పెట్రోల్‌ను పరీక్షించే స్వేచ్ఛ ఉంది.. కానీ.. | Ethanol Blending Controversy Suresh Gopi Warns States Against Politics | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ను పరీక్షించే స్వేచ్ఛ ఉంది.. కానీ..

Nov 9 2026 10:15 AM | Updated on Nov 9 2026 10:15 AM

Ethanol Blending Controversy Suresh Gopi Warns States Against Politics

దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడంపై జరుగుతున్న చర్చల నడుమ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. కర్ణాటక, కేరళ రాష్ట్రాలు పెట్రోల్‌లో ఇథనాల్‌ శాతాన్ని నిర్ధారించడానికి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించే పూర్తి స్వేచ్ఛ కలిగి ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు. అయితే, ఈ అంశాన్ని అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ వివాదాలు సృష్టించడం సరికాదన్నారు.

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను మిళితం చేసే విధానం (E20) పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిలో పకడ్బందీ అధ్యయనం తర్వాతే అమలు చేస్తున్నట్లు సురేష్ గోపి చెప్పారు. ఈ బ్లెండింగ్ విధానం రాబోయే రోజుల్లో దశలవారీగా మరింత క్రమబద్ధంగా అమలు చేస్తామని తెలిపారు. ఇంధన నాణ్యతపై రాష్ట్రాలు తమకు నమ్మకం లేకపోతే స్వతంత్రంగా తనిఖీలు చేసుకోవచ్చని స్వాగతించినప్పటికీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని వక్రీకరించి ప్రజల్లో అభద్రతాభావాన్ని సృష్టించడం తగదని హెచ్చరించారు.

వివాదానికి అసలు కారణం ఏమిటి?

ఇటీవల కర్ణాటకలో ప్రభుత్వ అధికారులు, మంత్రులు జరిపిన కొన్ని స్వతంత్ర పరీక్షల్లో నిర్ణీత పరిమితి (20%) కంటే ఎక్కువ మోతాదులో ఇథనాల్‌ కలిసిందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. కొన్ని నమూనాల్లో ఈ శాతం మరింత ఎక్కువగా ఉందని రాష్ట్ర మంత్రులు ఆరోపించడంతో ఈ అంశం జాతీయ స్థాయిలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. దీనిపై ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభించారు.

అయితే, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ ఆరోపణలను గతంలోనే తీవ్రంగా ఖండించాయి. దేశవ్యాప్తంగా సరఫరా చేయబడుతున్న ఈ20 పెట్రోల్ పూర్తిగా నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉందని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి సురేష్ గోపి జోక్యం చేసుకుంటూ నాణ్యతా పరీక్షల పేరుతో రాజకీయం చేయడం వల్ల వ్యవస్థపై అనవసరమైన ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌.. రహస్య రికార్డులు లీక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement