పజాస్వామ్య పాలనలో లింకన్ నెలకొల్పిన విలువలు నేటి పాలకులకు విలువైన పాఠాలు.
చరిత్రకారిణి డోరిస్ కెర్న్స్ గుడ్‌విన్ రచించిన ‘టీమ్ ఆఫ్ రైవల్స్: ద పొలిటికల్ జీనియస్ ఆఫ్ అబ్రహాం లింకన్’ కేవలం లింకన్ జీవిత చరిత్ర మాత్రమే కాదు; భిన్నమైన అభిప్రాయాలు, వ్యక్తిత్వాలు, రాజకీయ ఆశయాలు కలిగిన వ్యక్తులను ఒకే లక్ష్యం కోసం ఎలా సమన్వయం చేయ వచ్చో వివరించే నాయకత్వ పాఠం. 1860లో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఎంపిక సమయంలో విలియం హెచ్.సీవర్డ్, సాల్మన్ పి.చేజ్, ఎడ్వర్డ్ బేట్స్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. రాజకీయ అనుభవం, పేరు ప్రఖ్యాతుల్లో వారు లింకన్‌కంటే ముందున్నట్లు అప్పట్లో అనుకునే వారు. అయినప్పటికీ, లింకన్ అభ్యర్థిగా ఎంపికై అధ్యక్షుడయ్యారు. తనను వ్యతిరేకించిన వారిని దూరంగా ఉంచే నాయకులకు భిన్నంగా, లింకన్ ఆ ముగ్గురికీ ప్రభుత్వంలో కీలక పదవులు అప్పగించారు. సీవర్డ్‌ను విదేశాంగ కార్యదర్శిగా, చేజ్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా, బేట్స్‌ను అటార్నీ జనరల్‌గా నియమించారు. ప్రత్యర్థుల ప్రతిభను వ్యక్తిగత కక్షలకు బలి చేయకుండా, దేశ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడమే ఆయన నాయకత్వంలోని విశిష్టత.
లింకన్ తన మంత్రివర్గ సభ్యులంతా తన అభిప్రాయాలతో ఏకీభవించాలని కోరుకోలేదు. కొందరు ఆయన నిర్ణయాలను విమ ర్శించేవారు. ముఖ్యంగా సీవర్డ్ తొలినాళ్లలో లింకన్ నాయకత్వ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేశారు. లింకన్ ఆయన అనుభవా నికి విలువనిచ్చి, సీవర్డ్ సలహా లను స్వీకరించారు. కాలక్రమంలో సీవర్డ్ ఆయ నకు అత్యంత విశ్వసనీయమైన సలహాదారుల్లో ఒకరిగా మారారు. ఈ పరిణామం నాయకత్వంలోని కీలక సత్యాన్నితెలియజేస్తుంది. సమర్థుడైన నాయకుడు తనను పొగిడే వారితోనే బృందాన్ని నిర్మించుకోడు; తన నిర్ణయాల్లోని లోపాలను ఎత్తిచూపగల వారికీ స్థానం కల్పిస్తాడు. విమర్శను వ్యక్తిగత అవ మానంగా భావించకుండా, అందు లోని విలువైన అంశా లను స్వీకరించడం ద్వారా నిర్ణయాలను మెరుగుపరుచు కుంటాడు.
ఉమ్మడి లక్ష్యమే ముఖ్యం
లింకన్ అధ్యక్షుడైన సమయంలో అమెరికా తీవ్ర సంక్షోభంలో ఉంది. బానిస త్వంపై ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య పెరిగిన విభేదాలు 1861లో అంతర్యుద్ధానికి దారితీశాయి. దేశ ఐక్యతను కాపాడటం, యుద్ధాన్ని ఎదుర్కోవడం, బానిసత్వ నిర్మూలన దిశగా ముందుకు సాగడం ఆయన ముందున్న సవాళ్లు. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ సభ్యుల మధ్య విభేదాలు, సైనికాధికారుల వైఫల్యాలు, రాజకీయ విమర్శలు కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ, లింకన్ వ్యక్తిగత ప్రతిష్ఠ కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారు. ఆర్థిక వ్యవహారాల్లో చేజ్ అనుభవాన్ని, విదేశాంగ విధానంలో సీవర్డ్ సామర్థ్యాన్ని ఉపయోగించుకున్నారు. ఇతరుల ప్రతిభను గుర్తించడం, వారికి తగిన బాధ్యతలు అప్పగించడం, విభేదాల మధ్య కూడా ఉమ్మడి లక్ష్యాన్ని మరచిపోక పోవడం ఆయన నాయకత్వంలోని ప్రధాన లక్షణం.
నిజమైన నాయకుడు పుట్టుకతోనే సంపూర్ణుడిగా ఉండడు. అనుభవాల నుంచి నేర్చుకుంటూ, విమర్శలను స్వీకరిస్తూ, తప్పు లను సరిదిద్దు కుంటూ ఎదుగుతాడు. తనకంటే ఎక్కువ ప్రతిభ ఉన్న వారిని చూసి అసూయపడకుండా, వారి సామర్థ్యాన్ని సంస్థ అభివృద్ధికి ఉపయోగించు కుంటాడు. విజయం వచ్చినప్పుడు బృందానికి గుర్తింపు ఇస్తాడు, వైఫల్యం ఎదురైనప్పుడు ఇతరులపై నిందలు వేయకుండా కారణాలను విశ్లేషించి పరిష్కారాలను అన్వేషిస్తాడు. సంక్షోభ సమయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాడు. టీమ్ ఆఫ్ రైవల్స్ (ప్రత్యర్థుల బృందం) అందించే అసలైన పాఠం ఇదే.
ప్రజాస్వామ్య పాలనలో లింకన్ నెలకొల్పిన ఈ విలువల పాఠం నేటి పాలకులకు మరింత అవసరం. ప్రజల సమస్యలను వినడం, విమర్శల్లోని వాస్తవాలను గుర్తించడం, తప్పులను సరి దిద్దుకోవడం ద్వారానే ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకో గలవు. ప్రత్యర్థులను అణచి అధికారాన్ని కాపాడుకోవాలనుకునే పాలకుడి కంటే, వారిని గౌరవించి ప్రజల కోసం కలిసి పని చేసే నాయకుడే చరిత్రలో నిలిచిపోతాడు.
ఇదీ చదవండి: ఒకే భూమి – ఒకే ఆరోగ్యం
– శేఖర్ శర్మ ఏటూరి, రిటైర్డ్ జిల్లా విద్యాశాఖాధికారి


