National Siddha Day: ద్రవిడుల ప్రాచీన శాస్త్రీయ వైద్యం

National Siddha Day 2023: History, Importance, Theme - Sakshi

భారతీయ వైద్యవిధానాలలో ‘సిద్ధ’ ఒకటి. ఇది ప్రభుత్వ ఆయుష్‌ వైద్య శాఖలో ఒక భాగం. దాదాపు 4,000 సంవత్సరాల పురాతనమైనది. దీనికి ప్రాచుర్యం కల్పించిన వారిని ‘సిద్ధార్దులు’ లేక శైవ భక్తులైన ఋషులు అంటారు. వీరు 18 మంది. వీరిలో అగస్త్యుడు ముఖ్యమైనవాడు. ఆయన రాసిన వైద్య గ్రంథాలు ప్రామాణికం. అందుకే అగస్త్య మహర్షిని సిద్ధ వైద్య పితామహుడిగా పరిగ ణిస్తున్నారు.

ఈ సిద్ధ విజ్ఞానాన్ని మెుట్టమెుదట శివుడు, పార్వతిదేవికి ఉపదేశించాడనీ, ఆమె దీనిని నందిదేవునికి అందించిందనీ, నందికేశుడు దీనిని సిద్ధులకు అందజేశాడనీ తమిళ గ్రంథాలు చెబుతాయి. ‘అగస్తియార్‌’ రాసిన గ్రంథాలు సిద్ధవైద్యంలో అనేక చికిత్స పద్ధతులైన వరమమ్‌ (ప్రెజర్‌ చికిత్స), తక్కానమ్‌ (మసాజ్‌ చికిత్స), నాటి (నాడీ పరీక్ష), శస్త్ర చికిత్స, రస వైద్యం, ఆవిరి చికిత్స, యోగ, ముద్ర, ప్రాణాయామం వంటి 99 రకాల పద్ధతులు ఉన్నట్లు తెలియ చేస్తున్నాయి. నేటికీ ఇవి సిద్ధ వైద్యులకు మార్గదర్శకం అవుతున్నాయి.

ప్రాచీన గ్రంథం ‘తొలకప్పియం’ అనేక సిద్ధ వైద్య విషయాలను అందిస్తుంది. క్రీ.పూ 2వ శతాబ్దపు ‘తిరుక్కురై’ సిద్ధ విలువల గురించి చెబుతుంది. ‘మణిమేఖలై’ త్రిదోషాల గురించి చెబుతుంది. 13వ శతాబ్దంలో రాణి ‘కుందవై నాచియార్‌’ తన తండ్రి ‘కుంత్రకోజన్‌’ పేరు మీద ఉచిత వైద్యశాల నిర్వహించిందని తెలుస్తోంది. ఈ విధానంలోని సూత్రాలు, సిద్ధాంతాలు ఆయుర్వేదంతో సారూప్యతను కలిగి ఉంటాయి. క్రీ.పూ. 2వ శతాబ్దంలోనే వాలి (వాత), అజల్‌ (పిత్త), అయమ్‌ (కఫ) దోషాలుగా ఉంటాయనీ, వీటిని బట్టే ఔషధాలు  నిర్ణయిస్తారనీ రాశారు.

సిద్ధ వైద్య విధానంలో రస ఔషధాలు ప్రాముఖ్యత వహిస్తాయి. మెుక్కల వేర్లు, బెరడులు, ఆకులు, రత్నాలు, పశు ఉత్పత్తులతో ఔషధాల తయారీ ఉంటుందని ‘ఆయుష్‌’ ప్రచురించిన ‘హాలిస్టిక్‌ హెల్త్‌’ పుస్తకం ద్వారా తెలుస్తుంది. ఈ విధానం శ్రీలంక, సింగపూర్, మలేషియా, చైనా, తైవాన్‌ వంటి అనేక దేశాలలోనూ ఆదరణ కలిగివుంది. కరోనా సమయంలో కబాసురనీర్‌ ఔషధం తమిళనాడులో అనేక కేసులను తగ్గించడం వలన ప్రత్యేక ప్రజాదరణ పొందింది.

– డాక్టర్‌ బాలాజీ దీక్షితులు పి.వి. 
(జనవరి 9 అగస్త్య మహర్షి జయంతి, జాతీయ సిద్ధ దినోత్సవం)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top