 2027–28 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రస్తుత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాల సమర్పణకు సమగ్ర సూచనలు చేస్తూ ఆర్థిక ముఖ్యకార్యదర్శి పీయూష్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఫిబ్రవరిలో 2027–28 బడ్జెట్‌ను అసెంబ్లీకి సమర్పించనున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో నిధి ఆర్థికశాఖ పోర్టల్‌లో వచ్చే నెల 23వ తేదీలోగా అన్ని శాఖలు బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. పన్నేతర రాబడి తగ్గుతోందని, ఇందుకు చార్జీలు సవరించకపోవడంతో పాటు పర్యవేక్షణ లేకపోవడమే కారణమని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో ఇప్పుడున్న స్థాయి కంటే పన్నేతర ఆదాయం పెంచేందుకు గట్టిప్రయత్నాలు చేయాలని సూచించారు. అన్ని శాఖలు అన్ని వనరులను సమీక్షించి పన్నేతర రాబడి పెంచేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. వివిధ రకాల వడ్డీలు, డివిడెండ్‌లు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని, పరిపాలన విభాగాల్లో పటిష్టమైన పర్యవేక్షణతో లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. ఆర్థిక వనరులను పెంచాల్సి ఉన్నందున బకాయిల వసూళ్ల కోసం హెచ్‌వోడీలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు.
ఉత్తర్వుల్లో పేర్కొన్న మరికొన్ని సూచనలు..
» పన్ను రాబడులను ప్రస్తుత పన్ను రేట్లు ఆధారంగా అంచనాలను ప్రతిపాదించాలి. వసూలు చేయాల్సిన బకాయిలతో కలిపి సహేతుకమైన వృద్ధితో పన్ను రాబడి ప్రతిపాదనలతో పాటు కొత్తగా ఆర్థిక వనరులు పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనలను చేయాలి. ప్రస్తుత సంవత్సరంలో బకాయిల వసూళ్లను అంచనా వేయాలి.
» కొత్తగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రతిపాదించవద్దు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని సమీక్షించడం ద్వారా తగ్గించాలి. ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించిన సిబ్బంది వేతనాలకు మంజూరు ఉత్తర్వులతో ఒప్పంద సేవలకు అవసరమైన నిధులు ప్రతిపాదించాలి.
» సంబంధిత శాఖల ఆమోదం తరువాతనే కన్సల్టెంట్స్, రిటైర్డ్ ఉద్యోగుల పునర్నియామకాలకు వేతనాలు ప్రతిపాదించాలి. ప్రభుత్వం నుంచి అనుమతి లేని ఎటువంటి అంశాలకు కేటాయింపులు ప్రతిపాదించరాదు.
» మౌలిక సదుపాయాల మూలధన వ్యయానికి అప్పులపైనే ఆధారపడాలి. కనెక్టివిటీ, గృహనిర్మాణం, తాగునీరు, విద్య, ఆరోగ్యంతో పాటు పారిశ్రామికీకరణ వంటి మూలధన వ్యయ వనరుల ప్రతిపాదనలను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ), ఈఏపీ, నాబార్డు, హడ్కోల నుంచి రాబట్టేలాగ దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఇంజనీర్లు పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. వేతనేతర వ్యయంలో 20 శాతం పొదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
» పథకాల వ్యయానికి ప్రతిపాదనలు సమర్పించడానికి ఆర్థికశాఖ ముందస్తు అనుమతి తీసుకోవాలి. మేనిఫెస్టో పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు అవసరమైన పూర్తి డేటాతో ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రతిపాదనలను సంబంధిత శాఖల అధికారులు సమీక్షించిన తరువాత పంపాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రతిపాదనలు కేంద్రానికి పంపే ముందు ఆర్థికశాఖ అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర పథకాలు, సంక్షేమ పథకాల లబ్దిదారుల అర్హతలను సంబంధిత శాఖల అధికారులు సమీక్షించాలి. ఊహాజనిత గణాంకాలతో ప్రతిపాదనలు చేయవద్దు. బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు సంబంధిత డాక్యుమెంట్లు, ఉత్తర్వులను శాఖాధిపతులు, సచివాలయ శాఖలు సమర్పించాలి.


