‘ఈ20’పై రగడ: వారు సైన్స్‌ తెలియని మూర్ఖులు.. సురేశ్ గోపి ఫైర్! | Idiots Who Dont Know Science Suresh Gopi | Sakshi
Sakshi News home page

‘ఈ20’పై రగడ: వారు సైన్స్‌ తెలియని మూర్ఖులు.. సురేశ్ గోపి ఫైర్!

Nov 18 2026 8:31 AM | Updated on Nov 18 2026 8:37 AM

Idiots Who Dont Know Science Suresh Gopi

న్యూఢిల్లీ: ఈ20 పెట్రోల్‌ విషయంలో వస్తున్న విమర్శలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి తీవ్రంగా స్పందించారు. ఈ ఇంధనంలో ఇథనాల్ కలపడాన్ని తప్పుబడుతున్నవారిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సైన్స్‌ గురించి తెలియని మూర్ఖులంటూ విమర్శకులపై విరుచుకుపడ్డారు. మంగళవారం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కేరళలోని త్రిస్సూర్‌లో నిర్వహించిన యువజన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ20 పెట్రోల్‌పై ఆరోపణలు చేస్తున్నవారి వెనుక వక్రీకరించిన రాజకీయ ఆలోచనలు ఉన్నాయని సురేశ్ గోపి అన్నారు. ఈ ఇంధనం వెనుక ఉన్న శాస్త్రీయ అంశాలు తెలియకుండానే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంధనంలో ఇథనాల్ శాతాన్ని పరీక్షిస్తున్నవారు క్యాన్లలో పెట్రోల్ కొనుగోలు చేసి, అందులో ఏవో పదార్థాలు కలిపి నమూనాలను పరీక్షలకు పంపే అవకాశం ఉందని ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిపించేందుకు సీబీఐని కూడా రంగంలోకి దించాల్సి రావచ్చని మంత్రి వ్యాఖ్యానించారు. అప్పుడు ఈ వ్యక్తులు సీబీఐకి వ్యతిరేకంగా కూడా మాట్లాడతారని అన్నారు.

పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ఈ10 నుంచి ఈ20కి పెంచే నిర్ణయం ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఊఆర్‌ఏఐ) నిర్వహించిన పరిశోధనలు, పునఃపరిశోధనల తర్వాతే తీసుకున్నట్లు సురేశ్ గోపి వివరించారు. కాలానికి అనుగుణంగా మారని ఇంజిన్ల నుంచి వెలువడే పొగను నియంత్రించేందుకు ఇథనాల్ కలపడం ఒక్కటే సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. వాహనాల నుంచి వెలువడే పొగలో ఎలాంటి రసాయనాలు ఉంటున్నాయో అర్థం చేసుకోవాలని మంత్రి సూచించారు. వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలపై జెనీవా ఒప్పందాల ద్వారా కఠిన నిబంధనలు అమలవుతున్నాయని చెప్పారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందేనని, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత ఇంధనాల అన్వేషణ జరుగుతోందని పేర్కొన్నారు.

మరోవైపు పెట్రోల్‌లో ఇథనాల్ శాతం నిర్ణీత 20 శాతానికి మించుతోందా లేదా అన్నది తెలుసుకునేందుకు కేరళ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తోంది. గతవారం కర్ణాటకలో చేపట్టిన పరీక్షల్లో కొన్ని పెట్రోల్ నమూనాల్లో ఇథనాల్ శాతం 31.2 వరకు ఉన్నట్లు వెల్లడైంది. అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు సంయుక్త ప్రకటన విడుదల చేసి కర్ణాటక పరీక్షల ఫలితాలను ఖండించాయి. దీంతో ఈ20 ఇంధనంపై వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: అకస్మాత్తుగా ఆగిన ఆపిల్ సేవలు.. యూజర్లకు షాక్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement