నెల్లూరు(అర్బన్): తనను సహచర ఉద్యోగి వేధిస్తున్నారని, జీతం బిల్లులు పెట్టలేదని, ప్రమోషన్ ఇచ్చినట్టే ఇచ్చి రివర్షన్ ఇచ్చారని పేర్కొంటూ ఆర్‌అండ్‌బీ నెల్లూరు సర్కిల్ ఎస్‌ఈ ప్రసాద్‌రావుపై ఆ శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ బొలిగర్ల ప్రభావతి నాలుగు రోజుల క్రితం కోర్టు కెళ్లారు. దీంతో హైకోర్టు వివరాలు పరిశీలించి ప్రభావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
దీనికి సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం ఆర్‌అండ్‌బీ శాఖకు చేరాయి. తీర్పు ప్రకారం ప్రభావతికి సీనియర్ అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్‌గా ఎస్‌ఈ ఇచ్చిన రివర్షన్ చెల్లదని, ప్రమోషన్ కొనసాగించాలని పేర్కొంది. అలాగే రెండునెలలుగా ఆపేసిన జీతానికి సంబంధించిన బిల్లులు పెట్టాలంది. అంతేకాకుండా జీతాల బిల్లు విషయంలో ట్రెజరీలో ఆటంకాలు కల్పించడాన్ని తప్పు పట్టింది. అభ్యంతరాలు చెప్పరాదని ఆదేశించింది.
రెండు నెలల క్రితం కూడా పదేళ్లుగా పనిచేస్తున్న సూపరింటెండెంట్లు ముగ్గురికి కూడా ఇదే ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రివర్షన్ ఇచ్చారు. దీంతో ఎస్‌ఈపై వారు కూడా కోర్టుకెళ్లారు. విజయం సాధించారు. తాజాగా ప్రభావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈకి చెంపపెట్టు లాంటిదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇకనైనా వేధించడం మానుకోవాలని, ఒకరిద్దరు సిబ్బందితో కుమ్మక్కై వారు చెప్పినట్టు ఎస్‌ఈ ప్రవర్తించడం, మిగిలినవారిని ఇబ్బంది పెట్టడం, వేధించడం మానుకోవాలని ఉద్యోగులు పేర్కొంటున్నారు.


