ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద తీరం దాటిన ఆక్వాన్
తీరం దాటేలోపే తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనం
ఉత్తరాంధ్రకు తప్పిన భారీ వర్షాల ముప్పు
రాష్ట్రంలో 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు
సాక్షి, అమరావతి: ఆక్వాన్ తుపాను ముప్పు నుంచి రాష్ట్రం తప్పించుకుంది. అది ఒడిశా వైపు మరలి గోపాల్‌పూర్ దగ్గర తీరం దాటడంతో రాష్ట్రంపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. నాలుగు రోజులుగా ఈ తుపాను రాష్ట్రాన్ని కలవరపెట్టింది. చివరికి శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య దక్షిణ ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తుపానుగానే తీరం దాటింది. ఇది ఒడిశా మీదుగా ఉత్తర–ఈశాన్య దిశగా కదులుతూ శనివారానికల్లా అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉత్తరాంధ్రకు భారీవర్షాల ముప్పు తప్పింది.
గంటగంటకు మారిన దిశ..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆక్వాన్ మొదట్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదిలింది. ఆ దశలో ఇది నెల్లూరు–తుని మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. ఆ తర్వాత అది నెల్లూరు–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రకటించారు. ఆ తర్వాత నర్సాపురం–పూరీ అని చెప్పి చివరికి గోపాల్‌పూర్ వద్ద తీరం దాటుతుందని తేల్చారు. ఉత్తరాది నుంచి వచ్చిన పొడిగాలులు, తక్కువ సముద్ర ఉష్ణోగ్రతలు తుపానును బలహీనపరిచాయి.
ఉత్తరాది నుంచి వచ్చిన పడమటి గాలులు మేఘాలను చెల్లాచెదురు చేయడంతో దాని దిశ మారినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సముద్రంపై ఉన్నప్పుడే ఆక్వాన్ బలహీనపడింది. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు తీవ్ర తుపాను నుంచి తుపానుగా మారింది. తుపాను కేంద్రం చుట్టూ ఉండాల్సిన దట్టమైన మేఘాలు చెదిరిపోవడంతో వర్షాల తీవ్రత కూడా తగ్గింది.
ఉత్తరాంధ్రకు ఊరట..
మొదట శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, గోదావరి జిల్లాల్లో అత్యంత భారీవర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఆ తర్వాత భారీ వర్ష సూచనను శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకే పరిమితం చేశారు. తీరం దాటే సమయానికి ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కురిశాయి. శని, ఆదివారాల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు మాత్రమే పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు..
తుపాను ప్రభావంతో గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 16.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. కంచిలిలో 14.8, కవిటిలో 14.3, సోంపేట మండలం కొర్లాంలో 12.8, పలాసలో 12.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మందస, వజ్రపు కొత్తూరు, టెక్కలి, నందిగం తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.
ఆర్టీజీఎస్ డబ్బా..
సకల శాఖలను కబ్జాచేసి హంగామా చేస్తున్న చంద్రబాబు మానసపుత్రిక ఆర్టీజీఎస్ తుపాను సమయంలో మరింత అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తుపాను హెచ్చరికలు, సమాచారం ఇవ్వాల్సింది వాతావరణ శాఖ కాగా ప్రజలను అప్రమత్తం చేయాల్సింది విపత్తుల నిర్వహణ సంస్థ. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ రెండింటినీ రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ఆక్రమించింది. తాజాగా ఆక్వాన్ తుపానుపై భారత వాతావరణ శాఖను కాదని ప్రజలను తప్పుదోవపట్టించేలా సొంత జోస్యం చెప్పింది. చివరకు అది తప్పని తేలింది.


