
నిర్దిష్ట నాణ్యత ప్రమాణాలు ఉండాల్సిందే
ఆరోగ్య సేవల్లో మరింత పారదర్శకత కోరుతున్న ప్రజలు
ఫిక్కీ, ఈవై–పార్థనాన్ తాజా నివేదిక వెల్లడి
ఆరోగ్య సమస్య తలెత్తితే ఎక్కడ వైద్యం చేయించుకోవాలి అన్నది దాదాపు ప్రతి ఇంటా ఓ సవాలే. సమస్యకు సత్వర పరిష్కారంతో పాటు ఖర్చులు భారం కాకుండా నమ్మకమైన చికిత్స కోసం ఏ హాస్పిటల్‌ని, ఏ వైద్యుడిని సంప్రదించాలో సన్నిహితులు, స్నేహితుల సలహా తీసుకోవడమూ సహజమే. అయితే మన దేశంలో అత్యధికులు ఆరోగ్య సంరక్షణలో మరింత పారదర్శకతను కోరుకుంటున్నారు. ఈ మేరకు ఆరోగ్య సేవలు నిర్దిష్ట నాణ్యత ప్రమాణాలకు (సర్టిఫైడ్) అనుగుణంగా లభిస్తే ప్రీమియం చెల్లించడానికి సైతం సిద్ధంగా ఉన్నారని ఓ నివేదిక చెబుతోంది.
అధిక నాణ్యతకే ప్రాధాన్యం
ఫిక్కీ, ఈవై–పార్థనాన్ తాజా నివేదిక ప్రకారం.. మన దేశంలో వైద్యానికి సంబంధించిన సరైన సమాచారం మూడింట ఒక వంతు మందికి మాత్రమే సులభంగా లభిస్తోంది. బ్రాండ్ లేదా వైద్యుడికి ఉన్న పేరు ప్రఖ్యాతులపై 60%, నోటి మాటపై 79% మంది ఆధారపడుతున్నారు. 83% మంది రోగులు.. చికిత్స కోసం వెళ్లాల్సిన ఆసుపత్రి, ఎంచుకోవాల్సిన వైద్యుల ఎంపిక విషయంలో మార్గనిర్దేశం చేయడానికి నిష్పాక్షికమైన, అందుబాటులో ఉన్న సమాచారాన్ని కోరుకుంటున్నారు. ఇటువంటి సమాచారం కోరిన వారిలో దాదాపు 90% మంది సర్టిఫైడ్, అధిక–నాణ్యత గల ఆసుపత్రిలో వైద్యం కోసం ఎక్కువ చెల్లించేందుకు సిద్ధమని చెప్పారు.
మహమ్మారి తర్వాత మారిపోయింది..
వైద్య సేవలు ఎక్కడ మెరుగ్గా ఉంటాయో తెలుసుకోవడానికి భారతీయులు.. బంధువులు, సన్నిహితులపై ఆధారపడుతున్నారు. దశాబ్దాలుగా దాదాపు ప్రతి ఇంటా ఈ తంతు సహజంగా జరుగుతోంది. అయితే కోవిడ్–19 మహమ్మారి తర్వాత పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయని నివేదిక చెబుతోంది. ‘నిజంగా మంచి నాణ్యతతో వైద్యం లభిస్తుందా? ఏ ప్రాతిపదికన చెబుతున్నారు. నేను ఎలా గుర్తించాలి?’ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని నివేదిక పేర్కొంది. సేవల్లో పారదర్శకత కోసమే ఈ డిమాండ్ వస్తోందని తెలిపింది.
వార్షిక వినియోగాన్ని మించి వ్యయం!
అందుబాటు ధరలో వైద్యం అన్నది ఒక ప్రధాన అడ్డంకిగా మిగిలిపోయిందని నివేదిక తెలిపింది. ప్రై వేట్ ఆసుపత్రిలో చేరితే సగటు ఖర్చు రూ.58 వేలు అవుతోంది. ఇది దాదాపు సగం భారతీయ కుటుంబాలు, 70 శాతం గ్రామీణ కుటుంబాల వార్షిక వినియోగ వ్యయాన్ని మించి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రోగులు తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని ఆందోళన చెందుతుండడంతో ఇది సున్నితమైన అంశంగా పరిణమించింది. కాగా, 10% కంటే తక్కువ ప్రైవేట్ ఆసుపత్రులు, 2%లోపు డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లు ఎన్‌ఏబీఎల్ గుర్తింపును కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది.
పటిష్ట కార్యాచరణ అమలు చేయాలి
వైద్య సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సమన్వయంతో కూడిన బహుముఖ ప్రయత్నం అవసరమని నివేదిక వెల్లడించింది. మెరుగైన వైద్య సేవలు, వ్యయాలను దృష్టిలో పెట్టుకోవడం, వినియోగదారుల సాధికారతను నొక్కి చెబుతూ పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని సూచించింది. మెడికల్ రీయింబర్స్‌మెంట్, కనెక్టెడ్ ఎకోసిస్టమ్ అమలు చేయాలని స్పష్టం చేసింది. సర్వేలో పాలుపంచుకున్న 90% మంది వైద్యులు నాణ్యత ప్రమాణాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.
ఎవరెవరు పాల్గొన్నారంటే..
సర్వేలో భారత్‌కు చెందిన 40 నగరాల్లోని 250 ఆసుప త్రులు పాలుపంచుకు న్నాయి. వీటి మొత్తం పడకల సామర్థ్యం 75 వేల పైచిలుకు ఉంది. 1,000 మందికిపైగా రోగులు, 100 మందికిపైగా వైద్యులు, 70 మందికి పైగా సీఈవోలు, సీనియర్ వైద్యులు, నిర్వాహకులు, పెట్టుబడిదారుల నుంచి సమాచారం సేకరించి వాటి ఆధారంగా నివేదిక రూపొందించారు.