ఐదేళ్లలో సర్వీసుల రెట్టింపునకు ప్రణాళిక
2030 నాటికి ప్రధాన నగరాల్లో సామర్థ్యం పెంపు
దేశ వ్యాప్తంగా 48 నగరాల ఎంపిక
జాబితాలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్
సాక్షి, విశాఖపట్నం: రైలు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల నుంచి బయలుదేరే రైళ్ల రాకపోకల్ని రెట్టింపు చెయ్యాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం తొలివిడతగా.. 48 నగరాల్ని ఎంపిక చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ చోటు దక్కించుకున్నాయి. ఎంపిక చేసిన నగరాల్లోని రైల్వే స్టేషన్ల సామర్థ్యాన్ని 2030 నాటికి గణనీయంగా పెంచేందుకు సిద్ధమవుతోంది.
ఇందుకోసం వీలైనంత త్వరగా.. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ ఆయా జోన్ల అధికారులకు బోర్డు చైర్మన్, సీఈవో సతీష్ కుమార్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రోజూ దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, మెయిల్, సబర్బన్ (లోకల్), ప్యాసింజర్ రైళ్లు అన్నీ కలిపి 13,500 వరకు నడుస్తున్నాయి. 2024–25 ఆరి్థక సంవత్సరంలో సుమారు 715 కోట్ల మంది రైళ్లలో రాకపోకలు సాగించారు.
ఆ సంఖ్యను 1,000 కోట్లకు పెంచేలా సర్వీసులను రెట్టింపు చేయాలన్నది ప్రణాళిక. 2030 నాటికి దేశంలో ‘వెయిటింగ్ లిస్ట్’ అనే మాటే దాదాపు వినపడకూడదనే లక్ష్యంగా సైతం రైల్వే శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.
ఏం చేయనున్నారంటే..!
» ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లను రీ–డెవలప్‌మెంట్‌లో భాగంగా.. రైళ్ల సంఖ్యని క్రమంగా పెంచుతారు.ఉదాహరణకు ప్రస్తుతం ప్రతిరోజూ విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లు 180 నుంచి 200 వరకూ ఉండగా.. ఇందులో వైజాగ్ స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్లు 55 వరకూ ఉన్నాయి. 2030 నాటికి ఈ సంఖ్య 100 నుంచి 110 వరకూ పెంచే అవకాశాలున్నాయి.
» ఇప్పటికే ఉన్న టెర్మినల్స్‌లో అదనపు ప్లాట్‌ఫామ్‌లు, పిట్ లైన్లు, స్టాబ్లింగ్ లైన్లను ఏర్పాటు చేస్తారు.
» నగరాల శివార్లలో ఉన్న రైల్వే స్టేషన్లను శాటిలైట్ టెర్మినల్స్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఇలా చేస్తే ప్రధాన స్టేషన్లలో రద్దీ తగ్గే అవకాశాలుంటాయి.
»కేవలం కొత్త ప్లాట్‌ఫామ్‌లు కట్టడమే కాకుండా, రైళ్లు వేగంగా, సురక్షితంగా నడవడానికి ‘సెక్షనల్ కెపాసిటీ’ పెంచాలని బోర్డు సూచించింది. ఇందులో భాగంగా సిగ్నలింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడం, మల్టీ–ట్రాకింగ్ (అదనపు లైన్లు వేయడం) వంటి పనులు చేపడతారు.
» దీంతో పాటు శివార్లలో కొత్త టెర్మినల్స్, మెగా కోచింగ్ కాంప్లెక్స్ అభివృద్ధి చేస్తారు. రైళ్ల సంఖ్య పెరగాలంటే వాటి నిర్వహణ ముఖ్యం. అందుకే నగరాల చుట్టూ ఈ మెగా కోచింగ్ కాంప్లెక్స్‌లు, పిట్ లైన్లను ఏర్పాటు చేస్తారు.


