న్యూఢిల్లీ: రామాయణం సినిమా నేపథ్యంలో ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ప్రతి భారతీయుడి రక్తంలో రాముడు ఉన్నాడని, రాముడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఒక జీవన విధానమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు మౌలానా సాజిద్ రషీది తీవ్రంగా స్పందించారు. జావేద్ అక్తర్ పేరును రామ్‌పాల్‌గా మార్చుకోవాలని సూచించారు.
షారుఖ్ ఖాన్ నటించిన ‘స్వదేశ్’ సినిమాలోని ‘పల్ పల్ హై భారీ’ పాట గురించి మాట్లాడిన సందర్భంగా జావేద్ అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మనసులోని రావణుడిని బయటకు పంపిస్తే, ఆ మనసులో రాముడు ఉంటాడు’ అనే అర్థం వచ్చే పాటలోని పంక్తులను ప్రస్తావించారు. రాముడు ఒక మతానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన నైతిక విలువలు, జీవన విధానాన్ని బోధించిన మహనీయుడన్నారు. మతంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి రక్తంలో రాముడు ఉన్నాడని అన్నారు.
అయితే జావేద్ అక్తర్ వ్యాఖ్యలను మౌలానా సాజిద్ రషీది తప్పుబట్టారు. జావేద్ అక్తర్ ఒక వ్యాపారవేత్త అని, బాలీవుడ్‌లో పాటలు అమ్ముడుపోవాలంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందని విమర్శించారు. గతంలో అనేక సందర్భాల్లో తాను నాస్తికుడినని, ఏ మతాన్నీ నమ్మనని జావేద్ అక్తర్ చెప్పారని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఇప్పుడు రాముడిపై ఇంతటి విశ్వాసాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు.
అంతేకాదు.. ఆయన పేరును జావేద్ అక్తర్ నుంచి రామ్‌పాల్‌గా మార్చుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలా చేస్తే దేశంలోని 80 శాతం హిందూ జనాభా ఆయనకు పూర్తి గౌరవం, ఆదరణ ఇస్తుందని అన్నారు. వివిధ సిద్ధాంతాలకు అనుగుణంగా మాట్లాడకుండా ఒక స్పష్టమైన వైఖరిని తీసుకోవాలని సూచించారు.
జావేద్ అక్తర్ కుటుంబ సభ్యులు కూడా సినిమా రంగంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారని రషీది ఆరోపించారు. ఒకరి పనిని మరొకరు ప్రశంసించుకోకపోతే వారి వ్యాపారం ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. తాను ముస్లింనని, తన మతపరమైన గుర్తింపు పట్ల గర్వంగా ఉన్నానని పేర్కొన్నారు. రెండు పడవలపై ప్రయాణించేందుకు ప్రయత్నించడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ వివాదంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ స్పందించారు. రామాయణం హిందువులకు పవిత్రమైన గ్రంథమని పేర్కొన్నారు. అయితే ప్రతి ఒక్కరికీ తమదైన ఆలోచనా విధానం, అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంటుందని అన్నారు. సీతను ఎందుకు వనవాసానికి పంపించారనే ప్రశ్నతో సహా రామాయణంలోని కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 2026 పదంగా ‘హ్యూమన్’ ఎందుకు నిలిచింది?


