విశ్వగురు
గత కొన్ని వారాలుగా అమెరికా అంతటా నాలాంటి చాలామంది గ్రాడ్యుయేషన్ ప్రసంగాలు చేస్తున్నారు. 2026లో పట్టాలు అందు కుంటున్న విద్యార్థులకు జీవిత పాఠాలు చెబుతున్నారు. కొన్ని ప్రసంగాలు వినోదంగా ఉంటాయి. కొంతమంది థామస్ అక్వినాస్‌గురించి మాట్లాడతారు. మరికొందరు థామస్ జెఫర్సన్ గురించి చెబుతారు. ఈ ప్రసంగాలన్నింటిలో ఒక విషయం సాధారణంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చేయండి. మీ సామర్థ్యాన్ని మరింత పెంచుకోండి. ఇంకా పెద్ద కలలు కనండి.
మీకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు
ఈ రోజు బీఎంసీసీ నుంచి 2,000 మందికి పైగా విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకుంటున్నారు. వీరు 110కి పైగా దేశాలకు చెందినవారు. 28 భాషలు మాట్లాడతారు. ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం వేర్వేరుగా ఉన్నప్పటికీ... అందరూ ఈ రోజు ఒకే వేదిక వద్దకు చేరుకున్నారు. బీఎంసీసీ విద్యార్థులకు జీవితం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవితం అంటే ఏమిటో మీరు ఇప్పటికే అనుభవించారు.
» అమ్రీత జీనా... ఆమె 19 ఏళ్ల వయసులో గయానా దేశం నుంచి న్యూయార్క్‌కు వచ్చింది. ఆమె చదువులో ఎప్పుడూ మంచి విద్యార్థినే. అయితే మొదటి బిడ్డ పుట్టిన తర్వాత కాలేజీ చదువును వాయిదా వేసుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ చదువు కొన సాగించాలని నిర్ణయించుకుంది. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం, ఎక్కువ దూరం ప్రయాణించడం వంటి ఎన్నో సమస్యలు ఎదురైనా ఆమె వెనక్కి తగ్గలేదు. ఈ రోజు అమ్రీత అకౌంటింగ్‌లో డిగ్రీ పూర్తి చేస్తోంది. భవిష్యత్తులో తన సొంత అకౌంటింగ్ సంస్థను ప్రారంభించాలన్నది ఆమె లక్ష్యం.
» విరియాక్ హోమ్... కంబోడియాలో అనాథగా పెరిగాడు. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారుతూ జీవించాడు. అతను మొదటిసారి విమానం ఎక్కింది న్యూయార్క్‌లోని బీఎంసీసీలో చదువుకోవడానికి వచ్చినప్పుడే. ఈ రోజు అతను గణితశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేస్తున్నాడు.
» సింథియా కుక్బేజీ... ఈమె తన మూడో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బీఎంసీసీలో చేరింది. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు, పిల్లలకు డైపర్లు మార్చడం, అల్పాహారం తయారుచేయడం, వారిని స్కూల్‌లో దింపడం వంటి పనులన్నీ పూర్తిచేసేది. తెల్లవారుజామున 3 గంటలకే అలారం పెట్టుకుని, పిల్లలు నిద్ర లేవకముందే చదువుకునేది. ఈ రోజు సింథియా శ్వాసకోశ చికిత్సకు సంబంధించిన విభాగంలో డిగ్రీ పూర్తి చేస్తోంది.
ఇవి కేవలం ముగ్గురి కథలు మాత్రమే. గ్రాడ్యుయేషన్ ప్రసంగాలు చేసే వ్యక్తులు చెప్పే పట్టుదల మీలో ఇప్పటికే ఉంది. ఆ పట్టుదల లేకపోతే, మీరు ఈ రోజు ఇక్కడ ఉండేవారు కాదు.
వద్దన్నా మేయర్ పదవికి పోటీ
నేను కూడా అందరూ వెళ్లే దారిలోనే ప్రయాణించలేదు. నేను భారతీయుడిని. నేను ఆఫ్రికన్ ను. నేను అమెరికన్ ను కూడా. నేను ముస్లింని. నా కుటుంబంలో హిందువులు కూడా ఉన్నారు. నేను డ్రేక్ పాటలను ఇష్టపడతాను. నేను న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీ చేసినప్పుడు, చాలామంది నన్ను వద్దని చెప్పారు. ‘నీ వయసు ఇంకా సరిపోదు, నీకు సరైన పరిచయాలు లేవు, ఈ పదవికి అవసరమైన అర్హతలు నీకు లేవు’ అని అన్నారు.
నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు, నాకు కేవలం ఒక శాతం మంది మాత్రమే మద్దతు ఇస్తున్నారని కొన్ని వార్తలు వచ్చాయి. పోటీ చేయడానికి సిద్ధమైనప్పుడు, కొన్ని సర్వేల్లో నా పేరును కూడా చేర్చలేదు! నా ప్రత్యర్థులకు నా పేరు సరిగ్గా పలకడం కూడా రాదు. నాకు మద్దతు ఇచ్చిన కొందరికి కూడా నా పేరు సరిగ్గా పలకడం రాలేదు! అయినా నేను ఎందుకు పోటీ చేశాను?
ఎందుకంటే... మీలాగే నేను కూడా నా నుంచి ఏదో ఆశించాను. చాలామంది న్యూయార్క్ ప్రజల సహకారంతో మేము ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించాం. వర్షం కురుస్తున్నా, ఎండమండుతున్నా... ప్రజల ఇళ్లకు వెళ్లి నా కోసం మద్దతు కోరిన వారు ఎంతోమంది ఉన్నారు. ఒక నమ్మకంతో ముందుకు సాగాం. మనకు ఇష్టమైన ఈ నగరంలో గౌరవంగా జీవించడం అనేది అందని కలగా ఉండకూడదు అని వివరించాం. ప్రజల నమ్మ కాన్ని పొందాం. ఇది వినడానికి మంచి విజయగాథలా అనిపించ వచ్చు. కానీ నా ప్రయాణంలో ఎన్నో ఆందోళనలు, సందేహాలు, నిరాశలు, వైఫల్యాలు ఉన్నాయి. అయితే, కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకునే కుటుంబం ఉంది. అది నాకు లభించడం ఒక గొప్పఅదృష్టం. ఇలాంటి భద్రత, సహాయం అందరికీ ఉండవు.
పట్టుదల, సహనం
నేను విడుదల చేసిన చివరి పాటను సౌండ్‌క్లౌడ్‌లో వెయ్యిమంది కూడా వినలేదు. అయినా నా సంగీతం ద్వారా ఏదో సాధించాలన్న కలను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. నా యుక్త వయసులో సేకరించిన సీడీల గుట్టను చూస్తూ నిద్రలోకి జారుకునే వాడిని. కామన్, లూప్ ఫియాస్కో, జే–జెడ్, తాలిబ్ క్వెలీ వంటి ర్యాప్ గాయకుల పాటలు వినేవాడిని. వారి పాటల్లో ఒక ముఖ్యమైన భావం ఉండేది. జీవితంలో కిందపడినా, కష్టాల్లో ఉన్నా, మళ్లీ లేచి నిలబడాలి. నా జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సమయాల్లో ఈ పట్టుదలే నాకు బలాన్నిచ్చింది.
న్యూయార్క్‌లో జీవించడం అంటే కేవలం స్టైల్‌గా ఉండటం కాదు. సూర్యాస్తమయం సమయంలో రైలు వంతెన దాటే అంద మైన దృశ్యాన్ని చూడటం మాత్రమే కాదు. న్యూయార్క్‌లో జీవించడం అంటే ఇంటి అద్దె ఎలా చెల్లించాలి, కిరాణా సరుకులు కొనడా నికి డబ్బు సరిపోతుందా, ప్రతిరోజూ ప్రయాణించే రైలు ఆలస్య మైనప్పుడు ఎదురయ్యే సమస్యలను భరించడం, కొన్నిసార్లు రైలు సొరంగంలోనే ఆగిపోయినా ఓపికగా ఉండటం. ఈ నగరంలో జీవించాలంటే... మనలో ప్రతి ఒక్కరికీ పట్టుదల, సహనం, సమస్యలను తట్టుకునే శక్తి అవసరం. మీ ముందు అడ్డంకులు ఎన్ని ఉన్నా, మీ లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల అవసరం. ఆ తపనే న్యూయార్క్ నగరపు నిజమైన స్వభావం. మీ ప్రయాణం ఎంత కష్టంగా ఉన్నా, మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. మీ విజయం మీ జీవితాన్ని మాత్రమే కాదు, మరొకరి జీవితాన్ని కూడా మార్చగలదు.
నా జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సమయాల్లో ఈ పట్టుదలే నాకు బలాన్నిచ్చింది.
మీ విజయం మీ జీవితాన్ని మాత్రమే కాదు, మరొకరి జీవితాన్ని కూడా మార్చగలదు.
అమెరికాలోని బీఎంసీసీ (బరో ఆఫ్ మాన్హాటన్ కమ్యూనిటీ కాలేజ్) 2026 బ్యాచ్ పట్టభద్రులను ఉద్దేశించి న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ క్వామే మమ్దానీ స్నాతకోత్సవ ప్రసంగ సంక్షిప్త పాఠం:


