కర్ణాటక: ఎన్నో ఆశలతో అత్తింట కాలుమోపిన వివాహితకు నిత్యం వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని నాయనహళ్లి గ్రామంలో చోటుచేసుకొంది. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఆరు నెలల కిందట బెంగళూరు కెఆర్ పురం బిదరెహల్లి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి కుమార్తె ప్రతిభ(26)ను చింతామణి తాలూకా నాయనహళ్లి గ్రామానికి చెందని బచ్చనగారి కృష్ణారెడ్డి కొడుకు రఘుకు ఇచ్చి వివాహం చేశారు.
అయితే రోజూ ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి. రోజూ ఉదయం మాత్రమే వంట చేయాలి. మధ్యాహ్నం, రాత్రి ఆ వంటలనే ఆరగించాలి. కూరగాయలు కుళ్లిపోయినా వాటితోనే వంటలు చేయాలి. ఇలా రకరకాలుగా వేధించారు. అప్పటికే ఆమె మూడు నెలల గర్భిణి. ఈ వేధింపులు తాళలేక ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్పీ పద్మిని సాహో, డీఎస్పీ రఘు, తహసీల్దార్ సుదర్శన్ యాదవ్ ఘటన స్థలాన్ని సందర్శించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. భర్త రఘును పోలీసులు ఆరెస్టు చేశారు.
ఇదీ చదవండి: పాల ధరల పెంపు.. 35 శాతం పెరిగిన బస్సు ఛార్జీలు!


