ఫండే
ఈ వారం కథ
‘‘ఇదేమైనా ఇండియా పాకిస్తాన్ యుద్ధమా... ఓ తెగ గింజుకుంటున్నావ్! కొడుకు షాదీలో మొఖం మాడ్చుకుని కూచుంటే బంధువులు ఏమనుకుంటారన్న జ్ఞానం లేకుండా పోయింది దలిందర్ ఆద్మీకు’’ అంటూ మొఖమ్మీదే చీవాట్లేసి విసురుగా వెళ్లిపోయింది బీబి.
బీబి మాటలు అతలాకుతలం చేశాయి రసూల్ సాహెబ్‌ని. చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ చంపుతున్నట్లే అనిపించాయి ఈటెల్లాంటి బీబి మాటలు. బిగ్గరగా అరవాలనిపించింది. ఎటూ పాలుపోక ఏడ్వాలనిపించింది. అసలే మొండి మనిషి, అలాగని మూర్ఖుడూ కాదు. మానవ సంబంధాల పట్ల తనకున్న అవగాహన తక్కువేమీ కాదు. తన జీవితకాలంలో తల్లిదండ్రుల మాట జవదాటలేదు. రెక్కల కష్టం మీద గంపెడు బరువును మోసి, పిల్లలకు ఒకదారి చూపిన మనిషి. తరతరాల కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగించాలని, తన సంస్కృతిని కాపాడుకోవాలని తపించే మనిషి. ఆ తపనే ఈరోజు ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం అవుతుందని ఎన్నడూ అనుకోలేదు రసూల్ సాహెబ్.
బేటేకా షాదీ అందరూ సంబరంగా వుంటే తను ఇంత బాధగా ప్రవర్తించడం మంచిది కాదనిపించింది. ఒక్క వుదుటన లేచి షాదీఖానా నుంచి బయటకు వచ్చాడు. ఎవరూ తనని ఆపే ప్రయత్నం చేయలేదు. అసలు తను అలా బయటకు వచ్చేయటం ఎవరైనా గమనించారో లేదో కూడా తెలీదు. ఎవరి హడావుడిలో వాళ్లున్నారు.
ఉక్రోషంగా నడవడం మొదలు పెట్టాడు. పెద్ద పెద్ద అంగలతో ఆరడుగుల బక్కచిక్కిన శరీరం గాలివాటానికి నావను నడిపించే తెరచాపలా కొట్టుకుపోతున్నట్లే వుంది రసూల్ సాహెబ్‌ని చూస్తే.
మే నెల నలభై ఐదు డిగ్రీల ఎండలో చెమటలు పట్టి నుదుటి పైనుంచి కారిపోతుంది. చెమట వలనో లేక కన్నీళ్ళే జారిపోతున్నాయో తెలీదుకానీ ఎర్రబడ్డ కళ్లల్లో నుంచి నీళ్ళు.
అలా నడుచుకుంటూనే పది కిలోమీటర్ల దూరంలో వున్న పకీరుపాలెం చేరుకున్నాడు. పకీరుపాలెం– అక్కడే రసూల్ సాహెబ్ బాల్యం గడిచింది. సెయింట్ తెరేసా స్కూల్ దాక వచ్చి చదువుకుని వెళ్ళేవాడు. పాత మార్కెట్ ట్రాఫిక్ రద్దీ నుంచి జాగ్రత్తగా మస్తాన్ దర్గా సెంటర్ దాటుకుంటూ రోడ్డు మీదే దోస్తులతో ఆడుకుంటూ వచ్చేవాడు రోజు.
జ్ఞాపకాలు తరుముతున్నట్లే వచ్చేశాడు. పకీరుపాలెం ఇప్పుడు తన జ్ఞాపకాలకు తోడు నిలిచేదిగా లేదు. అంతా మారిపోయింది. తనని గుర్తుపట్టి పలకరించే వారిప్పుడు లేరు. కొన్ని కుటుంబాలు తనలాగే పాలెం వదిలిపెట్టి వెళ్లిపోయాయి. కొందరు వయోభారంతో చనిపోయి ఉంటారు. పాతముఖాలేవీ కనబడనే లేదు. ఊరికి మధ్య ఉండటంతో మంచి రేటు పలికితే పిల్లల బాధ్యతలు దింపుకోడానికి ఉన్న ఇళ్లు అమ్ముకుని ఊరి చివరి ప్రాంతాలకు వెళ్లిపోయారంతా. పకీరుపాలెం ఇప్పుడు ఒక అనాథనామంగా మిగిలి పోయింది.
ఇప్పటికే ‘పకీరుపాలెం’ పేరును ఉచ్చరించడానికి నామోషీపడి పక్కనే వున్న రంగుతోట పేరుతో చెప్పుకుంటున్నారు. కాలం మారింది, మనుషులూ మారిపోయారు. మొహల్లా రూపురేఖలూ మారిపోయాయి. పచ్చని జ్ఞాపకాలు కొలిమిలో కాలిపోయినట్లే అనిపిస్తుంది. మొహల్లా మధ్యలో ఉండే పీర్ల మకాన్ శిథిలమై పోయింది. చూట్టూ ఖాళీ జాగా చాలావరకు కబ్జా అయిపోయివుంది. తన బాల్యంలో స్నేహితులతో కలసి ఆడుకున్న పీర్లచావిడి స్థలం కుంచించుకు పోయింది. అక్కడ వుండే చల్లని నీడనిచ్చే రావిచెట్టు మనుషుల్లో మానవత్వం మాయమైనట్లుగానే పూర్తిగా మాయమైపోయింది. తన అవస్థ కన్నా ఇంకా దీనంగా అనిపించింది పకీరుపాలేన్ని చూస్తుంటే.
పీర్ల చావిడి దగ్గర కాసేపు ఉందామనుకుని వచ్చిన రసూల్ సాహెబ్‌కు అక్కడ కూర్చునే అవకాశం కనబడలేదు. అడుగులు ముందుకు పడుతుంటే రసూల్ సాహెబ్ శరీరం మస్తాన్‌వలి దర్గా వైపుకు లాక్కెళ్లింది. పకీరుపాలేనికి ఆనుకుని రద్దీగా ఉండే ట్రంక్‌రోడ్డు అటుగా కొత్తపట్నం రోడ్డు మధ్యలో వున్న మస్తాన్‌వలి దర్గా సైజులో చాలా చిన్నదర్గా అయినా, ఆ దర్గా చరిత్ర కథలు కథలుగా చెప్పుకుంటారు.
సూఫీ గురువు ప్రేమతత్వాన్ని బోధిస్తూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండేవారని, ఆయన చనిపోయిన తరువాత అక్కడ దర్గా నిర్మాణం జరిగిందని అంటారు. చాలామంది చేసుకున్న మొక్కుబడులు జరిగితే అక్కడే వేట మాంసంతో విందు భోజనాలు పెట్టేవాళ్లు. దర్గా అనగానే అది సాయిబుల ఒక్కరిదే కాదు, పక్కన గోపాలనగరం యాదవులు చాలా నిష్టతో కొలిచేవారు. ఒకమాటలో చెప్పాలంటే ఆ దర్గాకి వాళ్లే ధర్మకర్తలు. మా ఊర్లో మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండేది మస్తాన్‌వలి దర్గా.
విపరీతంగా ఎండ కాస్తుండటంతో దర్గాలో ఎవరూ లేరు. బయట చెప్పులు విప్పి, పక్కనే ఉన్న కుళాయి దగ్గర కాళ్లు చేతులు కడుక్కుని దర్గాలోకి అడుగుపెట్టాడు. నల్లరాతి బండలు పరిచి వుండే దర్గా ప్రాంగణంలో పైకప్పు ఉండకపోవడంతో కాళ్లు చురుక్కుమన్నాయి.
ఓ మూలన జెండా చెట్టు ఉంది. అదొకప్పుడు చాలా విశాలమైన కొమ్మలతో ఆ మూడు రోడ్ల కూడలికి నీడనందించేది. ఇప్పుడు నగరం విస్తరించి జెండా చెట్టు కుంచించుకు పోయింది. విస్తారంగా వుండే కొమ్మలన్నీ నరికేశారు. బాగా వాడిపోయిన కొమ్మలకు ఆనించి రెండు జెండాలు ఉన్నాయి. పాత మిత్రుడు కనబడినంత సంబరంగా నేరుగా వెళ్ళి ఆ జెండా చెట్టుని రసూల్ సాహెబ్ హత్తుకున్నాడు. రసూల్ సాహెబ్‌కు దుఃఖం ఆగటం లేదు. జెండా చెట్టుతో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకోడానికో... ఆ జెండా చెట్టు కింద సేదదీరడానికో ఆ చెట్టు నీడలో వాలిపోయాడు.
∙∙
అప్పుడెప్పుడో తారీఖు కూడా గుర్తులేని ఒకరోజు, అదీ రసూల్ సాహెబ్ పెళ్ళి రేపనగా ముందు ‘మంజా’ రోజు ఇక్కడే ఈ జెండా చెట్టుకే జెండాలు పెట్టి మహబూబ్ సుభాని మొక్కు చెల్లించుకున్నాడు. తన పెళ్ళి అంగరంగ వైభవంగా జరపాలనుకున్న రసూల్ సాహెబ్ తండ్రి కొడుకు పెళ్లికి ‘నాచ్ కా ఘోడా నవరంగ్ బాజా’ పెట్టించాలనుకునేవాడు. అసలు పెద్దోడి పెళ్లిలోనే పెట్టించాలనుకున్నా పేదరికంతో పెళ్ళి భారం మోయలేక వదిలేశాడు. ఇప్పుడు కచ్చితంగా చిన్నోడి పెళ్ళి నాచ్ కా ఘోడా నవరంగ్ కా బాజా పెట్టాల్సిందే అని ఎంత ప్రయత్నించినా డబ్బులు సర్దుబాటు అవలేదు. తన బిడ్డలను గుర్రం మీద రాకుమారుల్లా చూసుకుని మురిసిపోవాలనుకున్న పెద్దాయన కల ముందు పేదరికం గెలిచింది. కొంతమంది చుట్టాలతో నామమాత్రంగా జరిగిపోయింది రసూల్ సాహెబ్ పెళ్ళి కూడా.
రసూల్ సాహెబ్ వాళ్ల నాయన యెండ్లూరులో ఇటుకబట్టి కాల్చేవాడు. అంత శ్రమ తన బిడ్డ పడలేడని ఒంగోలు టౌనుకు తీసుకొచ్చి మిషనుకుట్టే పనిలో పెట్టాడు. అనుకున్నట్టే మిషనుకుట్టే పనిలో మంచి పనిమంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. కిరాయి మకాన్‌లో ఉంటూ తన బిడ్డలను సాకటానికి జీవితమంతా కుట్టుమిషన్లోని ఇరుసులా తిరుగుతానే అలసి పోయిన రసూల్ సాహెబ్ ఇద్దరు ఆడపిల్లలకు పెళ్ళి చేసి పంపాడు.
చివరిగా మగబిడ్డ షఫీని ‘అల్లాహ్ కా దేన్’ అని మురిసిపోతూ పస్తులుండి మరీ చదివించాడు. ఇప్పుడు ఏదో ప్రైవేటు కంపెనీలో ఒక మోస్తరు ఉద్యోగం వచ్చింది. వాడికి చదువుతోపాటు ఇస్లామీయ ధార్మికత (దీన్) కూడా అబ్బింది. ఐదు పూటలు నమాజ్ చేస్తూ ఊర్లో సంస్కారవంతుడిగా పేరు సంపాదించుకున్నాడు. దాంతో మసీదులో పరిచయమైన ఒక పెద్దమనిషి తన కూతురునిచ్చి పెళ్ళి చేస్తానంటే మసీదు మౌల్వీ సాహెబ్ మధ్యవర్తిత్వంలో ఎట్టకేలకు ‘రిష్తా’ పక్కా అయింది.
‘మంగ్నీ’ రోజు పెళ్ళి తేదీ ఖరారు చేయడంతోపాటు పెళ్ళిలో ఏమేమి ఇస్తారో, పెళ్ళితంతు ఎలా జరగాలో నిర్ణయం జరుగుతుంది. ఆడపిల్ల వారింటికి ముఖ్యమైన బంధువులనీ పిలుచుకుని వెళ్లారు. భోజనాలు అయ్యాక పెళ్ళికూతురు తండ్రి చెప్పడం ప్రారంభించాడు. కట్నకానుకలు లేని వివాహం. నిఖా మాత్రం ఊరంతా చెప్పుకునేంత గొప్పగా చేస్తానని చెప్పాడు పెళ్ళి కూతురు తండ్రి. అంతేకాదు, పెళ్ళిలో ఓ ముప్పై లక్షల విలువ చేసే ఇంటిని తోఫాగా ఇస్తూ జోడేకా రఖమ్ కింద మరో మూడు లక్షలు, కొత్త కాపురానికి కావలసిన సామానంతా ఇస్తానన్నాడు అడక్కుండానే.
‘కట్నం ఇవ్వడంలేదు కానీ కట్నానికి మించే కట్టబెడుతున్నారుగా’ ఎవరో పక్కనుంచి గుసగుసలాడటం రసూల్ సాహెబ్ చెవిన పడింది. మౌల్వీ సాహెబ్ గుర్రుగా చూసేసరికి ఆ గుసగుసలు ఆగిపోయాయి. పెళ్ళికూతురు తండ్రి మాట్లాడటం, మౌలానా మాట్లాడటం తప్ప పెళ్ళికొడుకు తండ్రి అయిన రసూల్ సాహెబ్ అభిప్రాయాన్ని కోరే పరిస్థితి కనబడలేదు. అసలే కోపిష్టిమనిషి అని తెలిసినా ‘తుమ్ చుప్ రహోజీ’ అని విసుగ్గా సైగ చేసే భార్య ప్రవర్తన, కొడుకు ప్రవర్తన ఇంకాస్త బాధకు గురిచేసింది.
ఇంతలో ఎవరో కానీ అక్కడ కూర్చున్న పెద్ద మనుషుల్లో ఒకడు ‘‘క్యావ్ జీ! బడే ఆద్మీ కైకూ చుప్ హో కర్ బైuЇ గయే క్యాతోభీ బోలో’’ అన్నాడు.
క్షణం ఆలస్యం చేయకుండా ‘‘మేరే బేటేకే షాదీమే మాబుసుభానీకె జండే నికాల్నా. ఏ హమారీ ఖాన్దాన్ మే అబ్ తక్ సబ్ లోగ్ కరేసోహై. నాచ్ కా ఘోడా నవరంగ్ కా బాజా రఖ్నా ఏ మేరే బావా కా ఖాయిష్’’ అన్నాడు. అంతే అక్కడంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. కొందరు యటకారంగా చూస్తున్నారు. ఇంకొందరు కోపంతో. ‘‘అజీ తుమ్ చుప్ బైఠోజీ’’ వెనుక నుండి రసూల్ సాహెబ్ భార్య హెచ్చరించేలోపే పెళ్ళికూతురు తండ్రి కలగజేసుకుని, ‘‘ఏ క్యా షిర్క్ కే కామా మియా... ఐసే షైతానీ బాతా కర్నా నక్కో’’ అన్నాడు కొద్దిగా దురుసుగానే. రసూల్ సాహెబ్ మనసు చివుక్కుమంది.
తన కొడుకు విసుగ్గా ‘ఏంటమ్మా’ అంటూ అమ్మకు సైగ చేశాడు. రసూల్ సాహెబ్‌కు కొడుకు ప్రవర్తన మరింత బాధపెట్టింది. కోపం తమాయించుకుని ‘‘ఏ మేరే బావాకా ఖ్వాయిష్. మేరే షాదీమే పూరా హువా నై.. మేరే బేటేకే షాదీమే పూరా కార్నాహై. ఆప్ బడే లోగ్, లేకిన్ హమారీ బాత్ భీ సునో’’ అనేలోపే మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న మౌల్వీ కలగచేసుకుని. ‘‘తుమే ఏ దివానే బాతా కర్నా నక్కో. నాజాయజ్ కామ్ కైసే కర్తే జరాభి సమజ్ నై ఆప్కో’’ అన్నాడు.
ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. అందరూ కొత్తగా కనిపిస్తున్నారు. తన కొడుకూ భార్యతో సహా అందరూ.
ఇప్పుడు కోపానికి బదులు ఏడుపు తన్నుకొచ్చేలా వుంది. రసూల్ సాహెబ్ తండ్రి వచ్చి భుజం మీద చెయ్యి పెట్టి బయటకు తీసుకెళ్ళినట్టుగా అలాగే బయటకు వచ్చేశాడు.
తన తండ్రి బతికుండగా ఒకమాట అనేవాడు– ‘భూక్ కో... బే ఇజ్జతీకో కభీ భూల్నా నక్కో’– ఆకలినీ అవమానాన్నీ ఎప్పటికీ మరచిపోకూడదు. కాలం కలిసిరాని రోజుల్లో తాను ఆకలితో ఉండి బిడ్డలకు ఏ కొరతా లేకుండా పెంచాడు. ఆడపిల్లలకు పెళ్ళి చేసి పంపాక ఉన్న ఒక్క మగబిడ్డ షాదీలో తన ఖాన్దానీ ఖ్వాయిష్ పూర్తి చేసుకోవాలని భంగపడ్డాడు. ఒకప్పటి ఆకలి తనకు అల్సర్‌ని బహుమతిగా ఇస్తే, ఇప్పుడు ఈ అవమానం ఆత్మ క్షోభను బహుమతిగా ఇచ్చింది.
మంగ్నీ తంతు ముగించుకుని ఇంటికి వచ్చీరాక ముందే మొదలుపెట్టింది రసూల్ సాహెబ్ భార్య బీబి ‘‘జిందగీ అంతా ఇలాగే అయిందానికి కానిదానికి ఏదో సమస్య సృష్టిస్తూనే వుంటావెందుకు. ఈ మొరటు మనిషి ఎలా చెబితే వింటాడో, వెళ్లిన చోట ఎలా ప్రవర్తించాలో ఇంకా తెలీకపోతే ఓ మూల కూసోవాలి’’ కసురుకుంటూ వంటగదిలోకి వెళ్లింది.
షఫీ మాత్రం ఆవేశం ఆపుకుని తన గదిలోకి వెళ్లాడు.
‘‘అది కాదే మా నాన్న నా పెళ్ళిలో నాచ్ కా ఘోడా నవరంగ్ కా బాజా పెట్టాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఆయన చేతిలో డబ్బులేకపోయింది. పైగా నీ నాయన మీద భారం పెట్టకూడదని తన ఖ్వాయిష్‌ని వదిలేశాడే. ఇప్పుడు మనకు అల్లాహ్ దయతో చిన్నచిన్న కోరికలు తీర్చుకునే అవకాశం ఉంది. నా ఆశతో పాటు మా నాయన కోరికా తీరుతుందే’’ అంటుండగానే వంటగదినుంచే...
‘‘బస్ కరోజీ తుమ్హారే పురానీ కహానియా... బచ్చే కా ఇజ్జత్ క్యా హోతా సమజ్‌తే నై’’ విసురుగా బాసన్ల చప్పుడుతోపాటు వచ్చిన బీబి మాటలు పూర్తి అవకముందే, లోపల్నుంచి షఫీ బయటకు వచ్చి ఆవేశాన్ని అణిచి పెట్టుకుంటూ ‘‘అబ్బా జాన్ ఏ క్యా క్యా తమాషే బనాతేహో తుమే... ఏదైతే ముసల్మాన్లు ఆచరించకూడదో వాటిని పట్టుకుని ఊగులాడతావెందుకు. తాత నీ పెళ్ళిలో చేయాలనుకున్న షైతానీ పన్లను నా షాదీలో నువ్వు చేస్తానంటే నేనొప్పుకోను. అయినా ఇవన్నీ నీకు ముందే చెప్పి దుల్హన్ ఇంటికి తీసుకెళ్తే నలుగురిలో ఇజ్జత్ తీశావ్. ఇక ఆపు’’ తాత ఆకాంక్షను, తండ్రి ఆనందాన్ని ఎడంకాలితో ఎగిరి కొట్టినట్టనిపించిది. అయినా దుఃఖం కనబడనీయకుండా...
‘‘అది కాదు బేటే... వారసత్వంగా నువ్వే కదా మా కలల్ని పండించాల్సింది’’
‘‘వారసత్వం అంటే పిచ్చి పనులకా. అల్లాహ్ ఆగ్రహానికి లోనయ్యే పనులు నేను చేయను’’ అన్నాడు షఫి
∙∙
ఎక్కడో దూరం నుండి నవరంగ్ కా బాజా చప్పుడు లీలగా వినిపిస్తుంటే బాగా మైకం కమ్మేసి జెండా చెట్టుకు ఆనుకుని ఉన్న రసూల్ సాహెబ్‌కి హుషార్ వచ్చింది. జెండా చెట్టునే ఊతంగా చేసుకుని పైకి లేచి చుట్టూ చూశాడు. బాజాలు మోగుతున్న శబ్దం తప్ప దృశ్యం కనిపించకపోవడంతో దర్గా నుంచి బయటకు వచ్చాడు. దూరం నుంచి రెండు జెండాలు– ఒకటి పచ్చ జెండా ఇంకొకటి ఎరుపు జెండా– మాబుసుభాని జెండాలవి. ప్రాణం పోతున్న మనిషికి ఊపిరి పోస్తున్నట్లుగా అనిపిస్తోంది రసూల్ సాహెబ్‌కు. ఇంకాసేపటికి నవరంగ్ కా బాజా ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఊపేస్తున్నట్లుగా దగ్గరవుతుంటే రసూల్ సాహెబ్ మనసు చిన్న పిల్లాడిలా చిందులేస్తోంది.
ఎండ మండిపోతుందన్న స్పృహే లేదు. ఒళ్లంతా చెమట పడుతున్నా లెక్కచేయకుండా ఎదురెళ్లాడు. పాత మార్కెట్ సెంటర్‌లో మోగుతోందా నవరంగ్ కా బాజా. వలయాకారంగా నృత్యం చేస్తూ మోగిస్తున్నారు. మధ్యలో నాట్యమాడుతూ నాచ్ కా ఘోడా... ఘోడా మీద నిలువెత్తు ‘సేరా’ ధరించిన ‘దూలా’– అపురూపమైన దృశ్యం. తన బిడ్డలాంటి ఎవరో బిడ్డ తండ్రి ఖ్వాయిష్ పూర్తిచేయడానికో, ఖాన్దానీ సంప్రదాయాన్ని కాపాడటానికో!
నాచ్ కా ఘోడా రంకెలేస్తుంటే పగ్గాలను గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు ‘దూలా’. కేవలం గుర్రం పగ్గాలనే కాదు, సంప్రదాయ పట్టుకొమ్మలనూ గట్టిగా పట్టుకున్న వాడిలా ‘దూలేకా సెహ్రా సుహానా లగ్తాహై’ పాటకు నవరంగ్ కా బాజా మోగుతుంటే కొంతమంది కుర్రాళ్లు చిందులేస్తుంటే, ఆ రోడ్డు మీద వున్నవాళ్లు ఉన్నచోటే ఆగిపోయి చూస్తూ ఉండిపోయారు. రసూల్ సాహెబ్ ఆనందం పట్టలేకుండా వున్నాడు. అరవైకి సమీపిస్తున్న వయసులో భగభగలాడుతున్న ఎండలో తన పూర్వీకుల సంస్కృతి సజీవంగా కనబడే సరికి, ఆ బారాత్‌లో తాను చిన్నపిల్లాడైపోయాడు. ఆ పాటలకు మనసు చిందులేస్తుంటే తనకు తెలీకుండానే కాళ్లు చేతులు నాట్యమాడుతున్నాయి.
పెళ్ళి బారాత్ మస్తాన్‌వలి దర్గా సమీపిస్తుంటే నిప్పులు కక్కే ఎండ ఎప్పుడు మాయమైందో తెలీదు కానీ ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చినుకులు మొదలైయ్యాయి.
పకీర్లు డప్పులు కొడుతూ ‘‘లా ఇలాహా ఇల్లల్లా’’ పాట అందుకున్నారు. రసూల్ సాహెబ్ మనసు పరవశించిపోతుంటే వర్షం పెద్దగా కురుస్తూ నిలువెల్లా తడిపేస్తుంటే, ఆ పకీరుపాలెం పిల్లల గుంపంతా తనతోటే డాన్స్ ఆడుతున్నట్లనిపిస్తుందేమో! డప్పులు మోగుతుంటే పెళ్ళికొడుకు గుర్రం దిగి జెండాలు జెండాచెట్టుకు ఆనించి పెట్టి దువా చేసుకుంటున్నాడు.
అప్పటిదాకా వాడిపోయినట్లనిపించిన ఆ జెండాచెట్టు ఇప్పుడు పచ్చగా కళకళలాడుతోంది. రసూల్ సాహెబ్ ఒళ్లంతా తడిచిముద్దయిపోయి మనసు పునీతమైనట్టనిపిస్తుంది. రసూల్ సాహెబ్ కళ్ల నుంచి రాలుతున్నది వర్షపు నీళ్లో, కన్నీళ్ళో తెలీదుకానీ అవి కచ్చితంగా ఆనందబాష్పాలే!
ఎక్కడో చెట్టుమీద చిటారు కొమ్మకు ఎక్కడో పచ్చని చిగురు కనిపిస్తుంది. ఈ జెండాచెట్టు మళ్ళీ విస్తరించబోతున్నట్లుగా.
రసూల్ సాహెబ్ చిన్నపిల్లాడై చిందులేస్తూనే ఉన్నాడు.
- నబి కరీమ్ ఖాన్
ఇదీ చదవండి: సెకండ్ షో మర్డర్! ఎవరా హంతకుడు?


