సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు, బాలికలపై వరుసగా వెలుగుచూస్తున్న అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేరం జరిగిన తర్వాత పోలీసులు స్పందించడం మాత్రమే కాకుండా.. నేరం చేయాలనుకునే వారి మనసులోనే భయం పుట్టించేలా పోలీసింగ్ ఉండాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులకు కీలక సూచనలు చేసింది.
ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ఇటీవల వెలుగుచూసిన అత్యాచారం, లైంగిక దాడుల ఘటనలపై మీడియా కథనాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28న సుమోటోగా కేసు నమోదు చేసింది. ఆ నెలలో చోటుచేసుకున్న పలు ఘటనలు మహిళలు, బాలికలకు బహిరంగ ప్రదేశాల్లో భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని కోర్టు పేర్కొంది.
నేరం తర్వాత కాదు.. ముందే అడ్డుకోవాలి
‘‘ఏదైనా చేస్తే చచ్చిపోతాం’’ అనే భయం నేరగాళ్లలో కలగాలని జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ కే. వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం ఢిల్లీ పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. సోమవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు పోలీసింగ్ తీరుపై కీలక ప్రశ్నలు వేసింది. నేరం జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం మాత్రమే సరిపోదని.. నేరం జరగకుండా ముందే అడ్డుకునే వ్యవస్థ ఉండాలని స్పష్టం చేసింది.
ఢిల్లీలో నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థ ఉందా? అక్కడ ఏదైనా ఘటన జరిగితే వెంటనే స్పందించే యంత్రాంగం ఉందా? అని పోలీసులను ప్రశ్నించింది. ముఖ్యంగా నేరాలు ఎక్కువగా జరిగే లేదా ప్రమాదకరంగా మారే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా, నిరంతర పర్యవేక్షణ అవసరమని పేర్కొంది.
పోలీస్ వ్యాన్ అక్కడే ఉంటే ఎలా?
బీట్ పెట్రోలింగ్‌పై కూడా ధర్మాసనం దృష్టి పెట్టింది. పోలీసులు ఒకచోట వ్యాన్ నిలిపి ఉంచడం కాదని.. తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిరంతరం తిరుగుతూ పరిస్థితిని గమనించాలని సూచించింది. అవసరమైన చోట పోలీసులు కనిపిస్తేనే నేరగాళ్లలో భయం ఏర్పడుతుందని.. ప్రజల్లో కూడా భద్రతా భావన పెరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. సీసీటీవీలు ఏర్పాటు చేయడం మాత్రమే సరిపోదని.. వాటిని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థ, అవసరమైనప్పుడు వెంటనే స్పందించే యంత్రాంగం ఉండాలని కూడా ప్రశ్నించింది.
రాత్రైనా మహిళలు భయపడకూడదు
మహిళల భద్రత అంటే కేవలం ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాత్రి 10 గంటలైనా ఒక మహిళ దేశరాజధాని రోడ్లపై భయం లేకుండా నడవగలగాలి. మెట్రోలో ప్రయాణించినా, రోడ్డు మార్గంలో వెళ్లినా భద్రతపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉండకూడదని పేర్కొంది. మహిళలు తమ రోజువారీ పనులు, ప్రయాణాలు చేసుకునే స్వేచ్ఛకు భద్రత అడ్డంకిగా మారకూడదన్నది కోర్టు స్పష్టం చేసింది.
చీకటి ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రత పెంచాలని కోర్టు సూచించింది. సరైన వీధి దీపాలు లేని ప్రాంతాలపై కూడా దృష్టి పెట్టాలని కోరింది. స్థానిక ప్రజలతో పోలీసులు మాట్లాడాలని.. వారి నుంచి వచ్చే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా వీధి దీపాలు లేకపోవడం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండటం వంటి అంశాలపై ప్రజలు చెబుతున్న సమాచారాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని పేర్కొంది. అక్రమంగా నడిచే తినుబండారాలు, మద్యం దుకాణాల వద్ద అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉంటే వాటిపైనా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది.
‘కఠినంగా ఉండటానికి వెనకాడొద్దు’
నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విషయంలో పోలీసులు వెనకడుగు వేయకూడదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కఠిన చర్యలపై కొందరు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ప్రస్తావిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. చట్టం అనుమతించే పరిధిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
నేరం జరిగిన తర్వాత స్పందించడం సరిపోదు
ఆగస్టు 4న గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీకి వెళ్తున్న బస్సులో 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు ఇటీవల చార్జిషీట్ దాఖలు చేశారు. డీఎన్‌ఏ ఆధారాలతో నిందితులను కేసుతో అనుసంధానించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనతోపాటు ఇతర లైంగిక దాడుల ఘటనలపై కూడా సుప్రీంకోర్టు దృష్టి సారించింది.
ఇటీవల ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో వరుసగా వెలుగుచూసిన ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని కేవలం కొన్ని కేసుల దర్యాప్తుగా చూడటం లేదు. మహిళలు, బాలికలు బహిరంగ ప్రదేశాల్లో సురక్షితంగా ఉండేలా మొత్తం పోలీసింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తోందన్నదానిపైనే దృష్టి పెట్టింది. ఒక కేసులో నిందితులను పట్టుకోవడం విజయమే కావచ్చు.. కానీ ఇలాంటి నేరం చేయాలనే ఆలోచన కూడా రాకుండా వ్యవస్థ పనిచేయడం అసలు లక్ష్యం కావాలి. ఢిల్లీ మహిళల భద్రతపై సోమవారం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇదే అంశాన్ని స్పష్టంగా చెబుతున్నాయి.


