యూపీలో ‘హైదరాబాద్‌ బిర్యానీ’ నచ్చదు | Why Azam Khan takes jibe at Asaduddin Owaisi Details Inside | Sakshi
Sakshi News home page

ఎంఐఎం చీఫ్‌ ఒవైసీకి ఎస్పీ నేత అజంఖాన్‌ చురకలు

Nov 21 2026 1:16 PM | Updated on Nov 21 2026 1:17 PM

Why Azam Khan takes jibe at Asaduddin Owaisi Details Inside

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికల రాజకీయ వేడి మొదలైంది. జైలు నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలై శుక్రవారం స్వగ్రామం రాంపూర్‌కు చేరుకున్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్‌ నేత అజంఖాన్‌.. ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై పరోక్ష విమర్శలు గుప్పించారు. రాంపూర్‌ సభలో అజంఖాన్‌ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ, ఆయన స్థాపించిన మహ్మద్‌ అలీ జౌహార్‌ యూనివర్సిటీకి మద్దతుగా ఒవైసీ మాట్లాడారు. ‘అఖిలేశ్‌ యాదవ్‌ సీఎంగా ఉన్నప్పుడు అజంఖాన్‌ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఎస్పీ నాయకత్వం ముస్లిం నేతలకు విలువ ఇవ్వడం లేదు. అజంఖాన్‌ జైలులో ఉన్నా అఖిలేశ్‌ మాత్రం స్వేచ్ఛగా బయటే ఉన్నారు’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

ఈ వ్యాఖ్యలపైనే జైలు నుంచి బయటకు రాగానే అజంఖాన్‌ స్పందించారు. తాను జైలులో ఉన్న సమయంలో ఒవైసీ తన ఇంటికి వచ్చి పరామర్శించలేదని, కనీసం తన భార్యకు ఫోన్‌ చేసి ఆరోగ్యం గురించి కూడా వాకబు చేయలేదని అజంఖాన్‌ ఆరోపించారు. అంతేకాదు, తమ ప్రాంతంలో ‘హైదరాబాద్‌ బిర్యానీ’కి ఆదరణ లేదని, ఇక్కడి ప్రజలు పులావ్, మటన్‌ బిర్యానీని ఇష్టపడతారని వ్యాఖ్యానించారు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన ఎవరూ సాధువు, మౌలానా కాలేరని, మౌలానాగా గుర్తింపు పొందేందుకు సంబంధిత విద్యార్హతలు అవసరమంటూ అజంఖాన్‌ వ్యాఖ్యానించారు. 2027 అసెంబ్లీ పోరు సాధారణ ఎన్నికల మాదిరిగా ఉండబోదని ఆజంఖాన్‌ పేర్కొన్నారు.

మార్పు కాదు.. ప్రళయమే
కులం, మతం ప్రాతిపదికన కాకుండా ఈసారి రాజ్యాంగ పరిరక్షణ, ప్రజా సమస్యలే ఎజెండాగా ఉంటుందని చెప్పారు. ‘ఈసారి ఎన్నికలు ఉండవు.. విప్లవం ఉంటుంది. మార్పు కాదు.. ప్రళయమే వస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది, అందుకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఘజియాబాద్‌లో లభించిన ఆదరణ, రాంపూర్‌కు చేరుకున్న కాన్వాయ్, తన నివాసం వద్దకు తరలి వచ్చిన అభిమానులు ప్రస్తుత రాజకీయ పరిణామాలకు సంకేతాలుగా ఆయన అభివర్ణించారు.

ఇదీ చ‌ద‌వండి: బీజేపీకి ఊహించని షాక్‌.. కాంగ్రెస్‌ భారీ విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement