ప్రేమికుడి ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన చేస్తున్న కావేరి బంధువులు. ఇన్‌సెట్‌లో శ్రీకాంత్, కావేరి (ఫైల్)
తమ కూతురు మృతికి ప్రేమికుడే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆగ్రహం
సంగారెడ్డి జిల్లాలో ఘటన
నారాయణఖేడ్: తమ కూతురు మృతికి ప్రేమికుడే కారణమంటూ యువతి శవంతో ప్రేమికుడి ఇంటి ముందు ఆమె కుటుంబీకులు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం మునిగేపల్లి మాణిక్ నాయక్ తండాలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కంగ్టి సీఐ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. సిర్గాపూర్ మండలం కడ్పల్ విఠల్ నాయక్ తండాకు చెందిన వడిత్య కావేరి (23), నిజాంపేట మండలం మాణిక్ నాయక్ తండాకు చెందిన సభావత్ శ్రీకాంత్ (24)లు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి పెద్దలను ఆశ్రయించడంతో వారు నిరాకరించారు. దీంతో ప్రేమికులు హైదరాబాద్‌కు వెళ్లి జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం హైదరాబా ద్ శివార్లలోని బాలాపూర్ ప్రాంతంలో కావేరి తాము నివాసం ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా మృతురాలి కుటుంబ సభ్యులు శనివారం అర్ధరాత్రి తమ కూతురు మృతికి ప్రేమికుడు శ్రీకాంతే కారణమంటూ మాణిక్ తండాలోని అతని ఇంటి ముందు కావేరి మృతదేహంతో ఆందోళనకు దిగారు.
ఆదివారం ఉదయం వరకు వారు అక్కడే బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సమాచారం తెలుసుకుని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, కల్హేర్ ఎస్‌ఐ రవిగౌడ్‌ల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం రెండు తండాలకు చెందిన పెద్దలు, ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చడంతో కావేరి అంత్యక్రియలను శ్రీకాంత్ కుటుంబ సభ్యులు నిర్వహించేందుకు మృతురాలి కుటుంబ సభ్యులు అంగీకరించారు.


