బంగ్లా చెరలో ‘అల’వికాని వేదన | Nine fishermen from Vizianagaram district have been in a Bangladesh jail for 75 days | Sakshi
Sakshi News home page

బంగ్లా చెరలో ‘అల’వికాని వేదన

Dec 29 2025 4:43 AM | Updated on Dec 29 2025 4:43 AM

Nine fishermen from Vizianagaram district have been in a Bangladesh jail for 75 days

75 రోజులుగా జైలులో మగ్గిపోతున్న 9 మంది విజయనగరం జిల్లా మత్స్యకారులు  

తమ వారు ఎప్పుడొస్తారోనని కుటుంబీకుల ఆందోళన  

విడిపించేందుకు చొరవ చూపని రాష్ట్ర ప్రభుత్వం.. గతంలో పాక్‌ చెర నుంచి 22 మందిని విడిపించిన అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌

బంగ్లాదేశ్‌ పరిణామాలు అక్కడి భారతీయులనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారుల కుటుంబాలనూ కల్లోలపరుస్తున్నాయి. పొరపాటున తీరం దాటి బంగ్లా దళాల చేతుల్లో చిక్కుకున్న విజయనగరానికి చెందిన 9 మంది మత్స్యకారులు 75 రోజులకుపైగా అక్కడి జైలులో మగ్గిపోతున్నారు. వారి కుటుంబాలు ఇక్కడ తల్లడిల్లిపోతున్నాయి. 

ఒకవైపు ఇల్లుగడవడం కష్టమైపోతోంది.. ప్రభుత్వమేమో లేఖలు, మాటలతోనే సరిపెడుతోంది తప్పితే విడిపించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. బంగ్లాలో పరిస్థితులు దిగజారిపోతుండటంతో తమవారు జైలులో ఎలా ఉన్నారో..  చెర వీడుతారా.. లేదా... అని ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. – ఏపీ సెంట్రల్‌ డెస్క్

సముద్రంలో వేటకు వెళ్లి దారి తప్పి బంగ్లాదేశ్‌ కోస్ట్‌గార్డుకు చిక్కిన 9 మంది మత్స్యకారులు 75 రోజులకుపైగా జైలులో మగ్గిపోతున్నారు. వారిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చొరవ చూపకపోవడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. 

అసలేం జరిగిందంటే.. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన మత్స్యకారులు నక్కా రమణ, వాసుపల్లి సీతయ్య, భోగాపురం మండలం కొండ్రాజుపాలెం గ్రామానికి చెందిన మరుపల్లి చిన్నప్పన్న, మరుపల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్, సురపతి రాము, చిన్నప్పన్న, మైలపల్లి అప్పన్న జీవనం కోసం వైజాగ్‌కు వలస వచ్చారు. 

అక్కడే చేపల వేట కొనసాగించే వారు. అక్టోబర్‌ 13న విశాఖ చేపల రేవు నుంచి (బోటు నంబరు : ఎంఎం 75) సముద్రంలోకి వేటకు వెళ్లారు. దురదృష్టవశాత్తు అక్టోబర్‌ 14న అర్ధరాత్రి 2 గంటల సమయంలో దారి తప్పి బంగ్లాదేశ్‌ కోస్ట్‌ గార్డ్‌ పరిధిలోకి ప్రవేశించడంతో అక్కడి నేవీ అధికారులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

కడుపులో బిడ్డ.. జైలులో భర్త
ప్రసవ సమయంలో భర్త తన పక్కనే ఉండాలని భార్య కోరుకుంటుంది. భర్త కూడా తన బిడ్డ ఈ లోకంలోకి రాగానే ఎత్తుకుని మురిసిపోవాలనుకుంటాడు. దురదృష్టవశాత్తూ సూరాడ అనిత, అప్పలకొండ దంపతులకు ఆ అవకాశం లేకుండా పోయింది. బంగ్లాదేశ్‌ జైలులో బందీగా ఉన్న సూరాడ అప్పల కొండ భార్య అనిత ప్రస్తుతం 9వ నెల గర్భిణి. వచ్చే నెలలో ప్రసవించే అవకాశం ఉందని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో తన భర్త ఆచూకీ కోసం అనిత ఆందోళన చెందుతోంది. పురిటి నొప్పులకు తోడు మనోవేదనతో ఆమె సతమతమవుతోంది. తన భర్త రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.

బాధితులను విడిపించేందుకు వైఎస్సార్‌సీపీ యత్నాలు  
బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన 9 మంది మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్సార్‌ సీపీ అండగా నిలిచింది. ఆర్థిక సహాయం అందించడంతోపాటు విడుదల కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. మత్స్యకారుల విడుదల కోసం వైఎస్సార్‌ సీపీ నాయకుడు, ఈస్ట్‌కోస్ట్‌ మెకనైజ్డ్‌ ఫిషింగ్‌ బోట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వాసుపల్లి జానకీరామ్‌ బంగ్లాదేశ్‌ వెళ్లారు. 

జైలులో ఉన్న మత్స్యకారులకు ఆహారం, నిత్యావసర సరుకుల కోసం కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేశారు. వారి విడుదలకు బంగ్లాదేశ్‌ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి కోసం ఢాఖాలోని సుప్రీంకోర్టు అడ్వకేట్‌ మహమ్మద్‌ రెహ్మాన్‌ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే భారత విదేశాంగ శాఖ అధికారులతోనూ సమావేశమై కేసు వివరాల డాక్యుమెంట్స్‌ను అందజేశారు.

నాడు వైఎస్‌ జగన్‌ చొరవతో 22 మందికి పాక్‌ చెర నుంచి స్వేచ్ఛ  
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మత్స్యకారులు గుజరాత్‌లోని ఓ చేపల వ్యాపారి వద్ద పని చేస్తూ 2018 నవంబర్‌ 31న అరేబియా సముద్రంలో వేటకు వెళ్లారు. గుజరాత్‌ తీరం నుంచి పాకిస్తాన్‌ జలాల వైపు వెళ్లి అక్కడి భద్రత దళాలకు ఈ 22 మంది చిక్కారు. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు మత్స్యకారులను విడిపించేందుకు కనీస చర్యలు చేపట్టలేదు. 

అనంతరం 2019లో అధికారంలోకి వచ్చి న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో రాష్ట్ర మంత్రులు, అధికారులు కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరిపారు. ఫలితంగా విదేశాంగ శాఖ అధికారులు పాక్‌ అధికారులతో మాట్లాడి.. 22 మంది మత్స్యకారులను 2020 జనవరి 6న సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తంగా కోటీ పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించారు.

బంగ్లాలో పరిస్థితులు దిగజారడంతో ఆందోళన
బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటుతో నెలకొన్న అస్థిరత నేటికీ కొనసాగుతోంది. సైన్యం ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఉన్నప్పటికీ భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలు క్షీణించాయి. మరోవైపు తాజాగా భారత వ్యతిరేకి, ఇంక్విలాబ్‌ మోంచో నేత షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ హత్యతో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. తాజాగా ఓ హిందూ యువకుడు దీపూ చంద్రదాస్‌ను నిరసనకారులు క్రూరంగా కొట్టి చంపేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అరాచక శక్తుల ఆగడాలు మితిమీరిపోయి సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. 

దౌత్యపరంగానూ భారత్‌ – బంగ్లాదేశ్‌ మధ్య దూరం పెరిగిన ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్కడి జైలులో మగ్గిపోతున్న ఆంధ్రా మత్స్యకారుల విడుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాలో పరిస్థితులు పూర్తిగా క్షీణించక ముందే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని బందీలను విడిపించేందుకు చర్యలు చేపట్టాలని బాధితుల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

సర్కారు చర్యలు శూన్యం  
బంగ్లాదేశ్‌ జైలులో బందీలుగా ఉన్న మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు బంగ్లాదేశ్‌ ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందే తప్ప ఆ దిశగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు సైతం ప్రకటనలకే పరిమితమయ్యారు తప్పితే గంగపుత్రులను విడుదల చేయించేందుకు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. 

మత్స్యకారులంతా విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం పరిధి పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు చెందిన వారే. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే పట్టించుకున్న పాపాన పోవడం లేదు.  

బాధిత కుటుంబాలకు భరోసానివ్వాలి 
దురదృష్టవశాత్తూ దారి తప్పి బంగ్లాదేశ్‌ కోస్టుగార్డుకు చిక్కిన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి భరోసానివ్వాలి. జైలులో మగ్గిపోతున్న తమ వారు ఎప్పుడొస్తారో తెలియక ఇక్కడ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కైన వారు పరాయి దేశంలో బందీలుగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులతో పూట గడవడం కష్టంగా మారింది. వారికి ఆర్థిక భరోసానివ్వడంతోపాటు బందీలను వీలైనంత త్వరగా విడిపించాలి.  – సూరాడ చిన్నారావు, కొండ్రాజుపాలెం  

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంకా జైల్లో..
బంగ్లాదేశ్‌ జైలులో 75 రోజులకు పైగా మగ్గిపోతున్న మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే జైలు అధికారులతోపాటు బంగ్లా సుంప్రీంకోర్టు న్యాయవాదితో కేసు విషయమై మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 9 మంది నేటికీ జైలులో వున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా బంగ్లా విదేశాంగ శాఖతో చిత్తశుద్ధితో సంప్రదింపులు జరిపి మత్స్యకారులను విడిపించి స్వస్థలాలకు తీసుకురావాలి. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి.      – వాసుపల్లి జానకీరామ్, ప్రెసిడెంట్, ఈస్ట్‌కోస్ట్‌ మెకనైజ్డ్‌ ఫిషింగ్‌ బోట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement