లివింగ్‌ బ్యాంకులివి లవ్‌ డ్రా చేసుకోండి | World Senior Citizens Day, meaningful opportunity to honor the wisdom | Sakshi
Sakshi News home page

లివింగ్‌ బ్యాంకులివి లవ్‌ డ్రా చేసుకోండి

Aug 21 2026 3:46 AM | Updated on Aug 21 2026 3:46 AM

World Senior Citizens Day, meaningful opportunity to honor the wisdom

నేడు వరల్డ్‌ సీనియర్‌ సిటిజన్‌ డే 

వయోవృద్ధులకు ఫోన్‌ చేసి ‘మీ ఖాతా బ్లాక్‌ అయ్యింది’ అని డబ్బు దొంగిలించే డిజిటల్‌ దొంగలున్న ఈ కాలంలో వారి వద్ద ఉండే అసలైన నిధిని పట్టించుకుంటున్నామా? 70, 80 ఏళ్లు దాటిన మన అమ్మమ్మ, తాతయ్యల గుండెల్లో ఉన్న భాష, జ్ఞాపకం, సామెత, పాట, పండుగ, రుచి... ఈ పెన్నిధులను వింటున్నామా? రికార్డు చేస్తున్నామా? ‘లివింగ్‌ బ్యాంక్‌’ వంటి పెద్దల నుంచి ఏదైనా డ్రా చేస్తున్నామా అసలు?

జీవితానుభవాలతో పండిపోయిన పెద్దలు ఎదురు పడితే వారికి చెయ్యెత్తి నమస్కరించాలి. కాని వాళ్లకు తెలియని టెక్‌ మోసాలు చేసి ఎలా దోచుకుందామా అని చూస్తున్నారు సైబర్‌ దొంగలు. ఏ సమాజంలో అయినా వయోవృద్ధులు ఆ సమాజానికి అనుభవాల బ్యాంక్‌. సాంస్కృతిక గని, ఆచారాల టెక్స్‌›్టబుక్‌. వాళ్ల దగ్గర ఉన్నవాటిలో విలువైనది డబ్బు కాదు... డేటా కాదు... డాక్యుమెంట్‌ చేయని అనుభవం. 

గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే రాని వంటకం, ఏఐ జనరేట్‌ చేయలేని సామెత, యూట్యూబ్‌లో దొరకని బుర్రకథ, ఒక తుఫాను రాత్రి తెగువ, ఏడుతరాల జ్ఞాపకాలు, కష్టాలను ఎదుర్కొన్న స్థయిర్యం... ఇవన్నీ వారి లాకర్లలో నిక్షిప్తం అయి ఉన్నాయి. ఈ తరం చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంది, కానీ వారిని గత దారుల్లో నడిపే తాత లేడు. ఈ లోటును పూరించాలి. అసలు పెద్దల నుంచి పొందాల్సిన అసలైన పెన్నిధిని పంచి పెట్టే ఖాతాలేమిటో చూద్దాం...

మాటల ఖాతా
అమ్మమ్మ ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అంటూ పెట్టే ముద్దలో ఒక నీతి ఉంటుంది.‘చెట్టు నరికితే నీడ పోతుంది’ అనే సామెత వెనుక పర్యావరణ పాఠం ఉంటుంది. బుర్రకథ, హరికథ, జానపద గేయాలు పుస్తకాల్లోకి ఎక్కలేదు. అవి 75 ఏళ్ల నానమ్మ గొంతులోనే బతికున్నాయి. ఈరోజు పిల్లలకు రామాయణం కార్టూన్ లో చూపిస్తున్నాం, కానీ తాత చెప్పే ‘మాటల రామాయణం’లోని ఎమోషన్‌ వేరు. 

హైదరాబాద్‌లో  ఒకటి రెండు ఎన్‌.జి.ఓలు ‘నానమ్మ కథలు’ లాంటి ప్రాజెక్ట్స్‌ నడుపుతున్నారు. డెబ్బయిలు దాటిన మహిళల నుంచి జానపద కథలు రికార్డ్‌ చేసి పిల్లలకు పాడ్‌కాస్ట్‌లుగా ఇస్తున్నారు. అంటే టెక్నాలజీని వాళ్ల కోసం కాకుండా వాళ్లతో కలిపి వాడుతున్నారు. జెన్‌ జి బాధ్యత ఏంటి? వారి మాటలను ఫోన్ లో రికార్డ్‌ చేయడం. 10 నిమిషాలు కూర్చొని ‘అమ్మమ్మా, మీ చిన్నప్పటి సంక్రాంతి ఎలా ఉండేది?’ అని అడగడం. ఆ ఒక్క వీడియో భావి తరాలకు ఆస్తి అవుతుంది.

రుచి, ఆచారాల ఖాతా
‘ఈ పూర్ణం బూరెలో నువ్వులు ఎందుకు వేస్తారు?’ అని అడిగితే అమ్మమ్మ చెబుతుంది– ‘చలికాలంలో ఒళ్లు వేడిగా ఉండటానికి’. ఇది వంటకం కాదు, మూలికా వైద్యం. ఉగాది పచ్చడి ఆరు రుచులు ఎందుకు, వినాయక చవితిలోని పత్రి తాలూకు ఔషధ గుణాలేమిటి, పెళ్లిలో ‘జీలకర్ర బెల్లం’ అర్థం ఏంటి – ఈ కోడ్‌ అంతా పెద్దల మెమరీలో ఉంది. మనం స్విగ్గీ, జొమాటోకు అలవాటు పడ్డాం. కానీ ‘చేతి రుచి’కి ప్రత్యామ్నాయం లేదు. ఈరోజు చాలా మంది 65 దాటిన మహిళలు వంటలతో వ్యాపారం మొదలుపెడుతున్నారు. అది డబ్బు కోసం కాదు. ‘నా ఆచారం చావకూడదు’ అనే పట్టుదల. వాళ్ల నుంచి ఒక వంటకం నేర్చుకోవడం అంటే ఒక సంస్కృతిని సేవ్‌ చేయడమే. వాళ్లు వండేది కర్రీ కాదు, వారసత్వం.

జీవిత పాఠాల ఖాతా
గెలుపు కోసం ఏఐ మనకు 1000 ఆప్షన్లు ఇస్తుంది. కానీ ‘ఓటమి తర్వాత ఎలా లేవాలి’ అని ఎవరు చెబుతారు? కరువు చూసిన తాత, ఎమర్జెన్సీ చూసిన అమ్మమ్మ, ఉద్యోగం కోల్పోయి మళ్లీ నిలబడిన నాన్న... వీరికి మించిన వారున్నారా?  నేటి జెన్‌–జి చిన్న చిన్న ఒత్తిళ్లకు, కెరీర్‌ టెన్షన్లకు తట్టుకోలేక ‘మెంటల్‌ పీస్‌’ కోసం థెరపీల చుట్టూ, మైండ్‌ఫుల్‌నెస్‌ యాప్‌ల చుట్టూ తిరుగుతోంది. కానీ మీ ఇంట్లో ఉన్న అమ్మమ్మ, తాతయ్యల జీవితాలను ఒక్కసారి గమనించండి. 

వాళ్లు తమ జీవితంలో ఎన్నో ఆర్థిక సంక్షోభాలను చూశారు, సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినా సరే ప్రశాంతంగా, నవ్వుతూ కూర్చోగలరు. వాళ్ల మైండ్‌ సెట్‌లో ఉన్న ఆ ‘మెంటల్‌ రెసిలియెన్స్’ (మానసిక స్థిరత్వం) నేటి తరానికి కావలసిన అసలైన పాఠం. డిప్రెషన్‌లను దరి చేరనీకుండా జీవితాన్ని ముందుకు సాగేలా చేసుకున్న అమ్మమ్మలు, నానమ్మలు అనే ఆ రియల్‌ లైఫ్‌ థెరపిస్ట్‌ల పక్కన కూర్చుని ఒక పది నిమిషాలు మాట్లాడితే మీ యాంగ్జైటీలన్నీ పటాపంచలవుతాయి. వాళ్ల వాలెట్‌లో క్రెడిట్‌ కార్డులు లేకపోవచ్చు.. కానీ వాళ్ల మనసులో ఉన్న ధైర్యం మన జీవితాలకు శ్రీరామరక్ష.

ఈరోజు మనం ఏం చేయాలి
సీనియర్‌ సిటిజన్స్ డే అంటే ‘శుభాకాంక్షలు’ పోస్ట్‌ పెట్టి వదిలేయడం కాదు. వాళ్ల ‘జ్ఞాపకాల అకౌంట్‌’ నుంచి మనం డ్రా చేసుకోవాలి. ఈరోజు ఒక పని చేద్దామా? ఇంట్లో పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లి ఇవి అడగండి: మీకు ఇష్టమైన సామెత ఏంటి?  మీరు చేసే స్పెషల్‌ వంట ఏంటి? మీ జీవితంలో మర్చిపోలేని రోజు ఏది? రికార్డ్‌ చేయండి. ఫోటో తీయండి. ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్‌ చేయండి. అదే మనకు వచ్చే అసలైన వారసత్వం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement