ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పెళ్లి ముహూర్తాలు ఎట్టకేలకు వచ్చేశాయి. కొంత కాలంగా ముహూర్తాలు లేక నిలిచిపోయిన పెళ్లిళ్లు శనివారం నుంచి తిరిగి మొదలు కానున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాకు పెళ్లిళ్ల సందడి వచ్చింది. డిసెంబర్ 15వ తేదీలోపు 11 రోజులు శుభకార్యాలకు మంచి రోజులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. డిసెంబర్ 16న ధనుర్మాసం మొదలవుతున్నందున అప్పటి నుంచి జనవరి 15 వరకు శుభకార్యాలు చేయకూడదని సూచిస్తున్నారు. శనివారంతో పాటు ఈ నెల 22, 24, 25, 26 మంచి ముహూర్తాలున్నాయి. అలాగే డిసెంబరు నెలలో 2, 3, 4, 5, 6, 11, 12వ తేదీలు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
పుష్కరాలే కారణం.. అందుకే హడావుడి
వచ్చే ఏడాది జూలై నుంచి గోదావరి పుష్కరాలు ఉండటంతో ఈ ముహూర్తం మరింత కీలకంగా మారింది. పుష్కర కాలంలో శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతుండటంతో సాధ్యమైనంత వరకు పెళ్లి కుదిరితే చాలు ముహూర్తం పెట్టేసుకోవాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. సంబంధం కుదిరిన వెంటనే ముహూర్తం పెట్టేసుకుంటున్నారు. దీంతో ఈ 11 రోజుల్లోనే జిల్లాలో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి.
ఇప్పుడు ఫుల్ బిజీ
పెళ్లిళ్లు నిలిచిపోవడంతో ఇటీవల పురోహితులకు, కల్యాణ మండపాల నిర్వాహకులకు, డెకరేషన్ చేసే వారికి, భాజా భజంత్రీల వారికి పెద్దగా పని లేకుండా పోయింది. మండపాలు ఖాళీగా ఉండిపోయాయి. డెకరేషన్ సామగ్రి మూలన పడింది. బ్యాండ్ మేళం వాయించే వారు ఇతర పనులు చేసుకుంటూ కాలం గడిపారు. ఇప్పుడు ముహూర్తాలు రావడంతో వీరంతా మళ్లీ బిజీ కానున్నారు. అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట, రావులపాలెం, రామచంద్రపురం తదిరత ప్రాంతాల్లోని కల్యాణ మండపాలన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. డెకరేషన్ వారికి అడ్వాన్సులు ఇస్తున్నారు. పురోహితులు ఒకే రోజు రెండు మూడు పెళ్లిళ్లకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.


