అనకాపల్లి: ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందినట్లు సమాచారం. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సోమవారం టాటా నగర్ నుండి ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన లోకోపైలట్ వెంటనే రైలును ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో నిలిపివేశారు. అగ్నిప్రమాదంపై రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.రైలు నిలిపివేయగానే భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. అయితే రైల్వే అధికారులు, సిబ్బంది చాకచక్యంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఒక బోగీలోని ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనలో మొదటగా బీ1 బోగీలో మంటలు చెలరేగగా.. అనంతరం ఎం1,బీ2 కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రైల్వే సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఇతర కోచ్‌లకు వ్యాపించకుండా వాటిని వేరు చేసి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు.



