70 ఏళ్ల సమస్యకు నీనా గుప్తా సమాధానం! | Meet Neena Gupta solved a Maths problem that remained unanswered for 70 year | Sakshi
Sakshi News home page

70 ఏళ్ల సమస్యకు నీనా గుప్తా సమాధానం!

Nov 21 2026 3:26 PM | Updated on Nov 21 2026 3:36 PM

Meet Neena Gupta solved a Maths problem that remained unanswered for 70 year

Zariski Cancellation Problem- prof.Neena Gupta success story చాలా మంది విద్యార్థులు గణితం  (Mathematics) అంటే  భయపడిపోతారు. అత్యంత కష్టమైన సబ్జెక్టులలో ఒకటిగా భావిస్తారు, కానీ నీనా గుప్తాకు (Neena Gupta) తీరే వేరు. ఆమెకు మాథ్య్‌ అంటే వల్లమాలిన  ప్రేమ.  కోల్‌కతాకు చెందిన ఈ గణిత శాస్త్రవేత్త దాదాపు డెబ్బై ఏళ్లుగా సమాధానం దొరకని ఒక క్లిష్టమైన గణిత సమస్యను పరిష్కరించి, దేశంలో గణిత పరిశోధన రంగంలో ఆమెను అత్యంత ప్రముఖ   వ్యక్తుల్లో ఒకరిగి నిలిచారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితం (STEM) రంగాలలో భారతీయ మహిళలు ఎంత బాగా రాణిస్తున్నారు అనడగానికి  ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారు. గణిత శాస్త్రవేత్తలకు కూడా చాలా కష్టంగా ఉన్న ఒక సమస్యను ఆమె పరిష్కరించిన  ఆమె విజయ ప్రస్థానం గురించి తెలుసుకుందామా.

భారత గణిత శాస్త్రవేత్త నీనా గుప్తాకు టైమ్100 నెక్స్ట్ ఇండియా 2026 పురస్కారం లభించింది. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నీనా గుప్తా, ' హెల్త్‌ అండ్‌ సైన్స్‌ ఇన్నోవేటర్స్‌'  విభాగంగలో టైమ్100 నెక్స్ట్ ఇండియా 2026 పురస్కార గ్రహీతలలో ఒకరిగా  ఎంపికయ్యారు. దీంతో ఎవరీ నీనా గుప్తా అనేది  ఆసక్తికరంగా మారింది. 

2014లో 70 ఏళ్ల నాటి 'జారిస్కీ క్యాన్సిలేషన్ ప్రాబ్లమ్' (Zariski Cancellation Problem) పై ఆమె చేసిన పరిశోధన, ఫలితం కేవలం దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆమె కృషికి 2021లో రామానుజన్ ప్రైజ్ (Ramanujan Prize), 2024లో ఇన్ఫోసిస్ ప్రైజ్ (Infosys Prize) వంటి ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి.

గణితం కష్టమని భావించే విద్యార్థులకు లేదా పరిశోధన కొందరికి మాత్రమే సాధ్యమని అనుకునే వారికి  నీనా గుప్తా సక్సెస్‌  ఒక కొత్త దృక్పథాన్ని అందిస్తుంది.   గణితాన్ని లేదా మరేదైనా సబ్జెక్టును ప్రేమిస్తూ సమాజంలో మార్పు తీసుకురావాలనుకునే ప్రతి ఒక్కరికీ ఆమె స్ఫూర్తిదాయకం. గణిత ప్రపంచంలో నీనా గుప్తా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.రాణించాలనే కలలు  కనే ఎంతోమందికి ఆమె  ఆదర్శం. కృషి, అంకితభావం ఉంటే ఏదైనా సాధ్యమేనని ఆమె ప్రయాణం నిరూపిస్తుంది.సైన్స్‌లో కొన్ని గొప్ప ఆవిష్కరణలు ఇతరులు అడగడానికి ధైర్యం చేయని ప్రశ్నలను అడిగే ధైర్యంతోనే మొదలవుతాయనేందుకు  కోల్‌కతాలో ఒక సాధారణ గణిత ప్రేమికురాలిగా మొదలై అంతర్జాతీయ గుర్తింపు పొందిన పరిశోధకురాలిగా ఆమె ఎదిగిన ప్రయాణం, నేర్చుకోవాలనే తపన గొప్ప విజయాలకు దారితీస్తాయనడానికి నిదర్శనం. 

ఎవరీ నీనా గుప్తా?
1984 నవంబర్ 24 న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించిన నీనా గుప్తా, చిన్న వయసులోనే గణితంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరికీ గణితంలో మంచి ప్రావీణ్యం ఉంది.  ఆమెకు మొదటి గణిత ఉపాధ్యాయురాలు ఆమె తల్లి జ్ఞానలత. ఇదే గణితంపై ఆమెకున్న ఆసక్తిని మరింత  ప్రోత్సహించే వాతావరణం ఏర్పడింది. 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, తన తల్లి గణిత సాధనను చదువులో భాగంగా కాకుండా ఒక హాబీగా (అభిరుచిగా) భావించేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. 

విద్యాభ్యాసం
2006లో బెథూన్ కాలేజ్ (Bethune College) నుండి గణితంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (ఆనర్స్) పూర్తి చేశారు. ఆ తర్వాత కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ISI) లో చేరి, 2008లో గణితంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. పరిశోధనలపై ఉన్న ఆసక్తి ఆమెను ఉన్నత చదువుల వైపు నడిపించింది. ప్రొఫెసర్ అమర్త్య కుమార్ దత్తా మార్గదర్శకత్వంలో ఆల్జీబ్రా (Algebra) లో ప్రత్యేకతతో 2011లో ISI కోల్‌కతా నుండి గణితంలో పీహెచ్‌డీ (PhD) పట్టా పొందారు. ఆమె విద్యా ప్రయాణం చివరకు ఆమెను తిరిగి ISI కే తీసుకువచ్చింది, అక్కడ ఆమె తన పరిశోధన మరియు బోధనా వృత్తిని కొనసాగించారు.

'జారిస్కీ క్యాన్సిలేషన్ ప్రాబ్లమ్' ఏమిటి?
ఆల్జీబ్రాయిక్ జామెట్రీ (Algebraic Geometry) అనే గణిత విభాగంలోని 'జారిస్కీ క్యాన్సిలేషన్ ప్రాబ్లమ్'పై ఆమె చేసిన కృషి నీనా గుప్తా సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి. 1949లో ఆస్కార్ జారిస్కీ (Oscar Zariski) అనే గణిత శాస్త్రవేత్త ఈ సమస్యను మొదటిసారిగా ప్రతిపాదించారు. ఇది ఒక సవాలుతో కూడిన ప్రశ్నను లేవనెత్తింది: రెండు గణిత వస్తువులకు (objects) ఒక అదనపు డైమెన్షన్ (పరిమాణం) జోడించిన తర్వాత అవి నిర్మాణంలో ఒకేలా మారితే, అసలు వస్తువులు కూడా ఒకేలా ఉన్నాయని అర్థమా? ఇది  ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే, ఒక అదనపు డైమెన్షన్ జోడించిన తర్వాత ఒకేలా కనిపించే రెండు ఆకారాలను ఊహించుకోండి. అలాంటప్పుడు, అసలు ఆకారాలు కూడా ఖచ్చితంగా ఒకేలా ఉన్నాయని మనం చెప్పగలమా? ఏళ్ల తరబడి గణిత శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి ప్రయత్నించారు.

ఇదీ చదవండి :బుడ్డోడి ఫోజులకు ఫిదా : సర్‌ప్రైజ్‌ ఆఫర్‌

2014లో పాజిటివ్ క్యారెక్టరిస్టిక్ (positive characteristic)లో పనిచేస్తున్నప్పుడు దీనికి సమాధానం 'కాదు' (No) అని కూడా ఉండవచ్చని గుప్తా నిరూపించారు. ఒక ప్రతి-ఉదాహరణను (counter-example) రూపొందించడానికి ఆమె గణిత శాస్త్రవేత్త తకనోరి అసనుమా మొదట రూపొందించిన 'త్రీ-డైమెన్షనల్ అఫైన్ వెరైటీ'ని (three affine variety) ఉపయోగించారు. ఆమె చేసిన ఈ కృషి ఆల్జీబ్రాయిక్ జామెట్రీ మరియు కమ్యుటేటివ్ ఆల్జీబ్రాలో ఒక ముందడుగు. మరొక డైమెన్షన్‌ను జోడించడం వల్ల గణిత నిర్మాణాన్ని గుర్తించడానికి అవసరమైన సమాచారం ఎల్లప్పుడూ అలాగే ఉండదని ఇది నిరూపించింది.


అవార్డులు, అంతర్జాతీయ గుర్తింపు: గణితశాస్త్రంలో ఆమె పరిశోధనలు ఆమెకు అనేక ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ గౌరవాలను తెచ్చిపెట్టాయి.   

  • సరస్వతి కౌశిక్ మెడల్ (2013): జారిస్కీ క్యాన్సిలేషన్ ప్రాబ్లమ్‌పై ఆమె చేసిన పరిశోధనకు గాను TIFR అలుమ్ని అసోసియేషన్ ద్వారా ఈ పతకం లభించింది.

  • ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (INSA) యంగ్ సైంటిస్ట్ అవార్డు (2014): గణిత శాస్త్రానికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా లభించింది.

  • శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ (2019): గణిత శాస్త్ర విభాగంలో భారతదేశ అత్యున్నత శాస్త్రీయ గౌరవాలలో ఒకటైన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

  • TWAS యంగ్ అఫిలియేట్స్ (2020): శాస్త్రీయ పరిశోధనలకు సహకరిస్తున్న యువ పరిశోధకులలో ఒకరిగా గుర్తింపు పొందారు.

  • రామానుజన్ ప్రైజ్ (2021): అఫైన్ ఆల్జీబ్రాయిక్ జామెట్రీ మరియు కమ్యుటేటివ్ ఆల్జీబ్రాలో ఆమె చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డు లభించింది. ఈ అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్న మూడవ మహిళగా ఆమె నిలిచారు.

  • నారీ శక్తి పురస్కార్ (2020 , 2021):  గణిత శాస్త్రానికి ఆమె చేసిన సేవలకు గాను మార్చి 2022లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

  • ఇన్ఫోసిస్ ప్రైజ్ (2024): జారిస్కీ క్యాన్సిలేషన్ ప్రాబ్లమ్‌పై ఆమె చేసిన కృషికి గాను గణిత శాస్త్ర విభాగంలో ఈ బహుమతి లభించింది.

  • గణితశాస్త్రంలో ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సమావేశాలలో ఒకటైన 'ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మ్యాథమెటీషియన్స్ (ICM) 2022')లో ప్రసంగించ డానికి కూడా  ఆహ్వానం లభించింది.

 

 ఇదీ చదవండి: డెబ్యూతోనే ప్రశంసలు : ఒరాకిల్‌ నుంచి ‘తార’ గా ఎవరీ భామ? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement