ఢిల్లీలో కూలిన మరో భవనం.. ఇద్దరు మృతి! | 2 Dead Many Feared Trapped As 3 Storey Building Collapses In Delhis Chawri Bazaar | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కూలిన మరో భవనం.. ఇద్దరు మృతి!

Nov 5 2026 12:04 PM | Updated on Nov 5 2026 12:07 PM

2 Dead Many Feared Trapped As 3 Storey Building Collapses In Delhis Chawri Bazaar

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భవనాల కూలిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం ఉదయం ఓ నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఓల్డ్ ఢిల్లీలోని చావ్రీ బజార్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి గాయపడగా.. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.

ఉదయం 9.50 గంటల సమయంలో చావ్రీ బజార్ మెట్రో స్టేషన్ సమీపంలోని గలీ సితారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఆరు ఫైర్‌ యూనిట్లతో పాటు వాటర్ ట్యాంకర్లు, సహాయక వాహనాలను ఘటనాస్థలికి పంపించారు. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇటీవలే ఈశాన్య ఢిల్లీలోని మిలన్ గార్డెన్ ప్రాంతంలోనూ నిర్మాణంలో ఉన్న భవనంలోని రెండు స్లాబులు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో చంద్రపాల్ (60), విజయ్ కుమార్ (33) మరణించారు. పాత ఇంటిపై కొత్త అంతస్తు నిర్మిస్తుండగా పైకప్పులో కొంత భాగం కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

అంతకుముందు అక్టోబర్ 7న సీమాపురిలో నాలుగు అంతస్తుల భవనం కూలి ఓ చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఎనిమిది మందిని సహాయక సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. తాజా ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, మున్సిపల్ కార్పొరేషన్‌పై విమర్శలు గుప్పించారు. సెప్టెంబర్ 6న సత్య నికేతన్‌లో పీజీ భవనం కూలిన ఘటన తర్వాత ఢిల్లీలోని భవనాలకు భద్రతా తనిఖీలు నిర్వహించినట్లు గుర్తుచేశారు. మరి తనిఖీలు జరిగినప్పటికీ భవనాలు ఎందుకు కూలుతున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement