సెకండ్‌ షో మర్డర్‌! ఎవరా హంతకుడు? | Funday Crucial Story On Retired Major Murder Robot Vacuum Spy Camera | Sakshi
Sakshi News home page

సెకండ్‌ షో మర్డర్‌! ఎవరా హంతకుడు?

Oct 4 2026 10:56 AM | Updated on Oct 4 2026 11:30 AM

Funday Crucial Story On Retired Major Murder Robot Vacuum Spy Camera

ఫండే

క్లూషియల్‌

రిటైర్డ్‌ మేజర్‌ పాండురంగారావు విశాలమైన బంగ్లాలో ఆ అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా కలకలం మొదలైంది. డయల్‌ 100 నుంచి సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు ఘటనా స్థలానికి చేరుకున్నాడు. బెడ్‌రూమ్‌లో మేజర్‌ మృతదేహం మంచంపై పడి ఉంది. గదిలోని ఇనుప బీరువా బలవంతంగా పగలగొట్టి ఉంది. చనిపోయిన అతని భార్యకు చెందిన విలువైన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా ధ్వంసమై ఉంది. అక్కడి సీన్‌ చూస్తే, ఇదంతా దోపిడీ దొంగల పనే అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది.

అభిమన్యు అక్కడకు చేరుకునే సరికి మేజర్‌ కొడుకు నీలగిరి, కోడలు ప్రసూన కన్నీరు మున్నీరవుతూ కనిపించారు. ఏమైందని అడిగిన అభిమన్యుకు ‘మేము రాత్రి సెకండ్‌ షో సినిమాకి వెళ్లాం సార్‌. వచ్చేసరికి నాన్నగారు ఇలా... ఎవరో దొంగలు పడి ఆయన్ని ఊపిరాడకుండా చేసి చంపేశారు.’ అంటూ ఏడుస్తూ సినిమా టికెట్లను సాక్ష్యంగా చూపించాడు నీలగిరి.

అతను  చెప్పిన మాటలు, సమయం, చేతిలోని టికెట్లు అన్నీ అతనికి బలమైన ‘ఎలిబీ’ని ఇస్తున్నాయి.
అభిమన్యు తీక్షణమైన చూపులు గదిని నిశితంగా గమనించసాగాయి. రక్తపు మరకలు లేవు, పెనుగులాట జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపారు
అప్పుడే అభిమన్యు దృష్టిని ఆకర్షించింది. గదిలో ఒక మూలగా ఉన్న ‘రోబో వాక్యూమ్‌ క్లీనర్‌’. 
అభిమన్యు చూపును గమనించి  నీలగిరి, ‘నాన్నకు తన గదిలోకి ఎవ్వరూ రావడం ఇష్టం లేదు. అందుకే  కొద్దిరోజుల క్రితమే ఈ స్మార్ట్‌ రోబో క్లీనర్‌ను కొనుగోలు చేశాడు. అది రిమోట్‌ సహాయంతో పనిచేస్తూ గదిని శుభ్రం చేస్తుంది.’ చెప్పాడు.

మర్డర్‌ జరిగిన గదిలో అంతా చిందరవందరగా ఉంటే, ఈ క్లీనర్‌ నేలపై ఉన్న ఆధారాలను తుడిచేసే ప్రమాదం ఉందని భావించి అభిమన్యు దాన్ని పరిశీలనగా చూశాడు. ఆ పరికరం సెన్సర్ల వెనుక ఒక చిన్న మార్పు అతనికి అనుమానం కలిగించింది.
నీలగిరి సెకండ్‌ షోకు వెళ్లిన థియేటర్‌కు తన టీమ్‌ను పంపించి ఏం చేయాలో చెప్పాడు.
అభిమన్యు వెంటనే సైబర్‌ టీమ్‌ను పిలిపించి, ఆ  రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ మెమొరీ చిప్‌ను, ఇంటి పరిసరాల్లోని డిజిటల్‌ సిగ్నల్స్‌ను డీకోడ్‌ చేయించాడు. తెల్లవారేసరికి ఇన్వెస్టిగేషన్‌ మొత్తం ఒక కొలిక్కి వచ్చింది.

ఉదయం ఇంటి హాల్‌లో కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టాడు అభిమన్యు. అక్కడున్న పెద్ద స్మార్ట్‌ టీవీని ఆన్‌ చేశాడు. టీవీ తెరపై మొదట థియేటర్‌ బయట ఉన్న సీసీటీవీ దృశ్యాలు కనిపించాయి. సరిగ్గా ఇంటర్వెల్‌ సమయంలో నీలగిరి ఫోన్‌ మాట్లాడుతూ హాల్‌ నుంచి బయటకు వచ్చి, తన కారు తీసుకుని వేగంగా వెళ్లిపోవడం, మళ్ళీ సినిమా పూర్తయ్యే సమయానికి తిరిగి థియేటర్‌లోకి ప్రవేశించడం స్పష్టంగా రికార్డయి ఉంది.

ఆ దృశ్యం చూసి నీలగిరి ముఖం పాలిపోయింది. 
‘అది... నేను అర్జంట్‌ పని ఉండి బయటకు వచ్చాను... అంతే సార్‌!’ అంటూ తడబడ్డాడు.
అభిమన్యు చిరునవ్వు నవ్వి, టీవీలో రెండో వీడియోను ప్లే చేశాడు. ఆ వీడియో నేల మట్టం నుంచి రికార్డవుతోంది. అందులో ఒక వ్యక్తి ముఖానికి మాస్క్‌ ధరించి బెడ్‌రూమ్‌లోకి రావడం, బీరువాను రాడ్డుతో పగలగొట్టడం, మంచంపై నిద్రిస్తున్న మేజర్‌పై దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపడం రికార్డయి ఉంది. ఆ పెనుగులాట దృశ్యంలో హంతకుడి మాస్క్‌ పక్కకు తొలగి నీలగిరి ముఖం స్పష్టంగా కనిపిస్తోంది!

హాల్‌లో ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. ‘నువ్వు ఆర్మీ మేజర్‌తో ఆడుకున్నావు నీలగిరి. నువ్వు పక్కా ప్లాన్‌తో కెమెరాలు పగలగొట్టి, బయటి దొంగల డ్రామా ఆడి, సినిమా ఎలిబీ సృష్టించుకున్నావు. కానీ రిటైర్డ్‌ మేజర్‌ పాండురంగారావు నీకంటే ముందే ప్రమాదాన్ని పసిగట్టారు. నీ ప్రవర్తనపై అనుమానం వచ్చి, ఆ రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ లోపల అత్యాధునిక ‘ఆటోమేటిక్‌ నైట్‌–విజన్‌ స్పై కెమెరా’ను అమర్చారు.

నువ్వు గదిలోకి రాగానే అది చప్పుడు లేకుండా మొత్తం రికార్డ్‌ చేసింది. నువ్వు నేరానికి ఎంచుకున్న టెక్నాలజీనే నీ తండ్రి నిన్ను పట్టించడానికి ఆయుధంగా మార్చారు. తండ్రులను వృద్ధాశ్రమాలకు పంపే స్థాయిని దాటిపోయి, ఆస్తి కోసం ఏకంగా చంపేసే నీలాంటి వాళ్ళ స్థానం జైలు గదులే’ అంటూ లేచి బయటకు నడిచాడు అభిమన్యు నీలగిరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
ఇంటి ముందు మేజర్‌ పాండురంగారావు సెల్యూట్‌  చేస్తున్న నిలువెత్తు ఫోటో...
చట్టాన్ని కాపాడుతున్న అభిమన్యుకు సెల్యూట్‌ చేస్తున్నట్టు వుంది.

- శ్రీసుధామయి

ఇదీ చదవండి: దయ్యాల నౌకగా మారిన ‘మేరీ సెలెస్టే’.. నేటికీ అంతుచిక్కని మిస్టరీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement