కూతురు కోసం..ఒక్క కన్నుతోనే గెలుపుని ముద్దాడిని ధీరవనిత! | Rohini Gurjar: Rajasthan woman resumes studies, bags top job | Sakshi
Sakshi News home page

కూతురు కోసం..ఒక్క కన్నుతోనే గెలుపుని ముద్దాడిని ధీరవనిత!

Oct 5 2026 1:49 PM | Updated on Oct 5 2026 2:14 PM

Rohini Gurjar:  Rajasthan woman resumes studies, bags top job

ఆమె కష్టాలు వింటే కళ్లల్లో నీళ్లు  సుడితిరిగుతాయ్‌. నిలదొక్కుకునే అవకాశం లేకుండా అవమానాలు, కుంగదీసే కష్టాలే..అయినా సరే వెనక్కి తగ్గకుండా ముందుకు సాగినా విధి ఒప్పుకోలేదు. ముప్పతిప్పలు పెట్టింది. మళ్లీ చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించుకుందామని 15 ఏళ్ల విరామం అనంతర పుస్తకాలతో కుస్తీ పడుతుంటే..కన్నపేగుని దూరం చేసి మెల్లిపెట్టింది. పట్టి బిగువున దిగమింగి పరీక్షకు ప్రిపేరవుదామంటే పరీక్షకు రెండు రోజుల ముందు ఘోర ప్రమాదం బారినపడింది. అది కూడా కంటికే గాయలు..కళ్లు విప్పి చూడలేని స్థితిలో పరీక్షకు హాజరై రాసింది. మరి గెలిచిందా అంటే..

ఆ ధీర మహిళే రోహిణి గుర్జర్‌. రాజస్థాన్‌కి చెందిన రోహిణి 2006లో తన ఘుఘ్రా గ్రామం నుంచి బీఏ చేసి తొలి అమ్మాయి. తండ్రి సైన్యంలో ఉండటంతో వివిధ ప్రదేశాల్లో చదువుకోవాల్సి వచ్చింది. ఆమె గ్రాడ్యుయేషన్‌ తర్వాత చదువు మానేసి ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేయడం ప్రారంభించింది. ఆ తర్వాత 2011లో వివాహం జరగడం 2013లో తల్లి అవ్వడం అన్నీ చకచక జరిగిపోయాయి. 

అలా హాయిగా సాగిపోతుండగా భర్తకు గుండెపోటు రావడం..ఆరోగ్య క్షీణించడం మొదలైంది. సుమారు రెండునెలల పాటు చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18, 2021న మరణించారు. దాంతో ఒక్కసారిగా ఆమె జీవితం తలకిందులైపోయింది. ఆమెకు ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో అత్తమామల ఆదరణ కొరవడింది. మరోవైపు సమాజం నుంచి నిందలు, ఛీత్కారాలతో కుంగిపోయింది. ఆమెనొక దురదృష్టవంతురాలిగా ముద్రవేసి చూడటం మొదలుపెట్టడంతో సుమారు ఆరెనెలల పాటు తీవ్ర డిప్రెషన్‌కి గురయ్యింది. 

అకస్మాత్తుగా మారిపోయిన ఈ జీవితాన్ని ఎలా లీడ్‌ చేయాలో తోచక కన్నీళ్లు వచ్చేసివి రోహిణికి. అయితే ఆ క్రమంలో సోదరుడు నరేంద్ర గుర్జర్‌, అత్తగారి తల్లి పుష్పాదేవి ఆమెకు అండగా నిలిచారు. 95 ఏళ్ల వయసున్న పుష్పాదేవి కనీస విద్యను కూడా అభ్యసించకపోయినప్పటికీ..రోహిణిని మళ్లీ పుస్తకాలు తీసి చదువు సాగించి తన కాళ్లమీద తాను నిలబడమని ప్రోత్సహించింది. దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత రోహిణి 2021 చివరలో తిరిగి చదువు ప్రారంభించి..పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వడం ప్రారంభించింది. 

అలా రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆర్‌ఏఎస్‌ 2024కి సన్నద్ధమైంది. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించినా..మెయిన్స్‌లో కటాప్‌ 10 మార్కులు కోల్పోయింది. మళ్లీ 2023లో ఆ పరీక్షకు సన్నద్ధమవ్వగా ఈసారి పరీక్షకు కొన్ని రోజుల ముందు పుష్పాదేవి మరణించింది. అదృష్టవశాత్తు పరీక్ష కూడా జులైకి వాయిదా పడటంతో ఆ బాధ నుంచి కోలుకుని ప్రిపేరయ్యేందుకు సమయం దొరికింది. 

ఇంతలో ఈ మరో తీవ్రమైన విషాదం గుక్కతిప్పుకోని బాధలోకి కూరుకుపోయేలా చేసింది. ఈసారి జూన్‌ 29, 2024న తన పెద్ద కుమార్తె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మరణించింది. ఈ బాధను అంత తేలిగ్గా దిగమింగుకోలేకపోయింది రోహణి. అస్సలు పరీక్షకే హాజరు కాకూడదని అనుకుంది. ఆ తర్వాత తన సోదరుడితో కలిసి పుట్టింటికి వచ్చింది. ఆ వెంటనే వదినతో కలసి బయటకు వెళ్లగా రోడ్డు ప్రమాదం బారినపడింది. ఆ ఘటనలో రోహిణి ముఖం, కళ్లకు తీవ్ర గాయాలై ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. 

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత కనీసం పరీక్షకైనా హాజరుకమ్మని ప్రోత్సహించారు. ఇక తన చిన్న కూతురు భూమి గురించి ఆలోచింది రాసేందుకు మొగ్గుచూపింది. అలా ఒంటి కన్నుతోనే తప్పని పరిస్థితుల్లో రాసిన ఆర్‌ఏసీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి..ఎంబీఎస్‌ వితంతువుల కోటాలో రెండో ర్యాంకును దక్కించుకుని రాజస్థాన్‌ అకౌంట్స్‌ సర్వీస్‌లో ఉద్యోగం పొందింది. ప్రస్తుతం ఆమె తన చిన్న కూతురుతో కలిసి జీవిస్తోంది. 

ఆవేళ​ అత్యంత కష్ట సమయంలో తనను ఆదుకున్న సోదరుడికి, దివంగత పుష్పా దేవికి చాలా కృతజ్ఞతలని గద్గద హృదయంతో చెబుతోంది. ఇక్కడ రోహిణి విజయం..ఇంతలా సాంకేతిక అభివృద్ధి చెందుతున్న..మహిళల పట్ల సమాజ దృక్పథం మారలేదనే విషయాన్ని తెలియజేయడమే గాక, ఆ అడ్డంకుల చేధనకు చదువు ఒక్కటే మార్గమని నొక్కి చెప్పింది. పైగా బాలికలకు చదువు ఎందుకు అవసరం అనే ప్రాముఖ్యతను హైలెట్‌ చేసింది ఆమె ఉదంతం.

 

ఇదీ చదవండి: కొడుకుని మార్చబోయి.. ఆమెనే గేమింగ్‌ క్వీన్‌గా! వైరల్‌గా 60 ఏళ్ల ఆంటీ స్టోరీ)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement