సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో వైరస్‌ల దాడి మొదలైంది.. మారుతున్న వాతావరణం, తేమతో H1N1 స్వైన్ ఫ్లూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇది సాధారణ జ్వరమే అనుకుంటే పొరపాటే.. కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుండటంతో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
తాజాగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన పలువురు వైద్యులు, ఇతరులు H1N1 బారినపడినట్లు సమాచారం. దీంతో ఆసుపత్రులకు ఫ్లూ లక్షణాలతో వస్తున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో చాలామంది వైద్యులను సంప్రదిస్తున్నారు. కాగా, H1N1 సోకితే సాధారణంగా అకస్మాత్తుగా జ్వరం, పొడి దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, చలి, తీవ్ర అలసట, ఒళ్లు నొప్పులు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అయితే ప్రతి జ్వరం H1N1 అని భావించాల్సిన అవసరం లేదు. ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతోనూ ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం.
ఈ లక్షణాలుంటే అలర్ట్!
జ్వరం, దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, తగ్గని అధిక జ్వరం, గందరగోళం, పెదాలు నీలంగా మారడం లేదా లక్షణాలు క్రమంగా తీవ్రం కావడం వంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, మధుమేహం ఉన్నవారు, గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
H1N1 Alert in Delhi
Delhi has issued an advisory amid concern over H1N1 (swine flu). Common symptoms include fever, cough, sore throat, runny nose, body ache, headache and tiredness.
People should maintain hand hygiene, cover their mouth while coughing or sneezing, avoid…— Vishawkarmjit Singh (@Vicki_00001) August 21, 2026
వ్యాప్తిని అడ్డుకోవాలంటే..
ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని తగ్గించేందుకు చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండడం, లక్షణాలు ఉన్నప్పుడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. మొత్తంగా.. ఢిల్లీలో పెరుగుతున్న ఫ్లూ కేసుల నేపథ్యంలో భయపడాల్సిన అవసరం లేకపోయినా, నిర్లక్ష్యం మాత్రం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణ జ్వరం అనుకుని వదిలేయకుండా.. లక్షణాలు తీవ్రంగా మారుతున్నాయా? శ్వాసలో ఇబ్బంది ఉందా? అనే విషయాలను గమనించడం కీలకం.


