వాషింగ్టన్: ఉక్రెయిన్ సైన్యం స్టార్‌లింక్ (Starlink) సేవలను నిబంధనలకు విరుద్ధంగా దాడి చేసే డ్రోన్ల ఆపరేషన్లకు ఉపయోగించిందని స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ ఆరోపించారు. స్టార్‌లింక్ అనేది పౌర అవసరాల కోసం రూపొందించిన కమర్షియల్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ అని, దీనిని మనుషులను చంపే ఆక్రమణ దాడి కార్యకలాపాలకు ఎప్పుడూ అనుమతించలేదని, గత వారమే ఆ లూప్‌హోల్‌ను (లోపాలను) మూసివేశామని ఆయన ఎక్స్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం నియంత్రించే ‘స్టార్‌షీల్డ్’ అనే ప్రత్యేక శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్‌కు, ఈ పౌర సేవకు చాలా తేడా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సైన్యం నిబంధనలను ఉల్లంఘించి ఆక్రమణ దాడులకు స్టార్‌లింక్‌ను వాడుకున్నప్పటికీ, రష్యాకు వ్యతిరేకంగా దేశాన్ని రక్షించుకోవడంలో ఈ సేవలు ఇప్పటికీ అత్యంత కీలకమని మస్క్ నొక్కిచెప్పారు.
ఈ శాటిలైట్ నెట్‌వర్క్‌ను జామ్ చేయడం లేదా ధ్వంసం చేయడం కష్టమని, ఒకవేళ దీనిని ఆపివేస్తే ఉక్రెయిన్ ఫ్రంట్‌లైన్ వెంటనే కుప్పకూలుతుందని ఆయన హెచ్చరించారు. యుద్ధం ప్రారంభ దశలో రష్యా బలగాలు ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలను ధ్వంసం చేసినప్పుడు, ఉక్రెయిన్ రష్యా చేతిలో ఓడిపోకుండా కాపాడటంలో స్పేస్‌ఎక్స్ ఎంతో సహాయం చేసిందని ఆయన గుర్తుచేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత కాలం పొడిగించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు మస్క్ పునరుద్ఘాటించారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ.. స్టార్‌లింక్, స్టార్‌షీల్డ్ శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ల ఆపరేషనల్ స్పీడ్ ఇటీవలి నిబంధనలకు ముందు ఏవిధంగా ఉందో, మళ్లీ అదే స్థాయికి చేరుకుందని తెలిపారు. ఈ పునరుద్ధరణ ఫ్రంట్‌లైన్ లాజిస్టిక్స్‌ను, రష్యన్ డ్రోన్ల నుంచి రక్షణను మెరుగుపరిచిందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ‘నవంబర్ 1 ర్యాలీ’కి 10 లక్షల మంది హాజరు?


