పతకం అందుకున్న కొద్దిసేపటికే.. మారథాన్‌లో విషాదం! | Hyderabad Marathon Software Engineer Heart Attack Incident | Sakshi
Sakshi News home page

పతకం అందుకున్న కొద్దిసేపటికే.. మారథాన్‌లో విషాదం!

Nov 2 2026 9:57 AM | Updated on Nov 2 2026 10:12 AM

Hyderabad Marathon Software Engineer Heart Attack Incident

మరణానికి ముందు మెడల్‌తో గోపి

హైదరాబాద్‌, గచ్చిబౌలి: మారథాన్‌లో అపశృతి చోటుచేసుకుంది. ఇందులో పాల్గొన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గుండెపోటుతో మృతి చెందారు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ కె.సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ అల్కాపురి కాలనీకి చెందిన కొమ్మినేని గోపి (36) నాలుగేళ్లుగా ఐబీఎం కంపెనీ సీనియర్‌ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు.

ఆదివారం ఉదయం ఎన్‌ఈబీ స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘హైదరాబాద్‌ హైటెక్‌ ఫుల్‌ మారథాన్‌’లో ఆయన పాల్గొన్నారు. పరుగు పూర్తి చేసి పతకం అందుకున్న అనంతరం 8.45 గంటల సమయంలో అల్పాహారం చేసేందుకు వెళ్లే క్రమంలో.. ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే సహచరులు, నిర్వాహక బృందం సీపీఆర్‌ చేశారు. ఆ తర్వాత గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే గోపి మృతి చెందినట్లు చెప్పారు.

ప్రాథమిక విచారణలో గుండెపోటు కారణంగానే ఆయన మరణించినట్లు తెలుస్తోందని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. మృతుడికి భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నట్లు సమాచారం. అప్పటి వరకు సరదాగా మాట్లాడిన గోపి విగతజీవిగా మారడంతో రన్నర్లు విషాదంలో మునిగారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: విద్యార్థినులపై దాడి చేసిన హేమంత్‌ కథ ముగిసినట్టేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement