breaking news
Ancient India
-
National Siddha Day: ద్రవిడుల ప్రాచీన శాస్త్రీయ వైద్యం
భారతీయ వైద్యవిధానాలలో ‘సిద్ధ’ ఒకటి. ఇది ప్రభుత్వ ఆయుష్ వైద్య శాఖలో ఒక భాగం. దాదాపు 4,000 సంవత్సరాల పురాతనమైనది. దీనికి ప్రాచుర్యం కల్పించిన వారిని ‘సిద్ధార్దులు’ లేక శైవ భక్తులైన ఋషులు అంటారు. వీరు 18 మంది. వీరిలో అగస్త్యుడు ముఖ్యమైనవాడు. ఆయన రాసిన వైద్య గ్రంథాలు ప్రామాణికం. అందుకే అగస్త్య మహర్షిని సిద్ధ వైద్య పితామహుడిగా పరిగ ణిస్తున్నారు. ఈ సిద్ధ విజ్ఞానాన్ని మెుట్టమెుదట శివుడు, పార్వతిదేవికి ఉపదేశించాడనీ, ఆమె దీనిని నందిదేవునికి అందించిందనీ, నందికేశుడు దీనిని సిద్ధులకు అందజేశాడనీ తమిళ గ్రంథాలు చెబుతాయి. ‘అగస్తియార్’ రాసిన గ్రంథాలు సిద్ధవైద్యంలో అనేక చికిత్స పద్ధతులైన వరమమ్ (ప్రెజర్ చికిత్స), తక్కానమ్ (మసాజ్ చికిత్స), నాటి (నాడీ పరీక్ష), శస్త్ర చికిత్స, రస వైద్యం, ఆవిరి చికిత్స, యోగ, ముద్ర, ప్రాణాయామం వంటి 99 రకాల పద్ధతులు ఉన్నట్లు తెలియ చేస్తున్నాయి. నేటికీ ఇవి సిద్ధ వైద్యులకు మార్గదర్శకం అవుతున్నాయి. ప్రాచీన గ్రంథం ‘తొలకప్పియం’ అనేక సిద్ధ వైద్య విషయాలను అందిస్తుంది. క్రీ.పూ 2వ శతాబ్దపు ‘తిరుక్కురై’ సిద్ధ విలువల గురించి చెబుతుంది. ‘మణిమేఖలై’ త్రిదోషాల గురించి చెబుతుంది. 13వ శతాబ్దంలో రాణి ‘కుందవై నాచియార్’ తన తండ్రి ‘కుంత్రకోజన్’ పేరు మీద ఉచిత వైద్యశాల నిర్వహించిందని తెలుస్తోంది. ఈ విధానంలోని సూత్రాలు, సిద్ధాంతాలు ఆయుర్వేదంతో సారూప్యతను కలిగి ఉంటాయి. క్రీ.పూ. 2వ శతాబ్దంలోనే వాలి (వాత), అజల్ (పిత్త), అయమ్ (కఫ) దోషాలుగా ఉంటాయనీ, వీటిని బట్టే ఔషధాలు నిర్ణయిస్తారనీ రాశారు. సిద్ధ వైద్య విధానంలో రస ఔషధాలు ప్రాముఖ్యత వహిస్తాయి. మెుక్కల వేర్లు, బెరడులు, ఆకులు, రత్నాలు, పశు ఉత్పత్తులతో ఔషధాల తయారీ ఉంటుందని ‘ఆయుష్’ ప్రచురించిన ‘హాలిస్టిక్ హెల్త్’ పుస్తకం ద్వారా తెలుస్తుంది. ఈ విధానం శ్రీలంక, సింగపూర్, మలేషియా, చైనా, తైవాన్ వంటి అనేక దేశాలలోనూ ఆదరణ కలిగివుంది. కరోనా సమయంలో కబాసురనీర్ ఔషధం తమిళనాడులో అనేక కేసులను తగ్గించడం వలన ప్రత్యేక ప్రజాదరణ పొందింది. – డాక్టర్ బాలాజీ దీక్షితులు పి.వి. (జనవరి 9 అగస్త్య మహర్షి జయంతి, జాతీయ సిద్ధ దినోత్సవం) -
ఆ నాణేలను పురాణాలు అనేవారు!
గ్రంథపు చెక్క ఇతర దేశాల మాదిరిగానే ప్రాచీన భారతదేశంలో కూడా తొలి మారక ద్రవ్యంగా పశుధనం ఉండేది. కొంతకాలం పోయిన తరువాత లోహపు కడ్డీలు ఉండేవి. ప్రాచీన రచనల ప్రకారం, ఇరాన్‌కు చెందిన అహ్మనీద్ వంశ చక్రవర్తులు సింధునది లోయలో కొంత ప్రాంతాన్ని తమ సామ్రాజ్యంలో భాగం చేసుకున్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలు చక్రవర్తికి కప్పం కింద నిర్దిష్ట పరిణామంలో బంగారు రజను చెల్లించుకునేవారు. ఆ విధంగా బంగారు రజను డబ్బు పాత్ర పోషించేది. బహుశా ఆరోజుల్లో అక్కడ బంగారం చాలా ఎక్కువగా ఉండేదనుకుంటా! ఆ కాలంలో భారతదేశంలో స్వంత వెండి అస్సలుండేది కాదు. ఇతర దేశాల నుంచి వెండిని భారతదేశానికి తీసుకువచ్చేవారు. అందుకే బంగారంతో పోల్చి చూస్తే వెండి ధర ఇతరదేశాల్లో కంటే భారతదేశంలో ఎక్కువగా ఉండేది. ప్రాచీన భారతదేశంలో బాగా వాడకంలో ఉన్న నాణాలను సంస్కృత భాషలో ‘పురాణాలు’ అనేవారు. ఇవి బెంగాల్ నుంచి కాబూలు దాకా బాగా విస్తృతంగా వ్యాపించి ఉండేవి. ఇవి గుండ్రంగానో, నలు చదరంగానో ఉన్న చిన్న వెండి కడ్డీలు. అరుదుగా రాగి కడ్డీలు ఉండేవి. ఒక నాణెం మీద ఎన్నో చిత్రాలను ముద్రించేవారు. కడ్డీ ఒకవైపు ఏ చిత్రం లేకుండా నున్నగా ఉండేది. రెండో వైపున మానవ ఆకారాలు, చెట్లు, పక్షులు, ఆయుధాలు, మత సంబంధమైన చిహ్నాలు, సూర్యచంద్రుల చిహ్నాలు... ఇలా ఎన్నో ఉండేవి. ఈ నాణాలు... అంటే పురాణాలు ఎప్పుడు అవతరించాయో చెప్పడం కష్టం. ప్రాచీన కాలంలో ఉత్తర భారతదేశం బలీయమైన విదేశీ ప్రభావానికి గురయ్యింది. ఇది నాణాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. - గె.అ. ఫ్యోదొరవ్, దవీదొవ్ రష్యన్ రచనకు డా.నిడమర్తి మల్లికార్జునరావు చేసిస తెలుగు అనువాదం ‘నాణాలు చెప్పిన కథ’ పుస్తకం నుంచి.