విమానంలో మృత్యువుతో పోరాడి గెలిచిన ప్రయాణికుడు | Doctors Delhi Aizawl Flight Save Critically Ill Passenger | Sakshi
Sakshi News home page

మృత్యువు అంచుల వరకు వెళ్లిన ప్రయాణికుడు.. చావును ఎలా గెలిచాడంటే?

Oct 5 2026 3:14 PM | Updated on Oct 5 2026 3:23 PM

Doctors Delhi Aizawl Flight Save Critically Ill Passenger

ఢిల్లీ నుంచి ఐజ్వాల్‌కు వెళ్తున్న విమానంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ ప్రయాణికుడి ఆక్సిజన్ స్థాయి అకస్మాత్తుగా 40 శాతానికి పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వైద్యులు వెంటనే చికిత్స అందించారు. విమానంలోనే అత్యవసర వైద్యం ప్రారంభించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడగలిగారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆ ప్రయాణికుడు డయాలసిస్‌కు సంబంధించిన వైద్య పరీక్షల కోసం ప్రయాణిస్తున్నాడు. విమానం మధ్యలో ఉండగా అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలై ఆక్సిజన్ స్థాయి దాదాపు 40 శాతానికి పడిపోయింది. దీంతో కేబిన్ సిబ్బంది వైద్య సహాయం కోసం ప్రకటన చేశారు.

విమానంలో ఉన్న జనరల్ సర్జన్ డాక్టర్ విలీ లాల్‌హ్రుయిట్‌లుంగా, పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ ఎఫ్. రేమ్‌తాంగ్‌పుయి, జీర్ణకోశ వైద్య నిపుణుడు డాక్టర్ బెంజమిన్ ఖియాంగ్టే వెంటనే స్పందించారు. ప్రయాణికుడికి మాస్క్ ద్వారా ఆక్సిజన్ అందించినప్పటికీ తొలుత ఆక్సిజన్ స్థాయి దాదాపు 60 శాతంగానే ఉంది. వైద్యులు చికిత్స కొనసాగిస్తూ స్టెరాయిడ్లు ఇవ్వడంతో ఆక్సిజన్ స్థాయి దాదాపు 90 శాతానికి చేరింది.

అయితే పరిస్థితి మెరుగుపడకపోతే కోల్‌కతాలో అత్యవసరంగా విమానం దించేందుకు పైలట్ సిద్ధంగా ఉన్నారు. కొంతసేపు ప్రయాణికుడి ఆక్సిజన్ స్థాయి నిలకడగా ఉండటంతో ఐజ్వాల్‌ ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.

తర్వాత మళ్లీ పరిస్థితి విషమించడంతో వైద్యులు శ్వాసనాళంలో ట్యూబ్‌ అమర్చే ప్రక్రియపై ఆలోచించారు. విమానంలో అత్యవసర వైద్య పరికరాలు పరిమితంగా ఉండటంతో సిబ్బంది సహకారంతో లెంగ్‌పుయి విమానాశ్రయంలో అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. విమానం అక్కడ దిగిన వెంటనే ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించారు.

శ్వాసనాళంలో ట్యూబ్‌ అమర్చేందుకు అవసరమైన పరికరాలు, ట్యూబ్ అందుబాటులో ఉండటంతో వైద్యులు చికిత్స కొనసాగించారు. అనంతరం ఐజ్వాల్‌లోని ఆసుపత్రులను సంప్రదించి అత్యవసర చికిత్స విభాగంలో బెడ్‌ కోసం ప్రయత్నించగా ఎల్‌ఆర్‌ఎం ఆసుపత్రిలో లభించింది. ప్రయాణికుడిని అక్కడికి తరలించారు.

మరుసటి రాత్రి ప్రయాణికుడికి అమర్చిన శ్వాసనాళ ట్యూబ్‌ను తొలగించి డయాలసిస్ చేశారు. సకాలంలో వైద్యం అందడంతో ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement