ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరిన గుడ్డు ధర
హోల్‌సేల్‌లో రూ.7.. రిటైల్‌లో రూ.8 నుంచి రూ.8.50 వరకు విక్రయాలు
ఈ ప్రభావంతో పెరిగిన గుడ్డు వంటకాల ధరలు
సాధారణ టిఫిన్ దుకాణంలో ఎగ్ దోశపై రూ.5 పెంపు
చికెన్ ధర కూడా పైపైనే...
విజయవాడ సత్యనారాయణపురంలో రోజూ మాదిరిగా రమేష్ తన స్నేహితులతో అల్పాహారం కోసం ఓ టిఫిన్ దుకాణానికి వెళ్లాడు. మూడు డబుల్ ఎగ్ దోశలు ఆర్డర్ చేసి తిన్నారు. ఎప్పటిలాగే దోశ రూ.40 చొప్పున మూడు దోశలకు రూ.120 ఫోన్ పే చేశాడు. ఆ సౌండ్ విన్న యజమాని మరో రూ.30 చేయండి బాబూ.. గుడ్లు ధర బాగా పెరిగిందని చెప్పాడు. దీంతో రమేష్ అదనంగా డబ్బులు చెల్లించి ఏంటి గుడ్డు రూ.8 అయిపోయిందా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
విశాఖ నగరంలోని ఎండాడలో సత్యవతి అనే మహిళ ఇంటికి సమీపంలోని కిరాణాదుకాణానికి వెళ్లి అరడజను గుడ్లు అడిగింది. దుకాణదారుడు గుడ్డు రూ.8.50 అని చెప్పడంతో ఆమె అవాక్కయింది. ఎప్పుడూ ఇంత రేటు చూడలేదని నాలుగు గుడ్లుతో సరిపెట్టుకుంది. దుకాణదారుడు అమ్మా కొద్ది రోజుల్లో గుడ్డు ధర రూ.10 కి చేరవచ్చని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారని అనడంతో ఆమె ఆశ్చర్యపోయింది.
ఇలా వీరే కాదు రాష్ట్రంలోని ఏ ఎగ్, చికెన్ మార్కెట్‌కి వెళ్లినా ప్రస్తుతం పెరిగిన గుడ్లధర గురించే చర్చ నడుస్తోంది. చికెన్ ధరలు కూడా అందనంత దూరంలో ఉన్నాయని ప్రజలు అసంతప్తిని వ్యక్తం చేస్తున్నారు. – ఏపీ సెంట్రల్ డెస్క్
నాన్ వెజ్ ప్రియులు జిహ్వచాపల్యాన్ని తీర్చుకోలేకపోతున్నారు.పెరిగిన గుడ్లు, చికెన్ ధరలతో అటు వైపు చూడడానికి సాహసించడంలేదు. ఒకవైపు పెరిగిన కూరగాయల ధరలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే మరోవైపు గుడ్డు ధర ఆల్‌టైం రికార్డుస్థాయికి చేరింది. హోల్‌సేల్‌లోనే రూ.7 పలుకుతోంది. ఇక కిరాణాషాపులు, చిన్న చిన్న దుకాణాల్లో రూ.8 నుంచి రూ.8.50 వరకూ విక్రయిస్తున్నారు.
ఈ ప్రభావంతో గుడ్డు, చికెన్‌తో తయారయ్యే ఆహారపదార్థాల ధరలు పెంచేశారు. దీంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ధరలు పెరగడంతో ఏం తినాలి.. ఎలా బతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్డుధర ఇంత ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు సైతం చెప్పడం విశేషం.
తక్కువ ట్రేలే తెస్తున్నాం
గుడ్లు ధర భారీగా పెరగడంతో చిరువ్యాపారులు సైతం స్టాక్ తగ్గించుకుంటున్నారు. గతంలో హోల్‌సేల్ దుకాణం నుంచి 10 ట్రేల గుడ్లు తెచ్చే వారు ప్రస్తుతం పెరిగిన ధరలకు భయపడి స్టాక్ తగ్గించేస్తున్నామని చెబుతున్నారు. ఒక్క సారిగా ధర తగ్గిపోతే నష్టపోవాల్సి వస్తుందనే భయంతో తక్కువగా తెస్తున్నామని.. హోల్‌సేల్ వ్యాపారులు మాత్రం ఇప్పట్లో ధర తగ్గదు... పెరుగుతుందని చెబుతున్నా... వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రిస్క్ చేయలేక పోతున్నామంటున్నారు.
ఎగ్ వంటకాల ధరలకు రెక్కలు
15 రోజుల్లోనే గుడ్డు ధర రూ.6 నుంచి రూ.8కి చేరడంతో వంటకాల ధరలు కూడా వ్యాపారులు పెంచేశారు.సాధారణ టిఫిన్‌షాపులోనే సింగిల్ ఎగ్ దోశపై రూ.5, డబుల్ ఎగ్ దోశపై రూ.10 వరకూ పెంచేశారు. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్‌లలో మరింత పెంచారు.
ఎగుమతులు పెరగడమే కారణమా!
రాష్ట్రంలో భారీగా కోడి గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే ఇందులో 60 శాతం వరకూ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. ఈ ప్రభావం ధరల పెరుగుదలకు కారణమని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్లు 5 కోట్లు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు 4.70 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 60 శాతం వరకూ పశ్చిమ బెంగాల్, ఒడిశా, అసోం,ఢిల్లీ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. సాధారణంగా ఈ రాష్ట్రాల్లో చేపలు ఎక్కువగా వినియోగిస్తారు. నవంబర్ నుంచి జనవరి వరకూ ఆ రాష్ట్రాల్లో చేపల ఉత్పత్తి తగ్గడంతో గుడ్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.
దిగిరాని చికెన్
చికెన్‌ధరలు దిగిరావడం లేదు. కార్తీకంలో కూడా కిలో రూ.200కు పైగానే కొనసాగింది. అలా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో స్కిన్ లెస్ చికెన్ కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో రూ.260 పలుకుతోంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, గుంటూరు, విజయవాడ జిల్లాల్లో కిలో రూ.280 నుంచి రూ.300 పలకడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కోడి కూర వైపు చూడడానికి సాహసించడం లేదు.
చికెన్, గుడ్లు తినలేకపోతున్నాం
నేను జూపాడుబంగ్లా గ్రీన్‌అంబాసిడర్‌గా పనిచేస్తున్నా. నాకు నెలకు రూ.6 వేల వేతనం ఇస్తారు. పెరిగిన నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలతో సతమతం అవుతున్నాను. కనీసం నెలకోమారైనా చికెన్, గుడ్లు తిందామనుకొంటే చికెన్ కిలో రూ.260, గుడ్లు డజన్(12) రూ.100 చెబుతున్నారు. నాకొచ్చే అరకొర వేతనంతో చికెన్, గుడ్లు కొనుక్కొని తినలేని పరిస్థితి నెలకొంది. – రమణమ్మ, జూపాడుబంగ్లా, నంద్యాల జిల్లా
గుడ్డు రేటు ఇంతా!
సీజన్‌తో సంబంధం లేకుండా ఈ ఏడాది గుడ్లు, చికెన్ ధర పెరుగుతోంది. గుడ్డు ధర రూ.8.50 అంటే సామాన్యులు ఎలా కొనుక్కొని తినగలరు. చికెన్‌ధర కూడా అందనంత దూరంలో ఉంది. – ఎం.మణి, మంగమారిపేట, విశాఖపట్నం
ఇంత రేటు ఎప్పుడూ చూడలేదు
నాకు తెలిసి గుడ్డు ఎప్పుడూ ఇంత రేటు చూడలేదు. గుడ్డు రూ.8.50 పెట్టి కొనాలంటే కష్టం. ధర ఒక్కసారిగా పెరగడంతో ఎగ్ దోశ రేటు పెంచారు. సింగిల్ ఎగ్ దోశపై రూ.5. డబుల్ ఎగ్ అయితే రూ.10 పెరిగింది.–గౌరినాయుడు,సత్యనారాయణపురం, విజయవాడ
గుడ్లు కూడా కొనలేకపోతున్నాం
మధ్యతరగతి వాళ్లకు వారానికి ఒక్క రోజైనా చికెన్ తినాలని ఉంటుంది. అయితే ఇప్పుడు చికెన్ కాదు కదా.. కోడిగుడ్లను కూడా కొనే పరిస్థితి లేదు. కేజీ చికెన్ ధర రూ.280పైనే ఉంది. కోడిగుడ్లతో సరిపెడదామా అంటే డజన్ వంద రూపాయలు అంటున్నారు. చికెన్, కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్నాం.
- భాస్కర్, హిందూపురం, శ్రీసత్యసాయి జిల్లా


