ఫండే
వింతలు విశేషాలు
నవంబర్ 7, 1872.
న్యూయార్క్ నగరంలోని స్టేటెన్ ఐలండ్ ఓడరేవు వద్ద వాతావరణం కాస్త చల్లగా ఉంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా వాయిదా పడిన ‘మేరీ సెలెస్టే’ నౌక ఎట్టకేలకు ఆ రోజు ప్రయాణానికి సిద్ధమైంది. ఆ ఓడ కెప్టెన్ బెంజమిన్ బ్రిగ్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఇటలీలోని జెనోవా నగరానికి 1,700 బ్యారెళ్ల ముడి ఆల్కహాల్‌ను తీసుకెళ్లడం కోసం ఆ వాణిజ్య ప్రయాణం ప్రారంభమైంది.
ఎప్పుడూ ఒంటరిగానే వెళ్లే బ్రిగ్స్– ఈసారి తన భార్య సారా, ముద్దులొలికే రెండేళ్ల చిన్నారి కూతురు సోఫియాలను కూడా ఆ సుదీర్ఘ సముద్ర ప్రయాణానికి తీసుకెళ్తున్నాడు. వారితోపాటు మరో ఏడుగురు అనుభవజ్ఞులైన నావికా సిబ్బంది ఉన్నారు. అట్లాంటిక్ మహాసముద్రపు అలలను చీల్చుకుంటూ మేరీ సెలెస్టే ప్రయాణం ప్రారంభించింది.
రోజులు గడుస్తున్నాయి... సముద్రంపై వారి ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది. కెప్టెన్ బ్రిగ్స్ తన డైరీలో ప్రయాణ విశేషాలను ఎప్పటికప్పుడు రాసుకుంటున్నాడు. లాగ్ బుక్‌లో కూడా ఎంట్రీలు నమోదు చేస్తున్నాడు. చిన్నారి సోఫియా నవ్వులతో ఆ ఓడ కళకళలాడుతోంది.
నవంబర్ 25 ఉదయం...
అప్పటికి ఆ నౌక పోర్చుగీస్‌కు చెందిన అజోర్స్ ద్వీప సమూహంలోని ‘శాంటామారియా’ ద్వీపానికి కేవలం 6 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నట్టు ఎంట్రీ చేశాడు.
డిసెంబర్ 5వ తేదీ ఉదయం...
అజోర్స్ ద్వీపాల సమీపంలో అటుగా వెళ్తున్న మరో బ్రిటిష్ నౌక ‘డీ గ్రేషియా’ సిబ్బందికి మేరీ సెలెస్టే కనిపించింది. అయితే దాని గమనం వింతగా ఉంది. ఎలాంటి నియంత్రణ లేకుండా, దారి తప్పిన దానిలా అటూ ఇటూ ఊగిసలాడుతోంది. డీ గ్రేషియా కెప్టెన్ డేవిడ్ మోర్ హౌస్‌కు అనుమానం వచ్చింది. ఆ నౌక ఏమైనా ప్రమాదంలో చిక్కుకుందేమోనని దగ్గరకు వెళ్లారు. కానీ ఎవరూ కనిపించలేదు. మోర్‌హౌస్ తన సిబ్బందితో కలిసి నౌకలోకి వెళ్లారు.
లోపల మొత్తం నిశ్శబ్దం తాండవిస్తోంది. ఒక్క మనిషి కూడా కనిపించలేదు. కెప్టెన్ క్యాబిన్ లోకి వెళ్లి చూస్తే, టేబుల్ మీద లాగ్ బుక్ పేజీలు గాలికి రెపరెపలాడుతున్నాయి. అందులో చివరి ఎంట్రీ నవంబర్ 25న రాసినట్టుంది. నౌకలో ఎలాంటి పోరాటం జరిగిన ఆనవాళ్ళు కనిపించలేదు. ఎక్కడా రక్తపు మరకలు లేవు. ప్రయాణికుల లగేజీ, బట్టలు, చివరకు నెల రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, మంచినీరు అన్నీ అలాగే ఉన్నాయి. నౌక మునిగిపోయే ప్రమాదంలో కూడా లేదు.
అయితే, నౌకలో ఉండాల్సిన ఒకే ఒక చిన్న రెస్క్యూ బోట్ మాత్రం మిస్ అయింది. భద్రంగా ఉన్న నౌకను, అందులో సరుకును, ఆహారాన్ని వదిలిపెట్టి వారంతా లైఫ్ బోట్‌లో ఎందుకు వెళ్లారో మోర్ హౌ‹స్‌కు అర్థం కాలేదు.
దీంతో ఆ నౌకను సుమారు 800 మైళ్ల దూరంలో ఉన్న జిబ్రాల్టర్ వైపు తీసుకెళ్లారు. అక్కడ బ్రిటిష్ అధికారులు విచారణ ప్రారంభించారు. దోపిడీ లేదా హత్యలకు ఎలాంటి ఆధారాలూ లభించలేదు. చివరకు ఈ ఘటనలో ఎలాంటి కుట్రా జరగలేదని నిర్ధారణకు వచ్చారు. నౌకలో ఉన్న ముడి ఆల్కహాల్ బ్యారెళ్ల నుంచి గ్యాస్ లీకై, ఏదో భయంకరమైన పేలుడు జరగబోతోందని కెప్టెన్ భయపడి ఉంటాడని, అందుకే అందరితో కలిసి లైఫ్ బోట్‌లోకి ఎక్కి అక్కడ నుంచి దూరంగా వెళ్లడానికి ప్రయత్నించి ఉంటారని భావించారు. సముద్రపు అలల తాకిడికి ఆ బోట్ మునిగిపోయి ఉండొచ్చనే ఊహాగానాలు చెలరేగాయి. కానీ నిజంగా వారు ఎలా ఏమైపోయారో మాత్రం కనుక్కోలేకపోయారు.
ఆ తర్వాత ఆ నౌకను వేరే వాళ్లకు అమ్మేశారు. అది కొన్నవారికీ నష్టాలే మిగిలాయి. చివరకు 1885లో కావాలనే ఆ ఓడను బండరాళ్లకు ఢీకొట్టి, ఇన్సూరెన్స్ డబ్బులు స్వాహా చేయడానికి యత్నించడంతో అది పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోయింది. 1884లో ప్రముఖ రచయిత ఆర్థర్ కానన్ డోయిల్ ఈ ఘటన ఆధారంగా ఒక కల్పిత కథ రాశాడు. అందులో అసలు ఘటనలకు భిన్నమైన కల్పిత అంశాలను జోడించాడు. అక్కడి నుంచి మేరీ సెలెస్టే పేరు దయ్యాల నౌకగా మార్మోగింది. తర్వాత ఈ ఘటన ఆధారంగా సినిమాలు, పుస్తకాలు, పరిశోధనలు ఎన్నో వచ్చాయి. ప్రతి ఒక్కరూ తమదైన సమాధానం చెప్పారు. కానీ, నిజమైన సమాధానం మాత్రం ఎవరికీ దొరకలేదు. అది అట్లాంటిక్ అలల్లోనే ఎక్కడో శాశ్వతంగా మునిగిపోయింది.
- సత్యకిశోర్ కొండ్రెడ్డి
ఇదీ చదవండి: గాడిద మిస్సింగ్!


