న్యూఢిల్లీ: ధన్‌తేరస్ పండుగకు సెలవు కావాలని అడిగిన ఉద్యోగికి బాస్ అనుమతి నిరాకరించారు. తనకు పెయిడ్ లీవ్స్ (పీఎల్) ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకోవడానికి కూడా అంగీకరించకపోవడంతో సదరు ఉద్యోగి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ‘రెడ్డిట్’లో పంచుకోవడంతో ఉద్యోగుల హక్కులు, ప్రైవేట్ కంపెనీల పని సంస్కృతిపై చర్చ మొదలైంది. ఆ ఉద్యోగి ఇప్పటివరకు కంపెనీలో ఒక్క పెయిడ్ లీవ్ కూడా ఉపయోగించుకోలేదని తెలిపారు. గత అక్టోబర్ చివరి వారంలో నాలుగు రోజులు సెలవు తీసుకోవాలనుకున్నా, పనిభారం ఎక్కువగా ఉందంటూ బాస్ అభ్యర్థించడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు చెప్పారు.
తనకు అప్పగించిన అసలు బాధ్యతలకు అదనంగా ఇతర విభాగాల పనులు కూడా చేస్తున్నానని, క్లయింట్లను కలవడం, సమావేశాలకు హాజరవడం వంటి పనులను ఒక్కడినే నిర్వహిస్తున్నానని వెల్లడించారు. కంపెనీ ఆదాయం పెరుగుతున్నప్పటికీ తన జీతం మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, పని పూర్తయిన తర్వాత సహోద్యోగులతో మాట్లాడుతున్నా బాస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంతో తన మానసిక స్థితి దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.
ఈ పోస్టుపై స్పందించిన పలువురు రెడ్డిట్ యూజర్లు ఉద్యోగికి సూచనలు చేశారు. సెలవులు ఉద్యోగుల హక్కు అని, హెచ్‌ఆర్ విభాగానికి ఫిర్యాదు చేయాలని ఒకరు సూచించారు. మరికొందరు అదనపు బాధ్యతలకు తగిన జీతం డిమాండ్ చేయాలని, అవసరమైతే మరో ఉద్యోగం వెతుక్కోవాలని సలహా ఇచ్చారు.
ఇదీ చదవండి: పండుగ పూట పరీక్షేంటి?.. ‘బోర్డు’ను నిలదీస్తున్న విద్యార్థులు!


