ఏఐ జనరేటర్ ఫోటో
ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగంలో ఉంటూ ఆర్థిక స్థిరత్వం సాధించిన మహిళ భర్త నుంచి జీవనభృతి పొందడానికి అర్హురాలు కాదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. భార్యకు నెలకు రూ.20వేల జీవనభృతి ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. బెంగళూరుకు చెందిన టెక్కీ దాఖాలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమలతతో కూడిన ధర్మాసనం పై మేరకు తీర్పు ఇచ్చింది.
భర్త వార్షిక ఆదాయం రూ.40 లక్షలు ఉందని, ఆయన నుంచి నెలకు రూ.85 వేలు జీవనభృతి చెల్లించాలని భార్య ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. భార్యకు నెలకు రూ.20 వేలు ఇవ్వాలని భర్తను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ భర్త హైకోర్టుకు ఆశ్రయించాడు. (బిఎన్‌ఎస్‌ఎస్)–2023 నిబంధన ప్రకారం కుటుంబ న్యాయస్థానం తీర్పు సమర్థవంతంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది.
కంప్యూటర్ సైన్స్ చదివిన సదరు మహిళకు నెలకు రూ.54,700 వేతనం వస్తుందని, మంచి ఆర్థిక స్థోమత కలిగి ఉంటూ స్వంతకాళ్లపై జీవించే సామర్థ్యం ఉన్నందున భర్తపై ఆధారపడినట్లుగా భావించలేమని హైకోర్టు పేర్కొంటూ కుటుంబ న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన రూ.20వేల మెయింటినెన్స్ ఆర్డర్ రద్దు చేసినప్పటికీ ఒక కీలక ఆదేశాన్ని కోర్టు ఇచ్చింది. భర్త ఇప్పటివరకు చెల్లించిన మెయింటినెన్స్ మొత్తాన్ని తిరిగి వసూలు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.
-కర్ణాటక


