ప్రపంచానికి ప్రాచీన వెలుగు | Ancient India Global Trade Cultural Influence History | Sakshi
Sakshi News home page

ప్రపంచానికి ప్రాచీన వెలుగు

Oct 30 2026 8:09 AM | Updated on Oct 30 2026 8:09 AM

Ancient India Global Trade Cultural Influence History

- విలియం డాల్రింపుల్‌, - మొహమ్మద్‌ హుస్సేన్‌

వ్యూ పాయింట్‌

పాడ్‌కాస్ట్‌:
‘డేజా వూ’
అల్‌ జజీరా ఇంగ్లిష్‌

అతిథి:
విలియం డాల్రింపుల్‌, బ్రిటిష్‌ చరిత్రకారుడు, రచయిత

హోస్ట్‌:
మొహమ్మద్‌ హుస్సేన్‌, ‘డేజా వూ’ షో

అనేక శతాబ్దాల పాటు భారతదేశం ప్రపంచ వాణిజ్యానికి, సాంస్కృతిక వికాసానికి, మేధో సంపత్తికి అసలైన కేంద్రంగా ఎలా వెలుగొందిందో విలియం డాల్రింపుల్‌ ఈ పాడ్‌కాస్ట్‌లో వివరించారు.

సముద్రపు రహదారికి గుండెకాయ
‘‘యూరప్‌ను చైనాతో కలిపే ఒకే ఒక్క మార్గం ‘సిల్క్‌ రోడ్‌’ ద్వారానే ప్రపంచంలో వ్యాపారం, కొత్త ఆలోచ నలు సాగాయని, మిగతా ప్రాంతాలన్నీ పెద్దగా ప్రాధాన్యం లేనివని మనం అనుకుంటాం. కానీ, హిందూ మహాసముద్రం ఆ కాలంలోనే ఒక రద్దీ అయిన ‘సముద్రపు రహదారి’గా ఉండేది. ప్రాచీన భారతదేశం ఏదో ఒక మూలన ఉన్న ద్వీపకల్పం కాదు; మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం, పర్షియన్‌ గల్ఫ్, ఆగ్నే యాసియా ప్రాంతాలను ఒకే అంతర్జాతీయ వ్యాపార వ్యవస్థగా అనుసంధానించిన కీలకమైన మార్గం.

ఊడ్చుకుపోయిన రోమ్‌ ఖజానా!
‘‘భారతదేశంలోని మిరియాలు, సన్నని మస్లిన్‌ వస్త్రాలు, విలువైన రత్నాల కోసం రోమన్‌ ఉన్నత వర్గాలలో డిమాండ్‌ ఉండేది. ఆ డిమాండ్‌ను తీర్చడానికి ప్రతీ సంవత్సరం తమ సామ్రాజ్య ఖజానా నుండి బంగారం ఖాళీ అయిపోతోందని నాటి రోమన్‌ చరిత్రకారుడు ‘ప్లినీ ది ఎల్డర్‌’ వాపోయారు. ప్రపంచ సంపదనంతా భారతదేశం తనవైపు ఆకర్షించుకున్న కేంద్రం అనటానికి ఇదే నిదర్శనం. ప్రాచీన భారతదేశం ఏదో సాధారణ వస్తువులను సరఫరా చేసే చిన్న దేశం కాదు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఆర్థిక కేంద్రం.

కత్తి పట్టకుండానే ఖండాల ‘ఆక్రమణ’
‘‘భారతదేశం నుండి ప్రపంచానికి వ్యాపించినది కేవలం భౌతికమైన వ్యాపారం మాత్రమే కాదు. అదొక సాంస్కృతిక, మేధోపరమైన ఎగుమతుల అద్భుతమైన అల. దానిని మనం ‘ఇండోస్ఫియర్‌’ అని పిలుచుకోవచ్చు. శతాబ్దాల పాటు భారతీయ మతాలు, కళలు, శిల్పకళ,  సంస్కృత భాషా జ్ఞానం దక్షిణాసియా, ఆగ్నేయా సియాల అంతటా విస్తరించాయి. ఇవి అంగ్కోర్‌ వాట్, బోరోబుదూర్‌ వంటి శాశ్వతమైన అద్భుత కట్టడాల నిర్మాణానికి దారితీశాయి.

భారతీయ సాంస్కృతిక శక్తి ఆసియా ఖండపు రూపురేఖలనే మార్చివేసిందనటానికి అది రుజువు. ఈ విస్తరణ సైనిక దండయాత్రల ద్వారా జరగలేదు. వ్యాపారులు, బౌద్ధ/ హిందూ సన్యాసులు, ప్రయాణికులు సముద్ర మార్గాల ద్వారా భారతీయ ఆలోచనలు, రాజ్యపాలనా విధానాలు, ఇతిహాసాలు, మతపరమైన తత్వాలను తీసుకువెళ్లడం ద్వారా బర్మా (మయన్మార్‌) నుండి ఇండోనేషియా వరకు ఉన్న సమా జాలను శాశ్వతంగా మార్చివేశారు.

ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుల మేధస్సు
‘‘మానవాళికి భారతదేశం అందించిన అత్యంత మౌలికమైన కానుక... గణితం, విజ్ఞాన శాస్త్ర రంగాల లోనే ఉంది. బ్రహ్మగుప్తుడు వంటి మేధావులు ‘జీరో’కు స్పష్టమైన గణిత నియమాలను, రూపాన్ని ఇచ్చారు. ఆర్యభట్ట ఖగోళ శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఈ భావనలు మొదట బాగ్దాద్‌కి చేరి ‘ఇస్లామిక్‌ స్వర్ణయుగానికి’ పునాది వేశాయి. ఆ తర్వాత యూరప్‌కి చేరి, ఆధునిక శాస్త్రీయ విప్లవాన్ని సాధ్యం చేసిన ప్రాథమిక సాధనాలుగా మారాయి. నేడు మనం ఉపయోగిస్తున్న దశాంశ మానం (డెసిమల్‌ విధానం), సంఖ్యలతో సహా అనేక మేధోపరమైన అంశాలు దక్షిణాసియాలోనే పురుడుపోసుకున్నాయి. వీటిని అరబ్‌ పండితులు అనువదించి స్వీకరించారు.

మరుగైపోయిన ‘మహాశక్తి’ చరిత్ర
‘‘చారిత్రక విధ్వంసాలు, వలసవాద చరిత్ర రచన, ఆధునిక రాజకీయ ప్రచారాల కలయిక వల్ల భారత దేశపు అద్భుతమైన చారిత్రక వారసత్వం చాలావరకు కనుమరుగైంది. దండయాత్రల కారణంగా నలందవంటి ప్రముఖ విద్యా కేంద్రాలు ధ్వంసమయ్యాయి. బ్రిటిష్‌ వలస పాలన... పశ్చిమ దేశాల ఆధిపత్యం చుట్టూనే ఉద్దేశపూర్వకంగా చరిత్రను కేంద్రీకరించింది. ఇక ఇటీ వలి దశాబ్దాలలో చైనా తన ‘సిల్క్‌రోడ్‌’ కథ నాన్ని దూకుడుగా ప్రచారం చేయడం ద్వారా... ప్రపంచపు అసలైన మొట్టమొదటి ఆర్థిక, సాంస్కృతిక మహా శక్తిగా భారతదేశం నిర్వహించిన ప్రధాన పాత్రను వెనక్కి నెట్టేసింది.
- ఎడిటోరియల్‌ టీమ్‌

ఇదీ చదవండి: జెన్ జీ ఉద్యమాల దారెటు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement