పట్టాలెక్కిన బెంగళూరు టు ముంబై రైలు
అటకెక్కిన సికింద్రాబాద్– ఢిల్లీ ప్రతిపాదనలు
సికింద్రాబాద్– వారణాసి, సికింద్రాబాద్– ముంబై మధ్య డిమాండ్
ప్రస్తుతం వందేభారత్ సీటర్ రైళ్లకే పరిమితమైన ద.మ.రైల్వే
సాక్షి, హైదరాబాద్: ఆధునిక హంగులతో రూపొందించిన వందేభారత్ స్లీపర్ రైళ్లు ప్రత్యేక ఆకర్షణకు మారుపేరు. ఇప్పటికే ఇవి ఉత్తరాదిలో పరుగులు తీస్తున్నాయి. తాజాగా బెంగళూరు– ముంబై మధ్య వందేభారత్ స్లీపర్ పట్టాలకెక్కింది. హైదరాబాద్– న్యూఢిల్లీ మధ్య చాలా రోజుల క్రితమే ప్రతిపాదించిన ఈ రైలుపై మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి.
దక్షిణాదిలో ఈ రైలు తొలిసారి అందుబాటులోకి రావడంతో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రవేశపెట్టాలని ప్రయాణికులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈశాన్య ప్రాంతంలోని గౌహతి నుంచి కోల్‌కతా మధ్య వందే భారత్ స్లీపర్ నడుస్తోంది. దేశంలోనే మొదటిసారి ఈ రైలును కామాఖ్య నుంచి కోల్‌కతా మధ్య ప్రవేశ పెట్టారు. ఢిల్లీ– వారణాసి మధ్య కూడా వందేభారత్ స్లీపర్ రానుంది.
దీంతో దక్షిణమధ్య రైల్వే పరిధిలో ప్రతిపాదనల్లో ఉన్న సికింద్రాబాద్– ఢిల్లీతో పాటు సికింద్రాబాద్– అయోధ్య వయా వారణాసి మధ్య వీటిని నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. వందే భారత్ స్లీపర్ పూర్తిగా ఏసీ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఇది పుష్‌పుల్ సాంకేతికతతో నడుస్తుంది. గరిష్టంగా గంటకు 130 నుంచి 160 కి.మీ వేగంతో ప్రయాణించేలా రూపొందింది.
ఇప్పుటికి వందేభారత్ సీటర్‌లే..
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు రెండు వందేభారత్‌లు, సికింద్రాబాద్– తిరుపతి, కాచిగూడ–బెంగళూరు మధ్య వందేభారత్ సీటర్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికులు ఈ రైళ్లలో కూర్చొని మాత్రమే ప్రయాణంచేస్తారు. సుదీర్ఘమైన ప్రయాణాలకు ఇవి అనుకూలం కాదు.
ఈ నేపథ్యంలోనే స్లీపర్‌లకు డిమాండ్ ఏర్పడింది. దక్షిణమధ్య రైల్వే పరిధిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రైళ్లను నడిపేందుకు అనుకూలంగా సామర్థ్యాన్ని పెంచారు. కాజీపేట నుంచి ఢిల్లీ వరకు గ్రాండ్‌ట్రంక్ మార్గంలో దాదాపుగా 3వ మార్గం అందుబాటులోకి వచి్చంది. రైల్వే రక్షణ కవచ్ వ్యవస్థతో పాటు ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో రైళ్లు మరింత వేగంగా పరుగులు పెట్టే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఉన్న వందేభారత్ రైళ్ల కంటే వందేభారత్ స్లీపర్‌లలో ప్రయాణ సమయం బాగా తగ్గనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి తెలంగాణ ఎక్స్‌ప్రెస్, హజ్రత్ నిజాముద్దీన్ తదితర రైళ్లు ఉన్నప్పటికీ గంటల తరబడి వీటిలోనే గడపాల్సివస్తోంది. వందేభారత్ స్లీపర్‌లతో తక్కువ ప్రయాణ సమయంలో రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధానికి రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది.
నమో భారత్.. ఏమో..
దక్షిణమధ్య రైల్వే పరిధిలో 200 కి.మీ. తక్కువ దూరంలో రాకపోకలు సాగించేందుకు నమో భారత్ ర్యాపిడ్ (లోకల్ ఇంటర్ సిటీ పుష్‌పుల్ ఏసీ) రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదించినా ఆ దిశగా ఎలాంటి పురోగతి లేదు.
హమ్ సఫర్, జన శతాబ్ది, ఉదయ్ డబుల్ డెక్కర్, సంపర్క్ క్రాంతి, అంత్యోదయ లాంటి రైళ్లు సైతం ఇప్పటి వరకు కేటాయింకపోవడం గమనార్హం. ఇంటర్‌సిటీ రైళ్లు కూడా అందుబాటులోకి రాకపోవడంతో ప్రయాణికులు రోడ్డు మార్గంపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది.
ఇదీ చదవండి: స్మార్ట్ రూట్‌లో ఉద్యోగ వేట


