మన దేశంలో బంగారం అంటే కేవలం పెట్టుబడి కాదు. పెళ్లిళ్లు, పండుగలు, పొదుపు, కష్టకాలంలో అండ.. ఇలా ఎన్నో విషయాలతో పసిడి ముడిపడి ఉంటుంది. అందుకే బంగారం ధర తగ్గిందంటే కొనుగోలుదారుల్లో ఆసక్తి మొదలవుతుంది. అదే ఇప్పుడు రికార్డు ధరల నుంచి భారీగా పడిపోతుండటంతో.. ఇక ఎంత తగ్గుతుంది? ఇంకా పతనమై ఏకంగా రూ.లక్షకు చేరుతుందా? అనే ఆశలు మొదలయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లో జనవరి 29న ఔన్సు బంగారం ధర ఏకంగా 5,595 డాలర్ల రికార్డు స్థాయిని తాకింది. అక్కడి నుంచి ఇప్పటివరకు సుమారు 26 శాతం తగ్గింది. భారత మార్కెట్లోనూ గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 23 శాతం పతనమైంది. ఆగస్టు చివరి వారంలో ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,773 వరకు వెళ్లింది. గత వారం నాటికి అది రూ.1,45,991కు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఆగస్టులో 4,698 డాలర్ల వరకు వెళ్లిన బంగారం.. ఈ వారం సుమారు 4,130 డాలర్ల వద్ద ముగిసింది.
అసలు ఎందుకింత పతనం?
బంగారం ధర ఒక్క కారణంతో పడిపోవడం లేదు. రికార్డు స్థాయిలకు చేరినప్పుడు కొందరు ఇన్వెస్టర్లు లాభాలు తీసుకోవడంతో అమ్మకాలు పెరిగాయి. ఆ తర్వాత అమెరికా–ఇరాన్ యుద్ధం, ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లకు పైగా చేరడం, ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళనలు పసిడిపై ఒత్తిడి పెంచాయి.
మరోవైపు అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు మారాయి. మళ్లీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు పెరగడంతో బంగారంపై ఒత్తిడి మరింత పెరిగింది. డాలర్ బలపడటం, అమెరికా ప్రభుత్వ బాండ్లపై రాబడి పెరగడం కూడా పసిడికి ప్రతికూలంగా మారాయి. బాండ్లలో పెట్టుబడి పెడితే వడ్డీ ఆదాయం వస్తుండటంతో.. వడ్డీ ఇవ్వని బంగారంపై కొంత ఆసక్తి తగ్గింది.
రూ.1.25 లక్షల దాకా..
ఇదే ఇప్పుడు భారతీయ కొనుగోలుదారుల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మరింత తగ్గితే మన దగ్గర కూడా ధరలు దిగొచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.46 లక్షల వద్ద ఉంది. రికార్డు స్థాయితో పోలిస్తే ఇప్పటికే భారీగా తగ్గింది.
మిరే అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 3,930–4,000 డాలర్ల మధ్య కీలక స్థాయిలో ఉంది. ఈ స్థాయిని కూడా గట్టిగా కిందకు దాటితే 3,600–3,750 డాలర్ల వరకు పడిపోయే అవకాశం ఉంటుంది. అయితే అంత దూరం పడిపోయే అవకాశం సుమారు 25 శాతమేనని ఆయన అంచనా వేస్తున్నారు. అలా జరిగితే భారత్‌లో 10 గ్రాముల బంగారం సుమారు రూ.1.34 లక్షల వరకు రావచ్చని చెబుతున్నారు.
మరి రూ.లక్షకు వస్తుందా?
రూ.1.25 లక్షల స్థాయి అందుకునే అవకాశం ఉన్నా.. ఏకంగా రూ.లక్షకు పడిపోవడం మాత్రం ఇప్పట్లో అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. 10 గ్రాముల బంగారం రూ.లక్షకు రావాలంటే అంతర్జాతీయంగా ఔన్సు ధర దాదాపు 2,800 డాలర్లకు పడిపోవాల్సి ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా దేశాలు డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగడం, కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం వంటి అంశాలు పసిడికి దీర్ఘకాలంలో అండగా నిలిచే అవకాశం ఉంది. అమెరికా భారీగా అప్పులు చేయడం కూడా బంగారం ధరలకు మద్దతిచ్చే అంశంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రూపాయి కూడా కీలకమే
మన దేశంలో బంగారం ధర ఎంత తగ్గుతుందనేది రూపాయి విలువపైనా ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా.. అదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడితే ఆ తగ్గుదల పూర్తిగా మన మార్కెట్లో కనిపించదు. కమోడిటీ నిపుణుడు మనీష్ శర్మ ప్రకారం.. అంతర్జాతీయంగా బంగారం 4,000 డాలర్లకు పడిపోయినా ఎంసీఎక్స్‌లో ధర సుమారు రూ.1.45 లక్షల స్థాయిలో ఉండొచ్చు. అమెరికాలో వడ్డీ రేట్లు, బాండ్లపై రాబడి మరింత పెరిగి.. ద్రవ్యోల్బణం అంచనాలకు మించి ఉంటేనే రూ.1.25 లక్షల స్థాయికి పడిపోయే అవకాశం పెరుగుతుందని ఆయన చెబుతున్నారు.
మన దగ్గర డిమాండ్ కూడా ముఖ్యం
బంగారం ధరను అంతర్జాతీయ పరిణామాలే కాకుండా దేశీయ డిమాండ్ కూడా ప్రభావితం చేస్తుంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. ధరలు తగ్గితే మరింత మంది కొనుగోలుదారులు మార్కెట్‌లోకి రావొచ్చు. దీంతో ధరలు మరింత పడిపోకుండా కొంత అండ లభించే అవకాశం ఉంటుంది. అయితే బంగారం ధరలు ఇప్పటికే భారీగా పెరిగిన నేపథ్యంలో వినియోగదారులు తక్కువ బరువున్న నగల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు బంగారానికి సంబంధించిన పెట్టుబడుల వైపు కూడా డబ్బు మళ్లుతోంది.
పతనం ఇక్కడితో ఆగుతుందా?
సమీప కాలంలో బంగారం ధరల్లో మరింత తగ్గుదల ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా 4,025–3,950 డాలర్ల వరకు తగ్గితే.. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ.1,46,200–1,44,500 వరకు రావచ్చని మనీష్ శర్మ చెబుతున్నారు. అయితే వచ్చే 6–9 నెలలను చూస్తే కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, బంగారం పెట్టుబడులకు పెరుగుతున్న డిమాండ్, అమెరికా భారీ రుణభారం వంటి అంశాలు ధరలకు అండగా నిలవొచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన.. పసిడి పతనం కొనసాగినా రూ.1.25 లక్షల స్థాయి అందుకోవడం అసాధ్యమేమీ కాదు. కానీ రూ.లక్షకు పడిపోవాలంటే అంతర్జాతీయంగా బంగారం ధర భారీగా కూలిపోవాలి. ప్చ్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్థాయి మాత్రం చాలా దూరంగానే కనిపిస్తోంది.
ఇదీ చదవండి: ఏడాదిలోనే జంపింగ్ జపాంగ్.. ఎవరీమె?


