చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు డీఎంకే, అన్నాడీఎంకే నేతలు ప్రయత్నిస్తున్నారని అధికార టీవీకే మంత్రి నిర్మల్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఏకంగా రూ.60 నుంచి 70 కోట్ల వరకు ఆఫర్లు ఇస్తున్నారని వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలను డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ ఖండించాయి.
ఈ వ్యవహారంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రమేయం ఉందని నిర్మల్ కుమార్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి డీఎంకే తీవ్రంగా స్పందించింది. తమకు టీవీకే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గత జూలైలోనూ ఇలాంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వంపై ప్రతిపాదిత అవిశ్వాస తీర్మానంలో వ్యతిరేకంగా ఓటు వేయాలని టీవీకే ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు ఆఫర్ చేశారన్న ఆరోపణలపై పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరిలో ఓ ఎన్నికల వ్యూహకర్త కూడా ఉన్నారు. మాజీ డీఎంకే మంత్రి వి. సెంథిల్ బాలాజీ సోదరుడిపైనా కేసు నమోదైంది.
మంత్రి ఆరోపణలను డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ ఖండించారు. అధికారంలో కొనసాగేందుకు టీవీకేనే రాజకీయ బేరసారాలకు పాల్పడుతోందని ఎదురుదాడి చేశారు. ఎన్నికల అనంతరం ఆరుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిని టీవీకే సోఫా మోడల్‌గా అభివర్ణించారు. నవంబర్ 13వ తేదీ తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారనుంది. ఆ రోజు టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుని ఆరు నెలలు పూర్తవుతాయి. దీంతో మరోసారి విశ్వాస పరీక్షకు అవకాశం ఏర్పడవచ్చన్న చర్చ జరుగుతోంది.
234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం టీవీకేకు 109 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో తొమ్మిది మంది మద్దతు అవసరం. కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ మిత్రపక్షాలుగా మద్దతు ఇస్తుండగా, సీపీఐ, సీపీఎం బయట నుంచి మద్దతు ప్రకటిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ డీఎంకే కూటమిని వీడి టీవీకే కూటమిలో చేరడం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చింది. 2029 లోక్‌సభ ఎన్నికల్లో టీవీకే-కాంగ్రెస్ కూటమి తమకు సవాలుగా మారవచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి: సీజేపీకి పాక్ నేతలతో లింకు.. కేంద్రం సంచలన ఆరోపణ!


