మహిళా ఉద్యోగులే టార్గెట్‌.. సిరిసిల్లలో వేధింపుల బాగోతం! | Forest officer suspended over harassment of woman employee | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగులే టార్గెట్‌.. సిరిసిల్లలో వేధింపుల బాగోతం!

Nov 2 2026 10:03 AM | Updated on Nov 2 2026 10:14 AM

Forest officer suspended over harassment of woman employee

AI ఫోటో

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో చాలా కాలంగా ఓ మహిళా డాక్టర్‌ పనిచేస్తున్నారు. ఆమె భర్త హైదరాబాద్‌లో వైద్యుడిగా సేవలందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని ఓ కీలక అధికారి తన చాంబర్‌లోనే, తన వద్దనే ఉండాలని, బయట ఎందుకు కూర్చుంటున్నారని సదరు మహిళా డాక్టర్‌ను వేధిస్తున్నారు. అధికారి చాంబర్‌లో కూర్చోవడం ఇష్టం లేని ఆ మహిళా డాక్టర్‌ వేరే చాంబర్‌లో కూర్చుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సదరు డాక్టరమ్మకు మెమోలు ఇవ్వడం, వేతనం ఆపేస్తాను.. సరెండర్‌ చేస్తానంటూ వేధిస్తున్నాడు. అతని వేధింపులు భరించలేని ఆ మహిళా డాక్టర్‌ నేరుగా కలెక్టర్‌ను కలిసి వేధింపులపై గోడు వెల్లబోసుకున్నట్లు సమాచారం. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన పది రోజులకు మళ్లీ ఆ మహిళా డాక్టర్‌కు సదరు ఆస్పత్రి ముఖ్య అధికారి మెమో జారీ చేసి వేధిస్తున్నాడు.

జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ ఆఫీస్‌కు దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ జిల్లా నుంచి మహిళా అధికారి వచ్చారు. ఆమె భర్త స్థానికంగా లేకపోవడంతో ఆఫీస్‌లో పనిచేసే ఓ ఉద్యోగి కన్నుపడింది. ఆమె ఆఫీస్‌ పని ఏది చెప్పినా సదరు పురుష ఉద్యోగి ఏదో వంక చెబుతూ చేయడం లేదు. ఇదేమిటని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. కానీ అతనిపై చర్యలేమీ లేవు. సదరు ఉద్యోగి మరింత కోపం పెంచుకుని ఆమెను లైంగికంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. విసిగిపోయిన సదరు అధికారి సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో కౌన్సెలింగ్‌ చేశారు.

అది సిరిసిల్ల ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీస్‌. ఆ ఆఫీస్‌కు కొత్తగా మహిళా ఉద్యోగి వచ్చారు. విధి నిర్వహణలో చురుగ్గా ఉండే ఆ మహిళా ఉద్యోగిపై ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీహరి ప్రసాద్‌ కన్నుపడింది. ఎలాగైనా లొంగదీసుకోవాలని లైంగిక వేధింపులకు గురిచేశాడు. సెల్‌ఫోన్‌కు రాత్రి వేళల్లో అసభ్యంగా మెసేజ్‌లు చేశాడు.     ఎఫ్‌ఆర్‌వో వేధింపులు భరించలేక సదరు మహిళా ఉద్యోగి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలు పరిశీలించిన అటవీశాఖ ఉన్నతాధికారులు సదరు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీహరిప్రసాద్‌ను సస్పెండ్‌ చేశారు.

సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) పరిధిలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిని అదే ఆఫీస్‌లో పనిచేసే రవి అనే జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆ వేధింపులు భరించలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ చేపట్టారు. సదరు ఉద్యోగి రవిని అక్టోబర్‌ 1న సస్పెండ్‌ చేశారు. 

సిరిసిల్ల: మహిళలు ఏ స్థాయిలో పనిచేస్తున్నా కీచకు ల వేధింపులు ఆగడం లేదు. ఇక్కడ.. అక్కడ.. అనే తేడా లేకుండా విధుల్లో మహిళలు కనిపిస్తే చాలు కొందరు మృగాళ్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జిల్లాలో పనిచేసే ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ మహిళా ఉద్యోగిణులు సహచరులతో వేధింపులకు గురవుతున్నారు. ప్రభుత్వ శాఖలతోపాటు బీడీలు చేసే చో ట, గార్మెంట్‌ రంగంలో పనిచేసే ప్రదేశాల్లోనూ వే ధింపులు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే చాలా మంది బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. 

మొక్కుబడిగా అంతర్గత కమిటీలు
పని స్థలాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి 2013లో ప్రభుత్వం చట్టం తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీస్‌లు.. వ్యాపార, వాణిజ్య సంస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఇంటర్నల్‌ కంప్‌లైంట్స్‌ కమిటీ–ఐసీసీ)లను ఏర్పాటు చేసింది. ఫిర్యాదులపై అంతర్గతంగా విచారణ చేసి చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించారు. కానీ జిల్లాలో ఎ న్నో ఫోక్సో కేసులు నమోదవుతున్నా అంతర్గతంగా విచారణలు చేస్తున్నా.. ఐసీసీ కమిటీలు మహిళలను వేధిస్తున్న కేసుల్లో మొక్కుబడిగానే పనిచేస్తున్నారు. జిల్లాలో 200లకు పైగా ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేటు సంస్థల్లో ఐసీసీ కమిటీలను వేయాల్సి ఉండగా.. కొన్నింట్లోనే కమిటీలు వేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అవీ కూడా మొక్కుబడిగానే పని చేస్తున్నాయి. 

ఐసీసీ కమిటీల నిర్మాణం
మహిళలు పనిచేసే ప్రైవేటు సంస్థలు, సహకార సంఘాల్లోనూ అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆఫీస్‌ లేదా సంస్థ సీనియర్‌ మహిళా ఉద్యోగి చైర్‌పర్సన్‌గా, మరో ఇద్దరు ఇందులో ఒక్కరు మహిళ, మరొకరు మహిళ కానీ వ్యక్తులు, లేదా న్యాయశాస్త్రం చట్టాలపై అవగాహన కలిగిన వ్యక్తులు, మరో వ్యక్తి సమాజ సేవకులు సభ్యులుగా ఉంటారు. మహిళల నుంచి ఐసీసీకి ఫిర్యాదులు వచ్చినప్పుడు విషయం బయటకు చెప్పకుండా అంతర్గతంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బాధిత మహిళలకు ఫిర్యాదు చేసినట్లు రశీదు ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా.. మహిళా    ఉద్యోగులపై వేధింపులు ఆగకపోవడం   చర్చనీయాంశమైంది.

ఐసీసీ సిపార్సుల మేరకు..
నేరం తీవ్రతను బట్టి వేధించిన వ్యక్తిని బదిలీ చేయడం, ఉద్యోగం నుంచి తొలగించడం, హెచ్చరించి వదిలేయడం, ప్రమోషన్‌ నిలుపుదల చేయడం, జరిమానా విధించడం, బాధితురాలికి ఇప్పించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 90 రోజుల్లో శిక్ష విధించాలి. విచారణ నివేదికను కలెక్టర్‌ లేదా జిల్లా మహిళా, శిశుసంక్షేమశాఖ అధికారికి అందించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఐసీసీ కమిటీ నిర్మాణం, సిపార్సులు పెద్దగా లేవు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో షీటీమ్‌లు విద్యాసంస్థల్లో, బస్టాండుల్లో, ఉపాధిహామీ కూలీలకు అవగాహన కల్పిస్తున్నారు. షీటీమ్‌ అవగాహన సదస్సులు తప్ప ఐసీసీ కమిటీల ఏర్పాటు అంతగా లేదు. ఇప్పటికైనా జిల్లాలో పూర్తి స్థాయిలో ఐసీసీ కమిటీలను నియమించి చర్యలు తీసుకోవాలి్సన అవసరం ఎంతైనా ఉంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement