సాక్షి, అనకాపల్లి: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాద ఘటనలో ఒకరు మరణించారని.. మిగతా ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని అధికారులు ధృవీకరించారు. అలాగే మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో సహాయక చర్యలు పూర్తైనట్లు ప్రకటించారు. టెక్నికల్ క్లియరెన్స్ అనంతరం.. ప్రమాదానికి గురైన రెండు బోగీలతో పాటు మరొక బోగీని(ఎం2 కూడా) మినహాయించడంతో సోమవారం ఉదయం రైలు ఎర్నాకుళం బయల్దేరింది.
టాటానగర్(జార్ఖండ్) నుంచి ఎర్నాకుళం(కేరళ) వెళ్తున్న ఎక్స్‌ప్రెస్(18189) రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్‌లో రైలును నిలుపుదల చేశారు. ప్రయాణికులంతా బయటకు దిగి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈలోపు లోకో పైలట్ కాలిపోతున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. సమాచారం అందుకున్న అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లికి చెందిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మంటల్లో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా.. మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. తొలుత బీ1 కోచ్‌లోనే మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. అర్ధరాత్రి 3.30గంటలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన రెండు బోగీలను తొలగించి, ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించడానికి ప్రయత్నాలు చేయబోయారు. కానీ..

దుప్పట్ల వల్లే..
ప్రమాద స్థలానికి చేరుకున్న దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్‌ఎం మోహిత్ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘‘ప్రమాదం జరిగిన ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.30గం. ప్రాంతంలో ప్రమాదం జరిగింది. బీ1 కోచ్‌లో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నాం. ఆ బోగీలో దుప్పట్లు ఉండడం వల్ల మంటలు శరవేగంగా వ్యాపించాయి. రెండు బోగీలు(బీ1, ఎం2) పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో బీ1లో 76 మంది, ఎం2లో 82 మంది ఉన్నారు. ప్రమాదంలో ఒకరు మరణించారు. బీ1 బోగీలో మృతదేహాన్ని గుర్తించాం. ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రేకులు పట్టేయడం వల్లే మంటలు చెలరేగాయని లోకో పైలట్లు చెబుతున్నారు. కానీ, అధికారిక దృవీకరణ జరగాల్సి ఉంది. ఘటనపై విచారణ జరుగుతోంది’’ అని అన్నారు.

ఇదిలా ఉంటే.. మృతుడ్ని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్(70)గా అధికారులు నిర్ధారించారు. ఈ ఘటన తర్వాత.. చలిలో సుమారు 2వేల మంది ప్రయాణికులు స్టేషన్‌లో పడిగాపులు పడ్డారు. అనకాపల్లి, తుని, విశాఖ స్టేషన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పూరి-తిరుపతి, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, జన్మభూమి ఎక్స్‌ప్రెస్, బెంగళూర్ హంసఫర్ రైళ్లు వీటిల్లో ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.
ఎఫ్‌ఎస్‌ఎల్ ఆధారాలే కీలకం
ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఉదయం ఘటన స్థలానికి రైల్వే సేఫ్టీ కమిటీ చేరుకుంది. ప్రమాద తీవత్రను సీనియర్ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రెండు ఫోరెన్సిక్ బృందాలు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారని ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. దర్యాప్తులో ఎఫ్‌ఎస్‌ఎల్ ఆధారాలే కీలకమని పోలీసులు చెబుతున్నారాయన. ‘‘ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు జరిపి సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకున్నాం. ప్రత్యేక బస్సుల్లో రైల్వే స్టేషన్‌కు తరలించాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఎర్నాకులం చేరేలా చూస్తాం’’ అని తెలిపారు.


