ఫోన్‌ చేతిలో ఉంటే చాలు.. మెదడుకు ముప్పేనా? | Smartphone Use Digital Amnesia | Sakshi
Sakshi News home page

ఫోన్‌ చేతిలో ఉంటే చాలు.. మెదడుకు ముప్పేనా?

Nov 21 2026 3:36 AM | Updated on Nov 21 2026 3:36 AM

Smartphone Use Digital Amnesia

హెల్త్‌

ఒకప్పుడు ఫోన్‌  నంబర్లు, అడ్రస్‌లు, దారులు.. అన్నింటికీ మన బ్రెయినే ఆధారం. మరి ఇప్పుడు .. అన్నింటికీ స్మార్ట్‌ ఫోనే ఆధారం. గూగుల్‌ గుర్తుచేస్తుంది.. జీపీఎస్‌ దారి చూపిస్తుంది.. క్యాలెండర్‌ మనం చేయాల్సిన పనులను గుర్తుచేస్తుంది. ఇలా మన మెదడు చేయాల్సిన ప్రతి పనినీ ఫోన్‌కే అప్పగిస్తున్నాం, అన్నీ సక్రమంగా సాగుతున్నాయి అనుకుంటున్నాం.. కానీ ఈ అలవాటు క్రమంగా జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనినే ‘డిజిటల్‌ మతిమరుపు’ (డిజిటల్‌ అమ్నేషియా) గా పిలుస్తున్నారు.

చిన్న లెక్కల నుంచి ప్రయాణ మార్గాల వరకు ప్రతి పనికీ నేడు సాంకేతికతపై ఆధారపడుతున్నాం. అవసరమైన సమాచారం ఎప్పుడైనా దొరుకుతుందిలే అన్న భావనతో.. గుర్తుపెట్టుకుందామనే ప్రయత్నం కూడా చేయట్లేదు. దీనివల్ల బ్రెయిన్‌కు పని తగ్గిపోయి స్థబ్దుగా మారిపోతోంది. అంతేకాదు నిద్ర లేచింది మొదలు.. మళ్లీ రాత్రి నిద్రపోయే వరకు నిరంతరం ఫోన్‌  చూస్తూ ఉండటం వల్ల నేర్చుకునే సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఒకవైపు సామాజిక మాధ్యమాలు.. మరోవైపు సందేశాలు, నోటిఫికేషన్లు.. మధ్యలో ఇతర పనులు. ఇలా ఒకేసారి ఎన్నో విషయాలపై దృష్టి పెట్టడం వల్ల కూడా ఏకాగ్రత దెబ్బతింటుంది. మెదడు సమాచారాన్ని సరిగ్గా గ్రహించి, జ్ఞాపకంగా నిల్వ చేసుకోవడానికీ ఇబ్బంది పడుతుంది. అందుకే స్మార్ట్‌ఫోన్, టెక్నాలజీపై ప్రతి దానికి ఆధారపడటాన్ని అలవాటు చేసుకోకుండా ఉండాలి. అపుడు బ్రెయిన్‌ చురుగ్గా పనిచేస్తుంది. టెక్నాలజీ మన పనులను సులభం చేయాలి కానీ.. మన మెదడుకు బదులుగా మారకూడదు. ఫోన్‌ లో జ్ఞాపకాలను భద్రపరచుకోవచ్చు. కానీ మన జ్ఞాపకశక్తికి మాత్రం మనమే పని చెప్పాలి!

ఇలా చేద్దాం..

  • రోజులో కొంతసేపు ఫోన్‌ కు దూరంగా ఉండాలి.

  • రోజూ పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలి.

  • ముఖ్యమైన నంబర్లు, తేదీలను గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి.

  • ధ్యానం, ఏకాగ్రత పెంచే సాధనలు చేయాలి.

  • అవసరం లేని నోటిఫికేషన్లను నిలిపివేయాలి.

  • ఒకేసారి అనేక పనులు చేయకుండా ఒక్కో పనిపై దృష్టి పెట్టాలి.

  • కొంత సమయం డిజిటల్‌ పరికరాలకు దూరంగా గడపాలి.

ఇదీ చదవండి: 'మాటిమాటికీ ఈ పొట్ట ఎంట్రీ ఏమిట్రా?!'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement