ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా దేశంలోని ముస్లిం సమాజానికి చెందిన పలు వర్గాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మసీదులు, మదర్సా ప్రాంగణాలు, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఖురాన్ పఠనం, ప్రార్థనలు నిర్వహించగా.. సాయంత్రం ప్రముఖ సూఫీ దర్గాల్లో దీపాలు వెలిగించే కార్యక్రమాలు చేపట్టనున్నారు.
మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మైనారిటీ మోర్చాతో అనుబంధం ఉన్న ముస్లిం వర్గాలు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ‘అందరి సహకారం, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం’ అనే నినాదంతో సూఫీ సంస్థలు, ఖాన్కాహ్‌లు, ఉలేమాలు ఈ రోజును ఆధ్యాత్మిక ప్రార్థనలు, సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ముస్లిం మహిళలు ఒకచోట చేరి కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం ఖురాన్ పఠించి మోదీ దీర్ఘాయుష్షు కోసం ప్రార్థనలు చేశారు. వారి పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ పాల్గొన్న ఓ వ్యక్తి.. మోదీ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తుండడంతో ఆయన దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మీరట్‌లో బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు అన్వర్ ఖురేషీ ఇంట్లోనూ కార్యక్రమం జరిగింది. ముస్లిం సమాజానికి చెందినవారు, బీజేపీ కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ, లక్నో, వారణాసి, భోపాల్, ముంబై తదితర నగరాల్లోనూ మోదీ దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, దేశ శాంతి, అభివృద్ధి కోసం ఖురాన్ పఠనం నిర్వహించారు.
సాయంత్రం అజ్మీర్ షరీఫ్, ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా, దేవా షరీఫ్, కచౌఛా షరీఫ్ దర్గాల్లో వేలాది దీపాలు వెలిగించనున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గాలో ప్రస్తుతం 723వ ఉర్సు జరుగుతుండడంతో 723 దీపాలు వెలిగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వారణాసిలో ముస్లిం మహిళలు, స్థానిక సంస్థలు ప్రత్యేక దీపోత్సవంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నాయి. బస్తీల్లో భోజనం, పండ్ల పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తాయి.
ఇదీ చదవండి: 15 ఏళ్ల తర్వాత గోడను కూలగొడితే లైబ్రరీ బయటపడింది..


