
బాలుని మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు
ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం
తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన చిన్నారి
సకాలంలో వైద్యం అందించడంలో వైద్యుల నిర్లక్ష్యం
ఆర్థికమంత్రి పయ్యావుల నియోజకవర్గంలో ఘోరం
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. సకాలంలో వైద్యం అందక శుక్రవారం ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. వజ్రకరూరు మండలం చాబాల గ్రామానికి చెందిన నిరుపేద కూలీ హరిజన కేటీ రాజేష్, సరిత దంపతుల ఐదేళ్ల కుమారుడు అహరోన్‌కుమార్ నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతుండడంతో ఉరవకొండ లోని గుంతకల్లు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
జ్వరం తగ్గకపోవడంతో వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యుడు సూచించారు. దీంతో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నైట్ డ్యూటీ డాక్టర్ ఇస్మాయిల్‌తోపాటు ఏఎన్‌ఎంలు ప్రియాంక, అంజన ఉన్నారు. డాక్టర్ ఆస్పత్రి పై భవనంలో విశ్రాంతి తీసుకుంటుండగా, నర్సు ప్రియాంక తానే తెలిసిన వైద్యం చేసి ఇంజక్షన్ తోపాటు సెలైన్ పెట్టారు.
డాక్టర్‌ను పిలిచి ఒకసారి బాబు పరిస్థితి చూడాలని కుటుంబ సభ్యులు చెప్పినా ఏఎన్‌ఎం పట్టించుకోలేదు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బాబు పరిస్థితి విషమించడంతో డాక్టర్ ఇస్మాయిల్ హుటాహుటిన వచ్చి పరీక్షించారు. అప్పటికే బాబు మృతి చెందాడు. పుట్టిన రోజు జరిగిన నాలుగు రోజులకే బాబు మృతిచెందడం బాధాకరం.
ఆందోళనతో దిగివచ్చిన అధికారులు
దీంతో ఆస్పత్రి ఎదుట బాబు తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యులను నిలదీశారు. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి ఉరవకొండ అర్బన్ సీఐ మహనంది, సిబ్బంది చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. డీసీహెచ్‌ఎస్ డేవిడ్ సెల్వరాజ్ కూడా ఆస్పత్రికి వచ్చి శాఖా పరమైన విచారణ చేపట్టారు. దీనిపై సమగ్ర నివేదికను వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌తో పాటు కలెక్టర్‌కు సమరి్పస్తామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు.
వ్యాక్సిన్ వికటించి పసికందు మృతి
డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా): మండలంలోని రంగిలిసింగి పంచాయతీ కుజభంగిలో వ్యాక్సిన్ వికటించి పసికందు మృతి చెందినట్లు కుటుంబీకులు ఆరోపించారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. కుజభంగికి చెందిన ప్రవీణ్ కుమార్ భార్య అగతంబిడి లావణ్యకు రెండు నెలల క్రితం బిడ్డ జన్మించింది. ఈ నెల 24న గ్రామంలో వైద్య సిబ్బంది పసికందుకు వ్యాక్సిన్ వేశారు. అప్పటి నుంచి బిడ్డకు జ్వరం వస్తూనే ఉంది.
శుక్రవారం తెల్లవారు జామున ఊపిరాడకపోవడంతో బిడ్డ మరణించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దీనిపై స్థానిక వైద్యాధికారి పి.రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. పసరు మందు పట్టించడం వల్లే పసికందు మృతి చెందిందన్నారు. వ్యాక్సినేషన్ సమయంలో బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ వేస్తే సాధారణ జ్వరం ఉంటుందని, పుట్టుకతోనే పసికందుకు మూర్ఛ లక్షణాలు ఉన్నాయన్నారు. మూర్ఛ ఉన్నట్టు తెలియక బాధిత కుటుంబీకులు పసరు మందును పట్టించడంతో పరిస్థితి విషమించి పసికందు మృతి చెందినట్లు నిర్ధారణ అయిందన్నారు.
డెంగీతో బాలుడి మృతి
గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్లలో రెండేళ్ల బాలుడు డెంగీతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన చిన్న రంగన్న కుమారుడు నరహరి(2)కి పది రోజుల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు గ్రామంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఫలితం లేకపోవడంతో రక్తపరీక్ష చేయించారు.
డెంగీగా నిర్ధారణ కావడంతో ఎమ్మిగనూరులోని చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చికిత్సకు ఎక్కువ డబ్బు ఖర్చవుతుందని చెప్పారు. ఆరి్థక స్థోమత లేని తల్లిదండ్రులు.. నరహరిని సోమవారం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నరహరి శుక్రవారం మరణించాడు.