నోబెల్ 2025: వైద్యశాస్త్రంలో ముగ్గురికి పురస్కారం | Nobel prize 2025 Medicine Award winners | Sakshi
Sakshi News home page

నోబెల్ 2025: వైద్యశాస్త్రంలో ముగ్గురికి పురస్కారం

Oct 6 2025 3:31 PM | Updated on Oct 6 2025 4:51 PM

Nobel prize 2025 Medicine Award winners

న్యూఢిల్లీ: 2025 సంవత్సరానికి గాను వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతిని ప్రకటించారు. మేరీ ఈ. బ్రంకోవ్ (Mary E. Brunkow), ఫ్రెడ్ రామ్స్‌డెల్ (Fred Ramsdell), షిమోన్ సకాగుచి (Shimon Sakaguchi) ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ తన సొంత అవయవాలపై దాడి చేయకుండా ఎలా నిరోధించబడుతుందనే రహస్యాన్ని ఛేదించినందుకుగాను వీరికి ఈ పురస్కారం లభించింది.

వీరి పరిశోధనలు పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ (Peripheral Immune Tolerance) అనే విధానంపై దృష్టి సారించాయి. దీని ద్వారా నియంత్రిత టీ కణాలు (Regulatory T cells) అని పిలిచే ప్రత్యేక రోగనిరోధక కణాలు ఆటోఇమ్యూన్ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించే సంరక్షకులుగా ఎలా పనిచేస్తాయో వారు ప్రపంచానికి తెలిపారు. మన రోగ నిరోధక వ్యవస్థ శరీర కణాలపై దాడి చేయకుండా అడ్డుకునేందుకు ఉన్న పెరిఫెరల్‌ ఇమ్యూన్‌ టాలరెన్స్‌ వ్యవస్థను గుర్తించినందుకు ఈ అవార్డు ఇస్తున్నట్లు నోబెల్‌ అవార్డు కమిటీ ప్రకటించింది. రోగ నిరోధక వ్యవస్థ కాపలదారుగా వ్యవహరించే టీ-సెల్స్‌లో కొన్ని అతిగా ప్రవర్తించకుండా నియంత్రిస్తున్నట్లు వీరు గుర్తించారు.  

శరీరంపైకి దాడి చేసే సూక్ష్మజీవులు అడ్డుకునేందుకు రోగ నిరోధక వ్యవస్థ కొన్ని కణాలను విడుదల చేస్తూంటుంది. టీ-సెల్స్‌ కూడా వీటిల్లో ఒకటి. అయితే కొన్ని ప్రత్యేకమైన టీ-సెల్స్‌ ఇతర రోగ నిరోధక వ్యవస్థ కణాలను నియంత్రిస్తూ... అవసరానికి మించి స్పందించకుండా చేస్తాయన్నమాట. ఈ ఆవిష్కరణ ఫలితంగా ఇమ్యూనాలజీలో సరికొత్త శాఖ ఒకటి మొదలైంది. కేన్సర్‌తోపాటు మధుమేహం, కీళ్లవాపు వంటి ఆటోఇమ్యూన్‌ వ్యాధుల (రోగ నిరోధక వ్యవస్థే సొంత అవయవాలపై దాడి చేయడం)కు కొత్త కొత్త చికిత్సలు అభివృద్ధి చేసే వీలేర్పడింది. అంతేకాకుండా.... అవయవ మార్పిడి జరిగినప్పుడు శరీరం కొత్త అవయవాలను తిరస్కరించకుండా ఉండేలా చేసేందుకు సాయపడింది వీరి ఆవిష్కరణ. 

ఎందుకు ముఖ్యం?
రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండే శరీర కణజాలంపై పదే పదే దాడులు చేయకపోవడం చాలాకాలంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తూ వచ్చింది. దీనికి కారణాలేమిటో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. ఇతర రోగ నిరోధక కణాలను నియంత్రించేందుకు ప్రత్యేకమైన టీ-సెల్స్‌ ఉన్నట్లు ఈ ఏడాది నోబెల్‌ అవార్డు గ్రహీతలు గుర్తించడంతో ఈ మిస్టరీ విడిపోయింది. టైప్‌-1 మధుమేహం, మల్టిపుల్‌ స్కెలరోసిస్‌, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వంటివన్నీ కొన్ని సందర్భాల్లో రోగ నిరోధక వ్యవస్థ దాడుల వల్ల వచ్చే వ్యాధులు కావడం గమనార్హం.

విజేతలకిచ్చే బహుమతి ఇదే..
నోబెల్‌ విజేతలకు ఇచ్చే మొత్తం నగదు బహుమతి 11 మిలియన్ స్వీడిష్ క్రోనోర్ (SEK). భారతీయ కరెన్సీలో ఇది సుమారు 10 కోట్లు. ఈ ఏడాది వైద్య రంగంలో ముగ్గురు శాస్త్రవేత్తలు.. మేరీ ఈ. బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమోన్ సకాగుచి - ఈ బహుమతిని గెలుచుకున్నందున వీరు ఈ 11 మిలియన్ క్రోనోర్‌ను సమానంగా పంచుకుంటారు. నగదుతో పాటు, ప్రతి నోబెల్ గ్రహీతకు బంగారు పతకం (Gold Medal): నోబెల్ ఫౌండేషన్ (Nobel Foundation) తయారు చేసిన ఆల్ఫ్రెడ్ నోబెల్ చిత్రంతో కూడిన 18 క్యారెట్ల బంగారు పతకం లభిస్తుంది. ప్రతి విజేతకు ప్రత్యేకంగా రూపొందించిన డిప్లొమా లభిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement